అధికారపార్టీలో ఎమ్మెల్యేల జోడు పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? వరసగా ఇద్దరికి కీలక పదవులు కట్టబెట్టడంతో.. ఇతరులకు లైన్ క్లియరైనట్టేనా? ఆశలు వదిలేసుకున్నవారు మళ్లీ హుషారుగా ఎదురు చూస్తున్నారా? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?
ఎమ్మెల్యేలలో పదవులపై ఆశలు
టీఆర్ఎస్‌లో కొంత కాలంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ జరుగుతోంది. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పటికే పదవుల పొందిన వారిలో కొందరికి రెన్యువల్ అయితే.. కొత్త వాళ్లలో మరికొందరికి అవకాశం దక్కింది. ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవుల అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్యేలలో ఎవరికి అవకాశం రాలేదు. టీఆర్ఎస్‌లో జోడు పదవులకు ఛాన్స్ లేదని అనుకున్నారు. కానీ.. కొత్త ప్రకటనలు.. ఎమ్మెల్యేలలో సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ఎమ్మెల్యేలకు ఖాళీగా ఉన్న కార్పొరేషన్ల పదవులు?
ప్రస్తుతం నామినేటెడ్ పదవుల పందేరం చేపట్టడంతో అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను TSRTC చైర్మన్‌ను చేశారు. ఈ రెండు పరిణామాలు చూసిన పార్టీవర్గాల్లో ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు దక్కబోతున్నాయని అనుకుంటున్నారు.
ఖాళీగా ఉన్న ముఖ్యమైన కార్పొరేషన్ల చైర్మన్‌లుగా ఎమ్మెల్యేలకు చాన్స్ ఇస్తారని టాక్.
రాజకీయ, సామాజిక అంశాలే కీలకమా?
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసినట్టుగా పొలిటికల్ హీట్ మొదలైంది. అధికార పార్టీ కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తోంది. రాజకీయ, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని పదవుల పందేరం ఉంటుందని టాక్. పార్టీకి ఉన్న అవసరాలు, సామాజిక సమీకరణాల మేరకు ఎమ్మెల్యేలకు పదవులు కట్టబెడతారని అనుకుంటున్నారట.
ఛాన్స్ మిస్ కాకూదనే రీతిలో పావులు!
ఇన్నాళ్లూ జోడు పదవులపై ఆశలు వదిలేసుకున్న ఎమ్మెల్యేలు.. ఈ ఛాన్స్ మిస్ కాకూడదనే రీతిలో పావులు కదుపుతున్నారు. పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారట. ప్రస్తుతం కొన్ని పేర్లపై చర్చ జరుగుతున్నా.. వారికి ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది డౌటే. మరి.. తదుపరి జాబితాలో ఎవరున్నారో? ఎవరికి పదవీయోగం ఉందో కాలమే చెప్పాలి.
