OTR: పాయల్ శంకర్ రైతు యాత్రకు అధిష్టానం నో.. అసలు కారణం ఏంటి…?

  • ఇక వ్యక్తి కాకుండా పార్టీ కేంద్రంగా బీజేపీ కార్యక్రమాలు..
  • తన నియోజకవర్గంలో 4 రోజులు ఈటల పాదయాత్ర..
  • నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ లోకల్‌ ప్రోగ్రామ్‌ ప్లానింగ్‌
Payal

Payal

పార్టీ కోసం…. పార్టీ జెండా, అజెండాతోనే అంటూ ఆ ఎమ్మెల్యే అడుగులేస్తుంటే బీజేపీ పెద్దలు అడ్డుకున్నారా? మైలేజ్‌ తీసుకువస్తానని ఆయన అంటుంటే… ముందరి కాళ్ళకు బంధాలెందుకు వేస్తున్నారు? నీ యాత్రకు నో పర్మిషన్‌ అంటూ అధినాయకత్వ స్థాయిలో అనుమతి నిరాకరించడానికి కారణం ఏంటి? ఎవరా శాసనసభ్యుడు? ఆయన అనుకుంటున్నదేంటి? రాష్ట్ర బీజేపీ పెద్దలు భయపడుతున్నదేంటి?

తెలంగాణలో బీజేపీ లైన్‌ మార్చింది. ఇక వ్యక్తి కేంద్రంగా కాకుండా… పార్టీ కేంద్రంగా జరిగే కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడైనట్టు తెలుస్తోంది. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలపై ఫోకస్‌ చేస్తూ… లోకల్‌గా నిర్వహించే ఆందోళనలు, నిరసనలకు నాయకత్వం ఓకే చెబుతోంది. క్షేత్ర స్థాయిలో పోరాటాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సూచిస్తోంది. అందుకు తగ్గట్టే నేతలు తమ నియోజక ర్గాల్లో, జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కూడా. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను ఎత్తేయాలంటూ ఎంపీ ఈటల రాజేందర్ తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నాలుగు రోజులు పాదయాత్ర చేశారు.

నిజామాబాద్‌లోనూ రైల్వే బ్రిడ్జి కోసం ఆందోళన జరిగింది. ఇక విద్యుత్ కోతలు, రైతు సమస్యలపై జిల్లాల్లో అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ర్ట, కేంద్ర పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఇంకొందరు నాయకులు తమ తమ ఏరియాలో ఉన్న సమస్యలపై ఆందోళన కార్యక్రమాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదే ఊపులో… బీజేఎల్పీ ఉప నాయకుడు పాయల్ శంకర్ కూడా అదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు రైతు యాత్ర చేయాలని అనుకున్నారు.

దసరా తర్వాత తన యాత్ర ఉంటుందని ఆయన ప్రకటించారు కూడా. దానికి సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ ఏర్పాట్లు చేసుకున్నా….దసరాతో పాటు దీపావళి కూడా వచ్చి వెళ్లిపోయినా పాయల్‌ యాత్ర మాత్రం ప్రారంభం కాలేదు. ఎందకంటే… పార్టీ నుంచి పర్మిషన్‌ రాలేదన్నది ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అదేంటీ….జనంలో ఉండాలి, కార్యక్రమాలు చేయాలని అధినాయకత్వం ఆదేశించింది కదా…? అలాంటప్పుడు ఉత్సాహంగా ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ దాకా యాత్ర చేసి పొలిటికల్‌ మైలేజ్‌ తీసుకువస్తానన్న లీడర్‌కి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే… అసలు ట్విస్ట్‌ అక్కడే ఉందని అంటున్నాయి కమలం వర్గాలు.

పాయల్‌ శంకర్‌ లోకల్‌గా కార్యక్రమాలు నిర్వహించి తన నియోజకవర్గంలో పార్టీకి ఊపు తెస్తానంటే ఓకేగానీ… అక్కడి నుంచి ఇక్కడిదాకా అంటే కుదరదని, దానివల్ల లేనిపోని కొత్త సమస్యలు వస్తాయని బీజేపీ ముఖ్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ నియోజకవర్గాల మీదుగా హైదరాబాద్‌దాకా ఈ యాత్ర రూట్ ఉండడంతో మధ్యలో అభ్యంతరాలు వస్తాయని, అంతర్గతంగా పార్టీలో లొల్లి అవుతుందన్న భావనతో కాషాయ ముఖ్య నేతలు ఉన్నట్టు సమాచారం. తీరా అనుమతి ఇచ్చి, ఎక్కడో ఒక చోట సమస్య వచ్చి, రచ్చ అయ్యాక ప్యాచప్‌ చేసుకునేకంటే… ఆది నిష్టూరమే మేలన్న అభిప్రాయంతో ఉన్నారట తెలంగాణ బీజేపీ ముఖ్యులు.

అందుకే ఆదిలాబాద్‌ ఎమ్మెల్యేకి యాత్ర పర్మిషన్‌ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. అటు పాయల్‌ శంకర్‌ మాత్రం ఈ విషయంలో బాగా నారాజ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం, పార్టీ జెండాతోనే తాను యాత్ర చేస్తానని అంటున్నా… అనుమతి ఇవ్వకపోవడం ఏంటంటూ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కావాలనే కొందరు నేతలు అడ్డుకుంటున్నారని కూడా అంతర్గత సంభాషణల్లోచెబుతున్నారట పాయల్‌ అనుచరులు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఏం చేస్తారు? తన నియోజకవర్గానికే పరిమితం అవుతారా? లేక ఫైనల్‌గా తాను అనుకున్నది సాధిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.