పీసీసీకి కొత్త నాయకత్వం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నాయి శ్రేణులు. కానీ.. ఆ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇంఛార్జ్ పదవిపై ఉన్న శ్రద్ధ పార్టీపై లేదు. కిందస్థాయి ప్రజాప్రతినిధులు చేజారిపోతున్నా పట్టించుకోవడం లేదట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు?
మేడ్చల్ కాంగ్రెస్‌లో గ్రూపులదే రాజ్యం!
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేడ్చల్ జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువయ్యాయి. ఏ ఎన్నిక జరిగిన తమ వారికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానం మీద ఒత్తిడి తేవడం.. టిక్కెట్ రాని వారు వచ్చిన వారికి సహకరించకపోవడం పరిపాటిగా మారింది. పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగినంత కాలం మేడ్చల్‌లో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించడంతో.. నిరసనగా కేఎల్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఉన్న కొద్దిమంది పార్టీ నేతల మధ్య గ్రూపులు పెరిగిపోయాయి.
read also : టీఆర్‌ఎస్ ఎంపీ సురేష్‌రెడ్డి ఏమయ్యారు?
మేడ్చల్‌లో కాంగ్రెస్‌ను లీడ్ చేసేది ఎవరో?
ప్రస్తుతం మేడ్చల్ జిల్లాకు నందికంటి శ్రీధర్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి తోటకూర జంగయ్య యాదవ్, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిలు ఉన్నారు. నియోజకవర్గంలో మూడు గ్రూపులు కొనసాగుతున్నాయి. అయితే స్థానికంగా పార్టీని ఎవరు లీడ్ చేస్తారో.. ఎవరి దగ్గరకు వెళ్లలో తెలియక గందరగోళంలో ఉంది కేడర్.
కాంగ్రెస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు టీఆర్‌ఎస్ గాలం!
మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ ఏర్పడి ఏడాదిన్నర గడిచింది. కార్పొరేషన్ ఎన్నికల్లో కేఎల్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ నుంచి నలుగురు కార్పొరేటర్లు గెలిచారు. ఇప్పుడు అదే KLR రాజీనామా చేయడంతో కార్పొరేటర్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా భావించిన అధికార పార్టీ నేతలు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులను మచ్చిక చేసుకునే పనిలో బిజీ అయ్యారు. పిలిచి కండువా కప్పేస్తున్నారు. రేవంత్ అనుచరులుగా చెప్పుకొంటున్న నాయకులు గ్రూపులు కట్టడంతో.. అధికారపార్టీ కాంగ్రెస్ కేడర్‌ను కారెక్కించే పనిలో పడింది.
మేడ్చల్‌లో కాంగ్రెస్‌ను ఖాళీ చేసే పనిలో టీఆర్‌ఎస్ నేతలు!
ఈ ప్రాంతానికి చెందిన మంత్రి మల్లారెడ్డి పక్కాప్రణాళిక ప్రకారం వర్కవుట్ చేస్తున్నారు. ఒక్క జవహర్ నగర్ కార్పొరేషన్‌లోనే కాకుండా సమీపంలోని ఘట్‌కేసర్ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కూడా పిలిచి టీఆర్‌ఎస్ కండువా కప్పేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో కొత్త పీసీసీ సారథి యాత్రలు చేస్తుంటే.. మేడ్చల్‌ల్లో మాత్రం అధికారపార్టీ చల్లగా పనికానిచ్చేస్తోంది. కాంగ్రెస్‌ను ఖాళీ చేయిస్తోంది. కళ్లముందే కేడర్ జారిపోతుంటే పట్టించుకునే వారు కరువయ్యారు. నేతలకు పదవులపై ఉన్న ఆశ.. కేడర్‌ను కాపాడుకోవడంలో లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
