తెలంగాణలో భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ అడుగులు వేస్తోందా? లెఫ్ట్‌తో చెట్టపట్టాల్ చెబుతున్నదేంటి? ఉద్యమాలకే పరిమితమా.. లేక ఎన్నికల్లోనూ దోస్తీ కొనసాగుతుందా?
ఎన్నికల వరకు కలిసి వెళ్తారా?
తెలంగాణలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటు కాబోతుందా? ఉద్యమాల్లో కలిసి పనిచేసే కామ్రేడ్‌లే.. ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేయలేక పోతున్నారు. అలాంటి వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుందా? కేవలం ఉద్యమాల వరకే కలిసి సాగుతుందా? పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న తాజా చర్చ ఇదే.
పైకి ఉద్యమాలు.. లోన అజెండా మరొకటా?
తెలంగాణలో భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్. అందులో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పనిచేయాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన ఆల్‌పార్టీ మీట్‌కు కమ్యూనిస్ట్ పార్టీల నేతలు రావడంతో ఈ చర్చ ఊపందుకుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ వారిని సమావేశానికి ఆహ్వానించినట్టు టాక్. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలన్నది అజెండానే అయినా.. అసలు రాజకీయ అజెండా మాత్రం మరోటని తెలుస్తోంది.
కాంగ్రెస్‌కు దగ్గర కావడానికి లెఫ్ట్ పార్టీలు చూస్తున్నాయా?
గాంధీభవన్ సమావేశానికి లెఫ్ట్ పార్టీలతోపాటు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ కూడా వచ్చారు. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో అవగాహనతో పనిచేశారు కోదండరామ్. వీరితో సీపీఐ జత కలిసింది. సీపీఎం ఒక్కటే వేరుగా వెళ్లింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసి.. రాజకీయంగా బలమైన శక్తిగా ఎదగాలని చూసింది కానీ.. వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం కామ్రేడ్ల ఆలోచనంతా బీజేపీని కట్టడి చేయడమే. ఆ మధ్య కాంగ్రెస్‌తో కొంత గ్యాప్ మెయింటైన్ చేసినా.. ఇప్పుడు ఆ పార్టీకి దగ్గర కావడానికి చూస్తున్నారు కమ్యూనిస్ట్‌లు.
ముందు తెలంగాణలో కలిసి సాగే వ్యూహం!
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పావులు కదపడటం బెటర్ అన్నది లెప్ట్, కాంగ్రెస్ పార్టీల ఆలోచనగా ఉంది. గతంలో పొత్తులో ఆఖరి వరకు సీట్లు తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిందనే ఫీలింగ్ సీపీఐలో ఉందట. పీసీసీ సారథ్య బాధ్యతలు చేపట్టిన రేవంత్ ఎర్రదండువైపు చూస్తున్నారు. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా కాంగ్రెస్, లెఫ్ట్ కలిసి సాగేలా చేస్తున్నాయట. జాతీయ స్థాయిలో ఎలా ఉన్నా.. ముందుగా తెలంగాణలో యుగళగీతం ఆలపించే పనిలో ఉన్నారు నాయకులు.
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో లెఫ్ట్‌కు ప్రాధాన్యం?
తెలంగాణలో లెఫ్ట్ పార్టీలు రాజకీయంగా బాగా దెబ్బతిన్నాయి. అధికారపార్టీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేయాలని చూస్తున్నా.. అది మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలున్నట్టు లెక్కలేస్తున్నారట. ఇప్పటికే ఉపఎన్నికలో మద్దతిచ్చి నష్టపోయామనే చర్చ కమ్యూనిస్ట్‌లలో ఉంది. లెఫ్ట్ బలంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలో కామ్రేడ్లకు అవకాశం ఇచ్చి.. తనతో కలిసి నడిపించుకునే పనిలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. వీరితో కోదండరామ్ కలిసి సాగొచ్చని టాక్. కొత్తగా వచ్చిన షర్మిల, బీఎస్పీలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌లతో జరిగే నష్టాన్ని లెఫ్ట్ పార్టీలతో పూడ్చుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. మరి.. రానున్న రోజుల్లో ఈ పార్టీల అడుగులు ఎలా పడతాయో చూడాలి.
