ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి.. మాజీ మంత్రికి పడటం లేదట. పెత్తనం కోసం ఇద్దరూ ఫైటింగ్ చేస్తున్నారు. రెండువర్గాలు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. అదికాస్తా స్థానికంగా అధికారపార్టీలో రచ్చగా మారుతోంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా నియోజకవర్గం?
జహీరాబాద్ టీఆర్‌ఎస్‌లో మాణిక్‌రావు వర్సెస్ ఫరీదుద్దీన్!
మాణిక్‌రావు. ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే. ఇదే నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నేత.. మాజీ మంత్రి ఫరీదుద్దీన్. ఇద్దరికీ అస్సలు పడటం లేదు. విభేదాలు తారాస్థాయికి చేరినట్టు పార్టీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ప్రతి విషయంలో మాజీ మంత్రి జోక్యం చేసుకుంటున్నారని రుసరుసలాడుతున్నారట మాణిక్‌రావు. ఎవరైనా అధికారికి ఎమ్మెల్యే ఫోన్ చేసి ఫలానా పని ఎంతవరకు అయింది అని అంటే… ఫరుదుద్దీన్ సాబ్ ఆ పనిని పెండింగ్లో పెట్టమన్నారు అని చెబుతున్నారట. దీంతో ఎమ్మెల్యేకి చిర్రెత్తుకొస్తుందట. మరికొన్ని అంశాల్లో ఫరీదుద్దీన్ కుమారుడు సైతం జోక్యం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఈ ఆధిపత్యపోరు పార్టీ వర్గాలు రోడ్డున పడి తిట్టుకునే వరకు వెళ్లింది.
ఇద్దరి మధ్య నలిగిపోతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
తమ మద్దతు లేకపోతే మాణిక్‌రావు ఎమ్మెల్యేగా గెలిచేవారా అన్నది మాజీ మంత్రి శిబిరం వేసే ప్రశ్న. ఈ వర్గపోరులో అధికారులతోపాటు.. స్థానిక పార్టీ కార్యకర్తలు.. ప్రజాప్రతినిధులు నలిగిపోతున్నారు. ఎవరి మాట వింటే ఇంకెవరికి కోపం వస్తుందో అని నిత్యం తలపట్టుకుంటున్నారట అధికారులు.
read also : మంత్రినే ఏమారుస్తున్న ఏపీ ఎక్సైజ్‌శాఖ అధికారులు?
నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్ అంటోన్న మాణిక్‌రావు
ఫరీదుద్దీన్ గతంలో రెండుసార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2009లో జహీరాబాద్ ఎస్సీకి రిజర్వ్‌కావడంతో అంబర్‌పేట్‌కు షిఫ్ట్ అయ్యారు ఫరీదుద్దీన్. 2014 ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి.. కారెక్కేశారు ఈ మాజీ మంత్రి. తర్వాత టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు కూడా. ఇప్పుడా పదవి కూడా ముగిసింది. ఇక మాణిక్‌రావు 2014లో ఓడినా.. 2018లో గెలిచారు. మొన్నటి వరకు మాజీ మంత్రి ఎమ్మెల్సీగా ఉండటంతో నియోజకవర్గంలో మాణిక్‌రావు వర్సెస్ ఫరీదుద్దీన్ అన్నట్టుగా రాజకీయం సాగింది. ఇప్పుడు ఫరీదుద్దీన్ చేతిలో పదవి లేకపోవడంతో.. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే బాస్.. పార్టీ అదే స్పష్టం చేసిందని కేడర్‌కు వెల్లడిస్తున్నారు మాణిక్‌రావు. ఆ విధంగా రెండు వర్గాల మధ్య తాజాగా అగ్గి రాజుకుంది.
వెనక్కి తగ్గేలా లేని రెండు వర్గాలు!
టీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో మాణిక్‌రావు, ఫరీదుద్దీన్ కలిసి పాల్గొంటున్నా.. చేతులు కలుస్తున్నాయి కానీ.. నొసటితో వెక్కిరించుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం రెండు వర్గాలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. ఒకరిపై ఒకరు లీకులు ఇచ్చుకుంటూ విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు కేడర్‌ను గందరగోళ పరుస్తున్నాయట. రెండు వర్గాలు వెనక్కి తగ్గే సూచనలు లేకపోవడంతో రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు కార్యకర్తలు.
