OTR: తాండూరులో ఇద్దరు పవర్ సెంటర్లు.. అన్నదమ్ముల ఆధిపత్య పోరుతో అధికారులకు తిప్పలు..

  • ఎమ్మెల్యే బ్రదర్స్‌ చెలగాటం, అధికారులకు ఇరకాటం..
  • గత ఎన్నికల్లో తాండూరు ఎమ్మెల్యేగా మనోహర్‌రెడ్డి గెలుపు..
  • ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనివాసరెడ్డి మీద షాడో ఆరోపణలు
Thandooru

Thandooru

అక్కడ అన్నదమ్ముల చెలగాటం అధికారులకు ఇరకాటంగా మారిందా? అన్న ఎమ్మెల్యే అయితే… తమ్ముడు షాడో అవతారం ఎత్తాడా? వాళ్ళిద్దరి మధ్యనే అవగాహన లేక ఎవరికి వారు విరుద్ధమైన ఆదేశాలివ్వడం అధికారులకు సంకటంగా మారుతోందా? ఎవరి మాట వినకున్నా ట్రాన్స్‌ఫర్‌ కామన్‌ అయిందంటున్న ఆ నియోజకవర్గం ఏది? ఎవరా బ్రదర్స్‌?

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని అధికారుల్ని ఎప్పటికప్పుడు బదిలీల భయం వెంటాడుతోందట. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న స్వేచ్ఛతో ప్రతి ఒక్కరు తమపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఆయన సోదరుడు ఆదేశాలు ఇస్తున్నారని, ఎవర్ని ఫాలో అవ్వాలో అర్ధం కావడం లేదంటూ తలలు పట్టుకుంటున్నారట. ఇక్కడ అధికార పార్టీ నేతలకు, పోలీస్ శాఖకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటున్నారు. తాను చెప్పిన పనులు చేయలేకపోతే ఇక్కడ విధులు నిర్వహించే అర్హత లేదంటూ పోలీస్ అధికారులను ఎమ్మెల్యే వెనక్కి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

దాంతో… అసలు ఎమ్మెల్యేకు, పోలీస్ అధికారులకు మధ్య ఎక్కడ చెడింది? ఎందుకు విభేదాలు తలెత్తుతున్నది చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తాండూరు ఎమ్మెల్యేగా బుయ్యని మనోహర్ రెడ్డి గెలిచారు. అప్పటి నుంచి లోకల్‌గా పోలీస్ శాఖలో వరుస బదిలీలు జరిగాయి. నియోజకవర్గ పరిధిలో సుమారు 15 మంది ఎస్ఐలు, ముగ్గురు సీఐలు, ఒక డీఎస్పీ బదిలీ కావడం పోలీస్ శాఖలో చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి పోలీస్‌తో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై వివిధ పనుల కోసం ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ…. అన్నదమ్ములు ఇద్దరూ ఒక మాట మీద లేకపోవడంతో ఇటు నాయకులు, అటు అధికారులు సతమతమవుతున్నారట.

తమ పార్టీ కార్యకర్తలకు పోలీస్ అధికారులు సహకరించడం లేదనే కారణంతో తరచూ బదిలీలకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సీఐలు కాంగ్రెస్ నాయకుల మాట వినడం లేదంటూ వారిని ట్రాన్స్‌ఫర్‌ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అందుకు పోలీస్ ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాండూరు నియోజకవర్గం పరిధిలో కాగ్నా వాగు ప్రవహిస్తోంది. ఇక్కడి ఇసుకకు భారీ డిమాండ్ ఉంటింది. అలాగే సుద్ద, నాపరాయి, ఎర్రమట్టి వంటి వాటి అక్రమ రవాణా తాండూరులో ఓపెన్‌ సీక్రెట్‌. దీనికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రయత్నించడం అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులకు పంటికింద రాయిలా మారిందని అంటున్నారు.

అక్రమ రవాణాను అరికట్టాలని అధికారుల మీద ఒకరు ఒత్తిడి తెస్తే… పట్టుకున్న ఇసుక లారీలు, ట్రాక్టర్లను వదిలేయాలని మరొకరు రెవెన్యూ అధికారులపై, కేసులు నమోదు చేయవద్దని పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేసు నమోదు చేసినా, పట్టుకున్న వాహనాలను వదిలి పెట్టకపోయినా సదరు అధికారులు వెంటనే బదిలీ అవుతారట. దీంతో… తాండూరు నియోజకవర్గంలో ఏ అధికారి ఎక్కువ రోజులు పని చేయలేక పోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల పెద్దేముల్ మండలంలో అధికార పార్టీకి చెందిన ఓ జిల్లా స్థాయి నాయకురాలిని పోలీసులు జైలుకు పంపించడం కూడా అధికార పార్టీ నేతల్లో అసహనానికి కారణమంటున్నారు.

అటు చిన్న చిన్న వ్యవహారాల్లోనూ రాజకీయ నాయకులు జోక్యం చేసుకుంటూ, తమకు అనుకూలంగా లేని వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని వత్తిడి చేస్తున్నారన్నది పోలీసుల వెర్షన్‌. మరోవైపు పోలీస్ శాఖలోని కొన్ని విభాగాల్లో చాలాకాలంగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ఎస్సైలు, సీఐలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తాండూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చే పోలీస్ అధికారులు ఇక్కడ విధులు నిర్వహించేందుకు వెనుకడుగు వేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నిటికీ మించి తాండూరు నియోజకవర్గంలో రెండు పవర్ సెంటర్లు ఉండటంతో ఎవరికి ఎలాంటి వివరణ ఇవ్వాలో తెలియక రెవెన్యూ అధికారులు, పోలీసులు సతమతమవుతున్నారట. మొత్తం మీద తాండూరులో ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యే చెలగాటం అధికారులకు ఇరకాటంగా మారిందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.