Telangana BJP to Make Key Changes
తెలంగాణలో ఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్న బీజేపీ.. పార్టీపరంగా కీలక మార్పులు చేయబోతుందా? జాతీయ నాయకత్వం దగ్గరకు సర్వే రిపోర్టులు వెళ్లాయా? కొందరిపై వేటు తప్పదా? ఎన్నికల టీమ్‌ను రెడీ చేసే పనిలో కమలనాథులు స్పీడ్ పెంచారా? లెట్స్ వాచ్..!
హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాక… తెలంగాణ బీజేపీలో భారీగా మార్పులు చేర్పులు చేపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ను పంపేశారు. ఇప్పుడు పోలింగ్ బూత్ నుంచి రాష్ట్రస్థాయి వరకు పూర్తి ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ఉన్న కమిటీల పనితీరును నిశితంగా గమనిస్తున్నారట. క్షేత్రస్థాయిలో చేపడుతున్న కార్యక్రమాలు.. వాటి ద్వారా వస్తోన్న పొలిటికల్ మైలేజీని వడపోస్తున్నారట.
బీజేపీ అనుబంధ కమిటీలలో వివిధ మోర్చాల పనితీరుపై కేంద్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. సర్వే నివేదికల ఆధారంగా ఒకటి రెండు మోర్చాల పనితీరు అస్సలు బాగోలేదట. జిల్లా బీజేపీ అధ్యక్షుల పనితీరు సైతం పూర్‌గానే ఉందని గ్రహించారట. పార్టీ ఆంతరంగిక సమావేశాల్లో ఢిల్లీ నేతలు పెదవి విరిచినట్టు సమాచారం. ఇంత రాజకీయ వేడి ఉన్నప్పటికీ కొన్ని చోట్ల కమిటీలు వేయకపోవడం.. మండలస్థాయిలో శిక్షణ తరగతులు పూర్తి చేయకపోవడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారట.
బీజేపీ రాష్ట్ర కమిటీ ఏదైనా పిలుపు ఇస్తే తప్ప జిల్లా, మండల స్థాయిలో పార్టీ నేతలు రోడ్డెక్కడం లేదట. అవి కూడా ఏదో చేశామంటే చేశాం అన్నట్టుగా ముగిస్తున్నారట. స్థానిక సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలనే ఆలోచనే రాష్ట్ర నేతల్లో లేదని ఢిల్లీ పెద్దలు గుర్తించారట. వాస్తవానికి తెలంగాణలో కిందిస్థాయిలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలు, కమిటీల వివరాలు ఎప్పటికప్పుడు సెంట్రల్ పార్టీకి నివేదించాలి. అలా వచ్చిన రిపోర్టులు చూశాక అక్కడి పెద్దలకు మైండ్ బ్లాంక్ అవుతోందట. పార్టీ పదవుల్లో ఉత్సవ విగ్రహాలుగా ఉన్న వారిని పక్కన పెట్టి… కొత్త వారికి పగ్గాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారట. కొన్ని కమిటీలలోనూ మార్పులు ఉంటాయని టాక్.
ఆ మధ్య రాష్ట్రానికి వచ్చిన బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సైతం.. జిల్లా అధ్యక్షుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పదవుల్లో ఉన్నవారు హైదరాబాద్‌లో కాకుండా జిల్లాల్లో ఉండాలని క్లాస్ తీసుకున్నారు. అయినప్పటికీ చాలా మంది ఆ సూచనలను లైట్ తీసుకున్నారట. ఇదే అంశంపై కొద్ది నెలల క్రితం తమిళనాడులో చాలా మంది జిల్లా అధ్యక్షులను పార్టీ పదవుల నుంచి తప్పించారు. అదే సీన్ తెలంగాణలోనూ రిపీట్ అవుతుందని అభిప్రాయ పడుతున్నారు.
బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికంటే ముందునుంచే కొందరు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. సంజయ్ వచ్చాక కొందరే జిల్లా సారథులుగా వచ్చారు. ఇప్పుడు మార్పులు చేర్పులపై చర్చ జరుగుతున్న తరుణంలో పార్టీ ఆఫీస్ బేరర్‌లతోపాటు.. రెండు మూడు మోర్చాల రాష్ట్ర అధ్యక్షులను మారుస్తారనే ప్రచారం నడుస్తోంది. ఇదే సమంలో 10 జిల్లాలకు కొత్త అధ్యక్షులు వస్తారని చెవులు కొరుక్కుంటున్నారు. అయితే లిస్ట్‌లో ఎవరు ఉంటారనేది సస్పెన్స్. ఎన్నికల టీమ్ కూర్పులో భాగంగా.. ఈ మార్పులు కీలక అడుగుగా అభిప్రాయపడుతున్నారట కమలనాథులు.