తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ కోసం ఆ నాయకురాలు గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారా? ఏఐసీసీ లెవల్‌లో తనకున్న పలుకుబడి మొత్తాన్ని వాడేస్తున్నారా? ఉన్న పరిస్థితులు, ఈక్వేషన్స్‌ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ… కన్విన్సింగ్‌గా లెక్కలు చెబుతున్నారా? ఎవరా నాయకురాలు? ఆమె గురించి రాష్ట్ర పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆల్రెడీ ఇచ్చిన పదవి మీదే పెదవి విరుపులు ఉంటే.. ఇప్పుడు మరోటా అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి?
తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మళ్ళీ తెర మీదికి వచ్చింది. అదిక ఎంతో దూరం లేదు, గుమ్మం ముందుకు వచ్చేసినట్టేనని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలకు ప్రస్తుతం ఉన్న ఆలోచనలు, మిగతా వ్యవహారాలన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే…దసరా పండగ లోపే మంత్రివర్గ విస్తరణ ప్రక్రియను పూర్తిచేయాలనుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి, పార్టీ ముఖ్యుల ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా జరిగిన చర్చల్లో విస్తరణ వ్యవహారం కాస్త కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో.. ఇటు కాంగ్రెస్, అటు రాజకీయ వర్గాల్లో రకరకాల అంచనాలు, విశ్లేషణలు మొదలయ్యాయి. మరోవైపు బీసీ మహిళ… కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంతో, ఆ స్థానంలో… రెండు ఈక్వేషన్స్ కలిసి వచ్చేలా ఎమ్మెల్సీ విజయశాంతి పావులు కదుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
మహిళ, బీసీ కోటా రెండూ తనకు కలిసి వస్తాయిగనుక…. తనకో అవకాశం ఇవ్వాలంటూ విజయశాంతి ఢిల్లీ పరిచయాలతో లాబీయింగ్ నడిపిస్తున్నారన్నది కాంగ్రెస్ ఇంటర్నల్ టాక్. గతంలోనే.. అసలు రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా… ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారామె. ఆ కోణంలోనే.. ఇప్పుడు కూడా అధిష్టానాన్నే నమ్ముకుని అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. బీసీ మహిళను క్యాబినెట్ నుంచి తప్పించారు కాబట్టి.. అదే కోటాలో తనకు మంత్రి పదవి కావాలంటూ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట విజయశాంతి. అందులో భాగంగా ఏఐసీసీలో తనకున్న పలుకుబడి మొత్తాన్ని ఉపయోగిస్తున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అయితే విజయశాంతి ఎపిసోడ్ పై సొంత పార్టీ నేతల్లోనే భిన్న వాదనలు ఉన్నాయి. ఆమె తన పలుకుబడి ఉపయోగించి… అధిష్టానాన్ని మెప్పించి ఎమ్మెల్సీ పదవి అయితే తీసుకున్నారుగానీ…. ఆ హోదాలో పార్టీకి ఏమాత్రం ఉపయోగపడలేదన్న వాదనలు గాంధీభవన్‌లో ఉన్నాయి.
తాను ఎమ్మెల్సీ అయ్యాక… పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారామె. సభ్యురాలిగా శాసనమండలికి రావడం తప్ప…. ఏ ఒక్క ఎన్నికలో కూడా పార్టీ కోసం నిలబడి, ప్రచారం చేసిన దాఖలాలు లేవన్న చర్చ ప్రధానంగా జరుగుతోంది. పార్టీ కోసం పని చేసిన వాళ్లని కాదని అధిష్టానం కూడా అంచనాల పరంగా తప్పటడుగులు వేస్తోందని ఓ సీనియర్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటోంది హస్తం కేడర్. అసలు విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పైనే అభ్యంతరాలు వ్యక్తమైన వాతావరణంలో ఇప్పుడిక మంత్రి పదవి కూడా ఇస్తే…. పరిస్థితులు ఎలా మారతాయోనన్న డిస్కషన్ సైతం నడుస్తోంది కాంగ్రెస్ వర్గాల్లో.
కేబినెట్‌లోకి ఎవర్ని తీసుకోవాలన్న పూర్తి నిర్ణయాధికారం ముఖ్యమంత్రికే ఉంటుంది. దీంతో…ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠగా చూస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్. ఎమ్మెల్సీ అయ్యాక కూడా… విజయశాంతి ఒకటి రెండు సందర్భాల్లో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, ట్వీట్స్ చేయడం లాంటివి జరిగాయి. అలాంటి నేతను మంత్రివర్గంలోకి తీసుకుంటే… తలనొప్పులు తప్పవంటూ పార్టీ సీనియర్స్ కొందరు గట్టిగా వాదిస్తున్నారు. ఇలాంటి రకరకాల చర్చలు, అనుమానాల నడుమ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది.

