Site icon NTV Telugu

తెలంగాణ బీజేపీలో పాత నేతలు ఫీల్ అవుతున్నారా?

మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుందని చెబుతారు. అక్కడ మాత్రం మంది ఎక్కువై.. ప్రొటోకాల్‌ సమస్యలు వస్తున్నాయి. ముందొచ్చిన చెవులు కంటే.. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా మారింది సీన్‌. ఇంకేముంది.. ముందు నుంచీ జెండాలు మోసిన పాతకాపులు కుతకుతలాడుతున్నారట.

పాత నేతలు వెనక బెంచీలకే పరిమితం..!

తెలంగాణ బీజేపీలో ఒకప్పుడు చెప్పుకోదగ్గ నాయకులు నలుగురో.. ఐదుగురో ఉండేవారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక.. కాషాయ శిబిరంలో నేతల జాబితా పెరిగింది. వలస నాయకుల సంఖ్య ఎక్కువైంది. మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్సీలు.. ఇతర ప్రజాప్రతినిధులు బీజేపీ కండువా కప్పేసుకున్నారు. వలస నేతల రాక చూసి.. బీజేపీ బలపడుతుందని పైస్థాయి నేతలు… కిందిస్థాయిలో కేడర్‌ సంతోష పడుతున్నా.. మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకులు మాత్రం వెనక బెంచికి పరిమితమై రుస రుసలాడుతున్నారట.

కొత్త నేతలకే పార్టీ మీటింగ్స్‌లో గౌరవం..!

టీడీపీ, టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లలో కీలక స్థానాల్లో పనిచేసి.. ప్రజా ప్రతినిధులుగా గెలిచి ప్రస్తుతం బీజేపీ షెల్టర్‌లో ఉన్నవారు ఎందరో. హుజురాబాద్‌ ఉపఎన్నిక బ్యాక్‌ డ్రాప్‌లో కొందరు మాజీ మంత్రులు వెళ్లిపోయినా.. మరికొందరు ఎటూ కదలలేదు. ఒకప్పుడు బీజేపీ సమావేశాల్లో వేదికపై ఒకరో ఇద్దరో ముఖ్య నేతలు.. గెలిచిన ప్రజాప్రతినిధులు కనిపించేవారు. ఇప్పుడు గెలిచినా.. గెలవకపోయినా.. గతంలో వారి హోదాకు తగ్గట్టుగా పార్టీ సమావేశాల్లో గౌరవం ఇవ్వాల్సి వస్తోందట. లేకపోతే వారంతా ఫీలవుతున్నట్టు సమాచారం.

లోలోపల కుతకుతలాడుతున్న పాత కాపులు ..!

ఇటీవల ప్రకటించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితాలోనూ వలస నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. మరికొందరు వలస నేతకు పార్టీ కమిటీలలో జాతీయ స్థాయి నుంచి.. రాష్ట్ర స్థాయి వరకు కీలక హోదాలే కట్టబెట్టారు. వీరందరికీ ప్రొటోకాల్‌ ప్రకారం వేదికపై కుర్చీలు వేయాల్సిందే. వీరు కాకుండా మీటింగ్‌కు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు వస్తే.. వారిని స్టేజి ఎక్కించాల్సిందే. మరి.. దశాబ్దాలుగా బీజేపీలో ఉంటూ.. గతంలో పార్టీలో కీలక బాధ్యతల్లో పనిచేసిన వారి పరిస్థితి ఏంటి? అంటే..! వేదికపై ఖాళీ ఉంటే పిలుస్తారు. అదీ వెనక కుర్చీల్లో సర్దుకుపోవాలి. అక్కడ ఖాళీ లేదంటే.. కిందే కూర్చోవాలి…! ఈ పరిణామాలు ఇబ్బందిగా ఉన్నా.. పాతకాపులు మాత్రం పైకి నవ్వుతూ.. లోలోపల కుత కుతలాడిపోతున్నారట.

కొందరు మౌనం.. మరికొందరు ఆఫీస్‌కు దూరం..!

కొత్తక వింత.. పాత రోత అన్నట్టు చూడటమే ఓల్డ్‌ బీజేపీ నేతలకు రుచించడం లేదట. ఈ అవమానాలు భరించ లేక కొందరు సీనియర్‌ బీజేపీ నాయకులు మౌనంగా ఉండిపోతుంటే.. ఇంకొందరు ఆఫీస్‌ గుమ్మమే తొక్కడం లేదట. పాత బీజేపీ నేతలు ఆఫీసులకు వెళ్తుంటే వారిని గుర్తుపట్టి పలకరించేవాళ్లే కరువయ్యారట. సంఘ్‌ పరివార్‌ క్షేత్రాల్లో కొత్తవారికి దణ్ణం పెట్టి.. తమని తాము పరిచయం చేసుకుని పీఆర్‌ పెంచుకుంటారు. వలస నేతలకు బీజేపీ సంప్రదాయాల నీళ్లు వంటబట్టడానికి ఇంకా టైమ్‌ పట్టొచ్చు. కానీ… పాత నేతలే ఇంకా అక్కడే ఆగిపోయారని అనుకుంటున్నారట. అందుకే కాషాయంలో ఎక్కువైన కషాయాన్ని ఎంత మంది జీర్ణించుకుంటో చూడాలంటున్నాయి పార్టీ శ్రేణులు.

Exit mobile version