ఆ ఎమ్మెల్యే అమరావతి టూర్ సక్సెస్ అయిందా? నామినేటెడ్ పోస్ట్ వ్యవహారంలో ఇబ్బంది పడి.. ఇప్పుడు రిలాక్స్ అయ్యారా? పార్టీ పెద్దలతో మాట్లాడి పంతం నెగ్గించుకున్నారా? పదవి పొందిన నాయకుడి ప్రమాణ స్వీకారం ఆగిందా… ఆపారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఆయనకొచ్చిన ఇబ్బంది ఏంటి?
ఎవరికీ టచ్‌లోకి రానని ప్రకటించిన ఎమ్మెల్యే!
చిత్తూరు జిల్లాలో కొన్ని నామినేటేడ్ పదవులు స్థానికేతరులకు ఇవ్వడంతో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యంగా కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల ట్రస్ట్ బోర్డ్ పదవుల భర్తీ.. నియోజకవర్గాల్లోని లోకల్ వైసీపీ కేడర్.. నాయకులకు రుచించలేదు. ఓపెన్‌గానే విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలు స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడికి కారణమైంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎంచుకున్న మార్గమే పార్టీవర్గాల్లో చర్చకు కారణమైంది. ఆలయ ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్ పదవిని స్థానికులకు ఇప్పించే వరకు ఎవరికీ టచ్‌లోకి రాబోనని చెప్పడంతో చర్చల్లోకి వచ్చారు ఎమ్మెల్యే.
శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ నియామకంపై కినుక!
శ్రీకాళహస్తి ఆలయ బోర్డు ఛైర్మన్‌గా బీరేంద్ర వర్మ పేరును ప్రకటించారు. ఆయన స్థానంలో స్థానిక వైసీపీ నేత అంజూరు తారక శ్రీనివాసులు పేరును ఖరారు చేసినట్టు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. అధికారిక ఉత్తర్వులు వెలువడటమే ఆలస్యమన్నది వారు చెప్పేమాట. ప్రకటన రాకముందే కేడర్ పండగ చేసుకుంటున్న పరిస్థితి. బీరేంద్ర వర్మది సత్యవేడు. ఆయన్ని శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్‌గా నియమిస్తూ జూలై 17న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రకటన స్థానిక వైసీపీ కేడర్‌తోపాటు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని ఆశ్చర్యపరిచిందట. ఇదే పదవిపై ఆశ పెట్టుకున్న అనేకమంది తీవ్ర నిరాశలోకి వెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలో స్థానిక నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్లను తట్టుకోలేక జీవో విడుదలైన 3 రోజులు ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారట ఎమ్మెల్యే.
ఆలయ బోర్డు ఛైర్మన్ పదవిపై పంచాయితీ పెట్టారట!
తన గెలుపునకు వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది తప్పదనుకున్నారో ఏమో.. పార్టీ పెద్దల దగ్గర ట్రస్ట్ బోర్డు పంచాయితీ పెట్టారట ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి. జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర కూడా ఆయన గట్టిగానే పట్టుబట్టారట. తాడేపల్లి వెళ్లి కూడా జీవో మార్చాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఒత్తిళ్ల కారణంగానే శ్రీకాళహస్తి ఆలయ బోర్డు ఛైర్మన్‌గా బీరేంద్ర ప్రమాణం చేయకుండా ఆగిపోయారని టాక్. బోర్డు సభ్యులుగా స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారట.
తాడేపల్లి వెళ్లి పంతం నెగ్గించుకున్నారా?
ఛైర్మన్, ఎక్స్‌అఫీషియో సభ్యులను కలుపుకొని 16 మందితో పాలకవర్గం ఏర్పాటవుతుందని ప్రచారం జరుగుతోంది. అందులో పదిమంది స్థానికులకు చోటు కల్పిస్తారట. అయితే జులైలో పేరు ప్రకటించినా ఇంత వరకు ప్రమాణ స్వీకారం చేయని బీరేంద్ర వర్మ ఎలా రియాక్ట్ అవుతారన్నది ప్రశ్న. అనుచరులు ప్రచారం చేస్తున్నట్టు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పంతం నెగ్గించుకున్నారో లేక కేడర్‌లో ఉత్సాహం కోసం లీకులు ఇస్తున్నారో తెలియాల్సి ఉంది. కేడర్‌లో మాత్రం ఇది తమ ఎమ్మెల్యేకు పరీక్షా సమయం అని చర్చించుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.