మంత్రినే ఏమారుస్తున్న ఏపీ ఎక్సైజ్‌శాఖ అధికారులు?

అప్లయ్‌.. అప్లయ్‌ .. బట్ నో రిప్లయ్‌..! ఏపీ ఎక్సైజ్ శాఖకు ఈ సినిమా డైలాగ్‌ అతికినట్టు సరిపోతుంది. అవినీతి, అక్రమాలపై మంత్రి పూర్తిస్థాయి నివేదిక కోరినా.. అది బయటకు రాదు. తప్పు చేసిన వారిపై చర్యలూ ఉండవు. మంత్రినే ఏమార్చే ఘనులు అక్కడ తిష్ఠ వేశారు. పెద్ద గూడుపుఠాణి నడుపుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఎక్సైజ్‌ శాఖలో లోపం ఎక్కడుంది? తెర వెనక ఉన్నది ఎవరు?

గత ప్రభుత్వ హాయాంలో ఎక్సైజ్ శాఖలో అవినీతి ఎక్కువైందని.. అధికారంలోకి వచ్చీ రావడంతోనే ప్రక్షాళనకు నడుం బిగించారు సీఎం జగన్. పూర్తిగా ఎక్సైజ్ శాఖ స్వరూపం మారుస్తూ కీలక చర్యలు చేపట్టారు. మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తులకు కాకుండా.. ప్రభుత్వమే నిర్వహించేలా పాలసీ డెసిషన్ తీసుకున్నారు. ఏటా 20 శాతం మేర వైన్‌షాపులను కుదిస్తూ.. మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేస్తామని చెప్పినట్టుగానే కార్యాచరణను సిద్ధం చేసింది సర్కార్‌. ఏ ఉద్దేశ్యంతో ప్రభుత్వం ద్వారా మద్యం దుకాణాలు నడిపిస్తున్నారో.. ఆ షాపుల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందనేది ప్రధాన ఆరోపణ. వివిధ సందర్భాల్లో ఇది వెలుగులోకి వస్తోన్నా.. కంటితుడుపు చర్యలతోనే సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖలో లోపం ఎక్కడుంది? తెర వెనక ఎవరైనా ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది.

ఏజెన్సీ కమీషన్లపై మంత్రి నివేదిక కోరినా పట్టించుకోలేదా?

గతంలో మద్యం దుకాణాల్లోని ఉద్యోగులను.. సిబ్బందిని రిక్రూట్ చేసిన ఏజెన్సీ సిబ్బంది నుంచి కమీషన్లు వసూలు చేస్తోందనే విమర్శలు వచ్చాయి. కొందరు ఓపెన్‌గానే కామెంట్స్‌ చేశారు. ఈ విషయం డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్‌ అయ్యారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయితే ఆ రిపోర్ట్‌ ఏమైందో? అధికారులు ఏం చెప్పారో? ఏజెన్సీపై చర్యలు తీసుకున్నారా.. లేదా? అన్నది క్లారిటీ లేదు.

విశాఖలో సిబ్బంది చేతివాటంపైనా మంత్రి సీరియస్‌

ఇటీవల విశాఖ కేంద్రంగా మద్యం దుకాణాల్లో సిబ్బంది చేతివాటం.. దానికి స్థానిక ఎక్సైజ్ అధికారుల సహకారం ఉందనే అంశం రచ్చ రచ్చయింది. తప్పుడు లెక్కలు రాసి.. రోజువారీగా బ్యాంకుల్లో తక్కువ మొత్తాన్ని డిపాజిట్‌ చేసినట్టు గుప్పుమంది. విశాఖలోనే కాకుండా.. ఇంకొన్నిచోట్ల కూడా ఇలాంటి అవినీతి నడుస్తోందని వెల్లడైంది. ఆ విషయం తెలియగానే మంత్రి నారాయణస్వామి మళ్లీ ఫైర్‌ అయ్యారు. నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కానీ.. ఎక్కడి గొంగళి అక్కడే.

ఉన్నతాధికారులే మంత్రికి అడ్డుపడుతున్నారా?

క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకలు మంత్రి దృష్టికి రాకుండా ఎక్సైజ్ శాఖలోని కొందరు ఉన్నతాధికారులే అడ్డుపడుతున్నారనే భావన వ్యక్తమవుతోంది. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఇచ్చే నివేదికల్లో ఏం ఉండటం లేదట. అంతా సవ్యంగా జరిగిందని.. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేవనే రీతిలో రిపోర్టులు ఉంటున్నాయని సమాచారం. గతంలో ఏజెన్సీ విషయంలో వచ్చిన ఆరోపణలపై అధికారులు పెద్దగా ఏం స్పందించ లేదట. ఇబ్బందేమీ లేదన్నట్టుగానే నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.

గోల్‌మాల్‌ను విశాఖకే పరిమితం చేస్తూ నివేదిక?

విశాఖ తరహాలో గోల్‌మాల్ మరికొన్నిచోట్ల జరిగినట్టు సమాచారమున్నా.. వాటిని దాచిపెట్టారట.
కేవలం విశాఖ వరకే దాన్ని పరిమితం చేసినట్టు తెలుస్తోంది. ఇదేవిధంగా ఎక్సైజ్ శాఖలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న సమాచారాన్ని మంత్రి దృష్టికి రాకుండా అక్కడికక్కడే చక్కబెట్టే స్తున్నారట. దాంతో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా ఏం చేయలేకపోతున్నారట. మంత్రినే ఈ విధంగా ఏమారుస్తోంటే.. ఇక అధికారులను ఎలా కంట్రోల్ చేయగలరనే చర్చ ఎక్సైజ్ శాఖలో జోరుగా నడుస్తోంది..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-