ఆ మాజీ మంత్రి సొంత నియోజకవర్గంలో దూకుడు పెంచారా? వచ్చే ఎన్నికలకు ఇప్పుటి నుంచే వర్కవుట్ చేస్తున్నారా? సెంటిమెంట్‌ను రగిలించడంతోపాటు.. వారసులకు రాజకీయంగా తగిన ఉపాధి చూపించే పనిలో పడ్డారా? సీటు ఖాళీలేని చోట ఆయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయి? ఎవరా మాజీ మంత్రి?
తాండూరు టికెట్ తనదే అని పట్నం ప్రచారం!
పట్నం మహేందర్‌రెడ్డి. టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి. ప్రస్తుతం ఎమ్మెల్సీ. టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి.. 2018 ముందస్తు ఎన్నికల్లో తాండూరులో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ మంత్రి అయ్యేవారో లేదో కానీ.. ఓటమి మాత్రం రాజకీయంగా చాలా కష్టాలే తెచ్చిపెట్టింది. పట్నంపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిపోవడంతో.. తాండూరులో వర్గపోరు స్టార్ట్ అయింది. ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్యపోరు ఓ రేంజ్‌లో సాగుతోంది. 2018 ముందస్తు ఎన్నికల్లో సిట్టింగ్‌లకే మళ్లీ అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లోనూ అదే చేస్తే పట్నం సీటు కిందకు నీళ్లొచ్చినట్టే. కానీ… ఆయన మాత్రం వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్ అని ధీమాగా ఉన్నారట. అదే తాండూరు పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది.
తనకు చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్ రాజేస్తున్నారా?
వచ్చే ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేస్తానని మనసులోని మాటను పట్నం మహేందర్‌రెడ్డి బయట పెట్టడం బాగానే ఉన్నా.. దానికి సెంటిమెంట్‌ను జోడించడమే చర్చగా మారింది. వచ్చే ఎలక్షన్లే తనకు చివరి ఎన్నికలని సంచలన కామెంట్స్ చేశారు. పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు.. పార్టీలోని ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసేందుకు.. ప్రజల్లో సానుభూతి పొందేందుకు మాజీ మంత్రి ఈ పాచిక విసిరారా అన్న అనుమానాలు ఉన్నాయట.
తాండూరులో వారసులను సిద్ధం చేస్తారా?
పనిలో పనిగా రాజకీయాల్లో వారసులను కూడా సిద్ధం చేస్తున్నారు పట్నం మహేందర్‌రెడ్డి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే రీతిలో ఒక్కొక్కరినీ ఒక్కో పోస్టులో కూర్చోబెట్టి తాండూరు చేజారిపోకుండా చూసుకుంటున్నారు. మహేందర్‌రెడ్డి భార్య సునీత వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. సోదరుడు నరేందర్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే. కుమారుడి వరసయ్యే వ్యక్తి జడ్పీటీసీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లే తనకు చివరి ఎన్నికలని ప్రకటించడం ద్వారా.. ఆపై ఎన్నికలకు తాండూరులో వారసులను సిద్ధం చేస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్‌లో మంత్రి మల్లారెడ్డి తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి తెస్తున్నారు. అదేవిధంగా పట్నం ఫ్యామిలీ కూడా పాతుకు పోయింది. పైగా సెంటిమెంట్, వారసులు అనే కామెంట్స్‌తో సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు టీఆర్‌ఎస్‌లో టికెట్ ఆశిస్తున్న వారికి తాండూరు ఖాళీగా లేదు అన్న సంకేతాలు పంపుతున్నారు.
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై పట్నం పదునైన విమర్శలు
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై పదునైన విమర్శలు చేస్తున్నారు మహేందర్‌రెడ్డి. రోహిత్‌రెడ్డి అసలు పైలెట్ కాదని గట్టిగానే గురిపెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కదిపేలా గట్టి పన్నాగమే వేశారట మాజీ మంత్రి. ఈ వర్గపోరు చూసిన గులాబీ శ్రేణులు మాత్రం.. రానున్న రోజుల్లో తాండూరు టీఆర్ఎస్ రాజకీయాలు తారాస్థాయికి చేరతాయని చెవులు కొరుక్కుంటున్నాయి. పార్టీ పెద్దలకు కూడా తలపోట్లు తప్పకపోవచ్చని టాక్. మరి.. మాజీ మంత్రి ఎత్తుగడలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.