Site icon NTV Telugu

రేవంత్‌ వ్యతిరేకవర్గం స్వరం పెరుగుతోందా?

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ వ్యతిరేకవర్గం స్వరం పెరుగుతోందా? అదను కోసం చూస్తున్న సీనియర్లు గట్టిగానే గళం విప్పుతున్నారా? పీసీసీ చీఫ్ లేని సమయంలో పావులు కదపడం వెనక వ్యూహం ఏంటి? ఎక్కడ సభలు పెట్టాలో చెప్పిన నాయకులే.. బయట మరోలా ప్రచారం చేస్తున్నారా? లెట్స్‌ వాచ్‌!

రేవంత్‌ లేని భేటీలో సీనియర్లు జూలు విదిల్చారా?

తెలంగాణ కాంగ్రెస్‌లో హడావుడి కామన్. అంతకుమించి అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కామన్. దానికి అద్దంపట్టే ఘటనలు తరచూ జరుగుతుంటాయి. గురువారం నాటి పార్టీ సమావేశంలో సీనియర్ నాయకులు ఏకం కావడం కూడా ఆ కోవలోకే వస్తుందట. రేవంత్‌రెడ్డి సమావేశంలో లేని సమయంలో కొంతమంది సీనియర్లు.. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్ ముందు పీసీసీ చీఫ్‌పై ఒంటి కాలిపై లేచినట్టు సమాచారం. రేవంత్ దూకుడు.. వరస సభలు సమావేశాల గురించి చెబుతూనే.. వాటికి సంబంధించిన ప్రకటనలు తమకు చెప్పకపోతే ఎలా అని నిలదీశారట. తమకు ఏమీ చెప్పడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సభలకు వెళ్తే సరైన ప్రాధాన్యం కూడా దక్కడం లేదని ఫైర్‌ అయ్యారట. సభల్లో రేవంత్‌పై రాసిన పాటలతోనే హడావిడి చేస్తున్నారని మరో నేత కన్నెర్ర చేశారట. ఈ తాజా పరిణామాలపైనే కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోందట.

పీఏసీ భేటీకి సీనియర్లను పిలవాలని ఠాగూర్‌కు జగ్గారెడ్డి లేఖ

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి బయట సైలెంట్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నా.. ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశానికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లతోపాటు ఎంపీలు, మాజీ పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలను, కేంద్ర మాజీ మంత్రులును కూడా పిలవాలని ఇంఛార్జ్‌ ఠాగూర్‌కు రాసిన లేఖలో జగ్గారెడ్డి సూచించారట. ఈ లేఖ వెనక పెద్ద వ్యూహమే ఉందట. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌తోపాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా సమావేశానికి పిలవాలన్నది జగ్గారెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. పీసీసీలో సీనియర్‌ ఉపాధ్యక్షులను కూడా సమావేశానికి ఆహ్వానించాలని చెప్పారట. ఇలా సీనియర్‌ నాయకులను మీటింగ్‌లో భాగస్వామ్యులు చేయాలనడం వెనక.. రేవంత్‌ను ఇరుకున పెట్టే ఎత్తుగడ ఉందని అనుకుంటున్నారట.

ప్రతీదీ తప్పంటే ఎలా అని ప్రశ్నించిన మహేష్‌గౌడ్‌!

కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న ఇద్దరు నాయకులు.. సభలపై లేవనెత్తిన ప్రశ్నలకు.. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌గౌడ్‌ రియాక్ట్‌ అయ్యారు. భువనగిరిలో సభ పెట్టడానికి.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాష్కీల అనుమతి తీసుకున్న తర్వాతే ప్రకటన చేసింది నిజం కాదా అని ఎదురు దాడి చేశారు. ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి చూడటం సరికాదు.. పొరపాటు జరిగితే సరిదిద్దాలి అని నేరుగా ఠాగూర్‌కే చెప్పారట మహేష్‌గౌడ్‌. తాను రేవంత్‌ మనిషిని కాకపోయినా.. తప్పు జరిగినప్పుడు తాను రేవంత్‌ను నిలదీశానని గుర్తు చేశారట.

సీనియర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఠాగూర్‌!

పార్టీ నేతలు చెప్పిందంతా విన్న కాంగ్రెస్‌ రాష్ట్ర ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారట. రాష్ట్రంలో ఎవరేం చేస్తున్నారో.. ఎక్కడేం మాట్లాడుతున్నారో పార్టీకి తెలుసు. కాంగ్రెస్‌ బలోపేతానికి సలహాలు ఇవ్వండి అని చురకలు వేశారట. మొత్తానికి తాజా ఎపిసోడ్‌.. రేవంత్‌కు వ్యతిరేకంగా పార్టీ సీనియర్లు ఒక్కటవుతున్నారని గాంధీభవన్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి.. రానున్న రోజుల్లో పీసీసీ చీఫ్‌కు వ్యతిరేకంగా సీనియర్లు ప్రయోగించే పావులు ఇంకెలా ఉంటాయో చూడాలి.

Exit mobile version