ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యే మధ్య ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం. ఇద్దరూ ఒకేపార్టీలో ఉన్నా.. వైరిపక్షాల మాదిరి తగువులాడుకునే పరిస్థితి. ఈ ఎపిసోడ్‌లో ఇప్పుడు మూడో నేత చేరారట. పార్టీ కేడర్‌లో చాలా మంది ఆ నాయకుడి దగ్గరకు వెళ్తుండటం చర్చగా మారింది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. ఎవరా నాయకులు?
నకిరేకల్‌లో నేతి విద్యాసాగర్ భేటీలపై చర్చ..!
చిరుమర్తి లింగయ్య. 2018లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. మారిన రాజకీయ పరిణామాలతో టీఆర్‌ఎస్ కండువా కప్పేసుకున్నారు. జంపింగ్ ఎమ్మెల్యేకు కిక్కు ఇచ్చినా.. ఆయనపై ఓడిన టీఆర్ఎస్ నేత.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి మాత్రం రుచించలేదట. ఇద్దరూ ఒకేపార్టీలోనే ఉన్నా.. ఒక్క క్షణం పడదు. ఎవరి వర్గం వాళ్లదే. ఎవరి కుంపటి వాళ్లదే. ఆధిపత్యపోరులో జరిగే గొడవలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడీ ఎపిసోడ్‌లో శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ సరికొత్త చర్చకు తెరతీశారని గులాబీ శ్రేణులు కథలు కథలుగా చెప్పుకొంటున్నాయి.
నేతితో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ కేడర్ భేటీ..!
నేతి విద్యాసాగర్‌ది కూడా నకిరేకల్ నియోజకవర్గమే. రాజకీయంగా ఆయనకంటూ ఓ వర్గం కూడా ఉంది. ఎక్కడికెళ్లినా అనుచరులు ఫాలో అవుతారు. ఈ మధ్యే విద్యాసాగర్ ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. ఈ మధ్య కాలంలో నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు వచ్చి నేతి విద్యాసాగర్‌ను కలిసి మాట్లాడి వెళ్తున్నారట. ఇది ఆ నోటా ఈ నోటా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వరకు చేరింది. లోకల్ ప్రజాప్రతినిధులు.. ద్వితీయ శ్రేణి నాయకులు ఆయన్ని కలిసి మాట్లాడటంపై లింగయ్య అసంతృప్తి వ్యక్తం చేశారని టాక్.
ఎమ్మెల్యే లింగయ్య, నేతి మధ్య గ్యాప్ పెరుగుతోందా?
రాజకీయంగా తమకు మద్దతుగా నిలుస్తున్నందుకే నేతి విద్యాసాగర్‌ను కలిసి మాట్లాడుతున్నామని.. ఆయన దగ్గరకు వెళ్లినవాళ్లు చెబుతున్నారట. ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్నవాళ్లు.. ఎటువైపు మొగ్గు చూపాలి అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారట. ప్రస్తుతానికి లింగయ్య, విద్యాసాగర్‌లు ఈ అంశంపై పెదవి విప్పకపోయినా.. రెండు వర్గాలు లోలోపల కత్తులు దూసుకుంటున్నాయని చర్చ జరుగుతోంది. ఇద్దరి మధ్య క్రమంగా గ్యాప్ కూడా పెరుగుతోందట. ఈ అంశాలపైనే టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
రానున్న రోజుల్లో ఆసక్తికర పరిణామాలు తప్పదా?
అసలే లింగయ్య, వీరేశానికి పడక.. పార్టీ కేడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇప్పుడు విద్యాసాగర్ ఎపిసోడ్ తెరపైకి రావడంతో నకిరేకల్‌లో మూడు ముక్కలాట తప్పదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఆసక్తికర పరిణామాలు ఉంటాయని అనుకుంటున్నారట. నకిరేకల్ ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గం కావడంతో విద్యాసాగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు. సీటుకోసం లింగయ్య, వీరేశం పోటీ పడొచ్చు. విద్యాసాగర్ ఎత్తుగడలే అంతుచిక్కడం లేదట. మరి.. నకిరేకల్ టీఆర్ఎస్‌లో ఏం జరుగుతుందో చూడాలి.
