వారం రోజులుగా టీడీపీలో బాలయ్య హాట్ టాపిక్. ఆయన తీరు లాభమో.. నష్టమో.. తేల్చుకోలేకపోతున్నారట తమ్ముళ్లు. సున్నితమైన విషయాల్లో బాలయ్య టచ్ మీ నాట్‌గా ఉండాలని అనుకుంటున్నారా? ఇంతకీ ఏ విషయంలో పార్టీ ఆందోళన చెందుతోంది? లెట్స్ వాచ్..!
బాలయ్య వల్ల ఎదురయ్యే కష్టాలపై టీడీపీలో ఆరా?
మా ఎన్నికలకు ముందు.. ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలు సినీ ఇండస్ట్రీలో ఎంత చర్చకు దారి తీశాయో.. దాదాపు అంతే చర్చ ఇప్పుడు టీడీపీలో జరుగుతోంది. మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపు తర్వాత మోహన్‌బాబు.. బాలకృష్ణ ఇంటికెళ్లడంతో టీడీపీ సీనియర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారట. రకరకాల ఇబ్బందులతో సతమతం అవుతున్న తరుణంలో ఈ కొత్త తలనొప్పి ఏంటి? బాలయ్య వల్ల ఎలాంటి కష్టాలు ఎదురుకానున్నాయో అని టీడీపీ శిబిరంలో ఆరా తీస్తున్నారట.
మా ఎన్నికల గొడవలో లౌక్యం ప్రదర్శిస్తే పోయేదా?
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ.. మా ఎన్నికల సమయంలో ఆచితూచి వ్యవహరించి ఉంటే బాగుండేదని పార్టీలో చర్చ జరుగుతోందట. ఇప్పటికీ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినట్టుగా వ్యవహరిస్తే పార్టీకి ఇబ్బందులొస్తాయని అనుకుంటున్నారట. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్న బాలయ్య ముక్కు సూటిగా కాకుండా.. కొంత లౌక్యం ప్రదర్శిస్తే ఇబ్బందులు రాబోవని లెక్కలేస్తున్నారట.
మా గొడవలు రాజకీయాలకు కనెక్ట్ అయితే టీడీపీపై ప్రభావం?
ప్రకాష్‌రాజ్‌కు మెగా కాంపౌండ్ సపోర్ట్ చేసినా.. ఎన్నికల టైమ్‌లో తర్వాత జరిగిన పరిణామాలు టీడీపీలో చర్చగా మారాయి. చిరంజీవి, మోహన్‌బాబు ఫోన్‌లో మాట్లాడుకోవడం.. అందరం కలిసి పనిచేయాలని అనుకోవడంపైనా పార్టీ శ్రేణులు ఫోకస్ పెట్టాయి. అయితే పోలింగ్ రోజున బాలయ్యను ప్రకాష్‌రాజ్ పలకరించే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదని కొందరు గుర్తు చేస్తున్నారట. ప్రకాష్‌రాజ్‌కు మెగా కాంపౌండ్ మద్దతివ్వడం వల్లే బాలయ్య పట్టించుకోలేదని అనుకుంటున్నారు. ఇదంతా సినిమా ఇండస్ట్రీ వరకే నడుస్తాయేమో కానీ.. రాజకీయాలకు కనెక్ట్ అయితే ఆ ప్రభావం పార్టీ మీద ఉంటుందని ఆందోళన చెందుతున్నారట.
బాలయ్య తీరును ప్రత్యర్థులు అస్త్రాలుగా మార్చుకుంటారా?
ఇకపై సినిమా ఇండస్ట్రీ వ్యవహారాల్లో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాలయ్య ఆచితూచి అడుగు వేస్తే మంచిదని టీడీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారట. బాలకృష్ణ తీరును ప్రత్యర్థులు అస్త్రాలుగా మలుచుకుని టీడీపీని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రమాదం లేకపోలేదని చర్చ జరుగుతోంది. గతంలోలా ఇప్పుడు రాజకీయాలు ఫేర్‌గా లేవని.. సినిమా ఇండస్ట్రీలోనూ రకరకాల రాజకీయాలు వచ్చేసిన క్రమంలో బాలకృష్ణ వ్యూహం మార్చాలన్నది ఒక వాదన. ఈ సంకట పరిస్థితి రాకుండా చంద్రబాబు లేదా లోకేష్‌లు అప్రమత్తమై బాలకృష్ణతో మాట్లాడి.. పార్టీ ఫీలింగ్ అర్థమయ్యేలా చెబితే బాగుండేదని టాక్. అందుకే టీడీపీ శ్రేణుల్లో చర్చగా మారారు బాలయ్య. మరి.. ఈ ఎపిసోడ్ నుంచి దూరంగా ఉండేందుకు టీడీపీ ఏం చేస్తుందో చూడాలి.
