ఒకప్పుడు యాజమాన్యాన్ని శాసించారు ఆ ఉద్యోగులు. ఇప్పుడు భయం.. బలహీనం. ఏం జరిగినా నోరెత్తలేని ధైన్యం. ప్రశ్నించే వాళ్లే కరువయ్యారు. ఇంతకీ ఎవరా ఉద్యోగులు? ఏమా కథ?
బలంతగ్గి టీటీడీలో వాయిస్ లేని ఉద్యోగులు..!
కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో ఉద్యోగమంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. స్వామి వారిని క్షణకాలం దర్శించుకునే భాగ్యం లభిస్తేనే చాలు.. తమ జీవితం ధన్యమని అనుకుంటారు భక్తులు. అటువంటిది స్వామి సన్నిధిలో నిరంతరం భక్తులకు సేవ చేసుకుంటూ.. ఆ సన్నిధిలోనే ఉద్యోగమంటే ఎంతో సంతోషిస్తారు. అందుకే టీటీడీలో ఉద్యోగానికి ఆస్థాయిలో డిమాండ్. చివరకు డిప్యూటేషన్‌పై టీటీడీకి రావడానికి ప్రయత్నించేవాళ్లు ఎందరో. డిప్యూటేషన్‌పై వస్తే తిరిగి వెనక్కి వెళ్లే ప్రయత్నం చెయ్యరు. 1996లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజుకు 25 వేలు ఉంటే.. ఆ సమయంలో ఉద్యోగులు 14వేల 5 వందల మంది. ప్రస్తుతం భక్తుల సంఖ్య భారీగా పెరిగితే.. ఉద్యోగుల సంఖ్య తరుగుతూ వస్తోంది. రోజుకు లక్ష మంది దర్శనానికి వస్తే.. టీటీడీలో ఉన్న ఉద్యోగులు 6 వేల 597 మంది. బలం తగ్గిందనో ఏమో ప్రస్తుతం ఉద్యోగుల వాయిస్సే వినిపించడం లేదు.
ఉద్యోగ సంఘాల నేతలకు 2003లో చెక్..!
గతంలో టీటీడీలో ఉద్యోగ సంఘాలు, నేతలు ఎక్కువ. యాజమాన్యం కూడా వారి మాటకు ప్రాధాన్యం ఇచ్చేది. ఒకదశలో ఉద్యోగ సంఘాల నేతలు విధులకు వచ్చేవారే కాదు. తిరుపతిలోని పరిపాలన భవనానికే పరిమితమై.. సంఘాలను నడపడానికే సమయాన్ని వెచ్చించేవారు. ఆ సంప్రదాయానికి 2003లో చెక్ పెట్టారు అప్పటి ఈవో అజయ్ కల్లాం. ఉద్యోగ సంఘ నేతలకు తిరుమలలోనూ విధులు కేటాయించారు. నాటినుంచి ఉద్యోగుల ఐక్యతకు బీటలు వారింది. 2007లో శ్రీవారి ఆలయంలో 300 బంగారు డాలర్ల మిస్సింగ్ కేసులో డిప్యూటీ ఈవో ప్రభాకర్‌రెడ్డితో సహ కొంతమందిని సస్పెండ్ చేశారు. టీటీడీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి సస్పెండైన అధికారులకు బాసటగా నిలిచారు. పరిపాలన భవనం ముందు ధర్నా చేయడంతో 24 గంటల్లోనే సస్పెన్షన్ ఎత్తేశారు. ఆ ఐక్యత ఇప్పుడు అణుమాత్రం కూడా లేదట.
సమస్యలపై పారిపోయే స్థితికి చేరుకున్నారట..!
బదిలీ చేస్తారనే భయంలో ఉద్యోగులు ఉన్నారా?
ప్రస్తుతం టీటీడీలో ఉద్యోగులు రిటైర్ అవడమే తప్పితే కొత్తగా నియామకాలు లేవు. ఒకప్పుడు తిరుమల, తిరుపతి పరిధిలోనే ఉండే టీటీడీ ఆలయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఔట్ సోర్సింగ్ విధానానికి మొగ్గు చూపారు. ఉద్యోగులను దేశవ్యాప్తంగా బదిలీచేసే వెసులుబాటు లభించడంతో ఐక్యత దెబ్బతింది. సమస్యపై పోరాడే స్థాయి నుంచి పారిపోయే స్థితికి చేరుకున్నారు. గత ఏడాది కాలంలో చిన్నచిన్న తప్పిదాలకు కొందరు సస్పెండైతే.. మరికొందరు ఉద్యోగాన్నే కోల్పోయారు. వాళ్ల తరఫున వాయిస్ వినిపించేవాళ్లే లేరు. వారికి మద్దతుగా నిలిస్తే ఎక్కడ బదిలీ చేస్తారో అనే భయం వెంటాడుతోందట. సంఖ్యా బలం లేనప్పుడు పోరాటం ఎందుకని మరికొందరు సైలెంట్ అయ్యారు.
ప్రాధేయపడి సస్పెన్షన్ ఎత్తివేయించుకున్న ఉద్యోగ సంఘాల నేతలు..!
కొన్నిరోజుల క్రితం కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతిచ్చారన్న కారణంతో ముగ్గురు ఉద్యోగ సంఘాల నేతలను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై ఒక్క ఉద్యోగీ మాట్లాడలేదు. పైగా పైవాళ్లను ప్రాధేయపడి సస్పెన్షన్ ఎత్తివేయించుకున్నారట. టీటీడీలో ఉద్యోగ సంఘాల ఎన్నికలు నిర్వహించి పదేళ్లు అవుతున్నా.. ఆ ఊసే ఎత్తే సాహసం ఎవరూ చేయడం లేదు. ఆ మాట పలికితే ఏమౌతుందో అన్న భయం పట్టుకుందట. దీంతో ఒకప్పుడు అమ్మో టీటీడీ ఉద్యోగులా అనే స్థాయి నుంచి ఇప్పుడు అమ్మా.. టీటీడీ ఉద్యోగులా అనే పరిస్థితికి వచ్చారని కామెంట్స్ వినిపిస్తున్నాయట.
