టైమ్‌కు ప్రభుత్వ ఆఫీసుల తలుపులు తెరుచుకుంటాయి కానీ.. కుర్చీలలో సిబ్బంది ఉండరు. కొందరైతే ఎప్పుడొస్తారో.. ఎప్పుడెళ్లిపోతారో కూడా చెప్పలేం. ఇంకొందరు పైరవీలతో పనికానిచ్చేస్తుంటారు. ఈ తరహా ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారట ఆ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్. దాంతో టాప్ టు బోటమ్ ఒక్కటే హడావిడి. ఎవరిపై ఎప్పుడు వేటు పడుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారట.
విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే వేటు!
పమేలా సత్పతి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా ఈ మధ్యే బాధ్యతలు చేపట్టారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బదిలీపై వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ అనితా రామచంద్రన్ కలెక్టర్‌గా ఉన్నారు. ఐఏఎస్‌ల బదిలీలు.. ప్రభుత్వంలో సాధారణమే అయినా.. పమేలా కలెక్టర్‌గా వచ్చాక ఉద్యోగ వర్గాల్లో అలజడి మొదలైంది. విధుల్లో అలసత్వం వహిస్తున్నవారిపై కొరడా ఝుళిపిస్తుండటమే దీనికి కారణం.
ఐ అండ్ పీఆర్‌కు డీపీఆర్వో అటాచ్!
ఉద్యోగ పరిధి దాటి ప్రవర్తిస్తున్న అధికారులను అస్సలు ఉపేక్షించడం లేదట కలెక్టర్. ముఖ్యంగా కలెక్టరేట్లో పైరవీలు చేసే వారిపై సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో DPRO పద్మపై వేటు వేయడం కలకలం రేపింది. విధి నిర్వహణలో డీపీఆర్వో అలసత్వం వహిస్తున్నారని.. ఆమెను ఐ అండ్ పీఆర్‌కు అటాచ్ చేశారు. పౌరసంబంధాల విభాగంలో డీపీఆర్వో జిల్లాస్థాయి అధికారి. అలాంటి ఆఫీసర్‌పైనే కలెక్టర్ కన్నెర్ర చేయడంతో కలెక్టరేట్లో కలకలం రేగింది. పైగా కలెక్టర్‌గా ఛార్జ్ తీసుకున్న వారానికే తన మార్క్ పనితనం చూపించడంతో పమేలా అంటే హడలిపోతున్నారట ఉద్యోగులు.
పైరవీలు చేసేవారిపైనా కలెక్టర్ కన్నెర్ర!
విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారు? పైరవీలు చేస్తున్నవారు ఎవరు? విధులకు రాకుండా .. బయట తిరుగుతూ.. డ్యూటీ చేసినట్టు హాజరు వేయించుకుంటున్న వారిపై పూర్తిస్థాయిలో ఆరా తీశారట కలెక్టర్. ఈ క్రమంలోనే డీపీఆర్వోపై వేటు పడినట్టు చెబుతున్నారు. ఈ చర్యతో జిల్లా స్థాయి అధికారుల్లో వణుకు ప్రారంభమైంది. ఎప్పుడు ఏ అధికారిపై వేటు పడుతుందో అని ఆందోళన చెందుతున్నారట.
హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగులు సెట్‌రైట్!
టైమ్‌కు వస్తున్నారు.. టైమ్ అయ్యాక వెళ్తున్న ఉద్యోగులు
కలెక్టర్ తీసుకున్న ఈ చర్యల తర్వాత హైదరాబాద్ నుంచి నిత్యం భువనగిరిలోని కలెక్టరేట్‌కు అప్ అండ్ డౌన్ చేసే అధికారులు సైతం సెట్‌రైట్ అయినట్టు తెలుస్తోంది. టైమ్‌కు ఆఫీస్‌కు వచ్చి కుర్చీలకు అతుక్కుపోతున్నారట. డ్యూటీ టైమ్ అయిన తర్వాత ఆఫీస్ వదిలి వెళ్తున్నట్టు చెబుతున్నారు. ఒకప్పుడు మధ్యాహ్నం వరకు ఖాళీగా కనిపించిన సర్కారీ ఆఫీసులు ఇప్పుడు ఉదయమే ఉద్యోగుల పూర్తిస్థాయి హాజరుతో కళకళలాడుతున్నట్టు ప్రజల చెప్పుకొంటున్నారు. మొత్తానికి కలెక్టర్‌గా రావడంతోనే పమేలా ఝులిపించిన కొరడా.. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను దారిలోకి తెచ్చింది. అయితే రాజకీయ నేతలతో సంబంధాలు కలిగిన ఉద్యోగులు.. ఎన్నాళ్లిలా టైమ్ ప్రకారం పనిచేస్తారో చూడాలి.