ఎన్నో ఆశలతో బీజేపీలో చేరిన నాయకులు పక్కచూపులు చూస్తున్నారా? పార్టీ పెద్దలు పిలిస్తే.. ముందు ఆ సంగతి తేల్చాలని డిమాండ్ చేస్తున్నారా? కాషాయ శిబిరంలో చర్చగా మారిన ఆ అంశం ఏంటి? కమలనాథులను ఏ సమస్య కలవరపెడుతోంది?
బీజేపీలో అభ్యర్థులపై క్లారిటీ లేదు
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు హోరెత్తిస్తున్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగామన్నది వారి వాదన. ఈ విషయంలో పైకి ఎన్ని చెప్పినా కమలనాథుల్లో అంతర్గతంగా మరో చర్చ జరుగుతోంది. రాజకీయంగా అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో బలంగా లేమని ఆందోళన చెందుతున్నారట. గ్రౌండ్ లెవల్లో బలోపేతం కాకుండా.. నియోజకవర్గాలకు ఒక ముఖాన్ని పరిచయం చేయకుండా ఎన్ని చేసినా నేల విడిచి సాము చేయడమేనన్నది వారి అభిప్రాయం. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టి ఇంఛార్జ్‌ను ప్రకటించాలని.. అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వాలని కేడర్ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి.
వలస నేతలకు మింగుడు పడటం లేదా?
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని మెజారిటీ సెగ్మెంట్లకు బీజేపీ నుంచి ఫలానా నాయకుడు పోటీ చేస్తారనే క్లారిటీ లేదు. బీజేపీలో ముందుగా అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం లేకపోయినా అనధికారికంగానైనా చెబితే మంచిందనే చర్చ జరుగుతోంది. కానీ.. ఆ మేరకు సంకేతాలు పంపేందుకు కమలనాథులు జంకుతున్నారు. ఈ వైఖరే బీజేపీలోకి వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకు.. వారి అనుచరులకు మింగుడు పడటం లేదు.
టికెట్ ఆశించి బీజేపీలోకి వచ్చిన వారు బెంబేలు
కమలం గుర్తుపై పోటీ చేసే ఆలోచనతో బీజేపీలో చేరిన నాయకులు అనేకమంది. అలాంటి వారిలో చాలా మంది తమ రాజకీయ భవిష్యత్‌పై అభద్రతాతో ఉన్నారట. టికెట్‌పై క్లారిటీ లేకపోవడం.. నమ్మకం ఇచ్చే పెద్దలు లేక టెన్షన్ పడుతున్నారట. దాంతో పార్టీ కార్యక్రమాలకు కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. కొన్నిచోట్ల తమకు తెలియకుండానే తమకన్నా తక్కువస్థాయి నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. వారికి ప్రాధాన్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నారని గుర్రుగా ఉన్నారట. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారే తామే అభ్యర్థులమని ప్రచారం చేసేసుకుంటున్నారు. టికెట్ ఆశించి బీజేపీలోకి వచ్చిన పెద్దలకు అది రుచించడం లేదట.
బీజేపీలో చేరికలు తగ్గిపోవడానికి కారణాలేంటి?
కాషాయ కండువా కప్పుకొన్న సమయంలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం వలస నేతల్లో కనిపించడం లేదు. సన్నిహితులు కలిసినప్పుడు.. ఆంతరంగిక సమావేశాల్లోనూ భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. బీజేపీ పెద్దల నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఇప్పుడే తమ దారి చూసుకోవడం బెటర్ అనే అభిప్రాయంలో ఉన్నట్టు కాషాయ శిబిరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు కొత్తగా బీజేపీకి వచ్చే వారికి బ్రేక్‌లు వేస్తున్నాయట. ఈ మధ్య బీజేపీలో చేరికలు తగ్గిపోవడానికి అదే కారణమన్నది కొందరి అభిప్రాయం.
నేతలకు భరోసా ఇచ్చేవాళ్లు కరువయ్యారా?
అభ్యర్థి ఎవరో చెప్పేస్తే.. నియోజకవర్గాల్లో పనిచేసుకుంటామని.. స్థానికంగా చేరికలు ఊపందుకుంటాయని పార్టీ నేతల దగ్గర ప్రస్తావిస్తున్నారట. ఒకవేళ ఏదైనా మార్పులు ఉంటే టికెట్లు ఇచ్చే సమయంలో చూసుకోవచ్చునని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని చెబుతున్నారు. మరో పార్టీ నుంచి వచ్చి..ప్రస్తుతం బీజేపీ కోర్ కమిటీ సభ్యుడి ఉన్న నాయకుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ ఫోకస్ పెట్టి.. అక్కడ బలంగా ఉన్నవారిని పార్టీలోకి తీసుకురావడం.. ఉన్న వారికి భరోసా ఇవ్వడం ఈ సమయంలో చాలా ముఖ్యమన్నది ఆయన వాదన. మరి.. బీజేపీ పెద్దలు ఈ విషయం గమనించారో లేదో చూడాలి.