తెలంగాణ క్యాబినెట్‌లో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం దక్కతోబోతుందా? ఒకరు కాదు.. ఇద్దరికి అవకాశం ఉంటుందా? ఎవరెవరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి?
కేబినెట్‌లోకి దళిత ఎమ్మెల్యేలను తీసుకుంటారా?
తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే తెలంగాణ సర్కారు దళిత బంధు స్కీమ్‌ను అమలులోకి తీసుకొచ్చింది. మంత్రివర్గంలో కూడా ఇద్దరు దళిత సామాజికవర్గ ఎమ్మెల్యేలకు చోటుదక్కే అవకాశం ఉందన్న ప్రచారం మొదలైంది. అధికారపార్టీవర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించకపోయినా.. ప్రచారం మాత్రం విస్తృతంగా జరుగుతోంది. ఒకవేళ కేబినెట్‌లోకి తీసుకోవాలని అనుకుంటే.. ఎవరికి పిలుపు వస్తుంది. అదృష్టం ఎవరి తలుపు తడుతుంది అన్న విశ్లేషణలు మొదలయ్యాయి.
ప్రచారంలో నలుగురు ఎమ్మెల్యేల పేర్లు!
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం కచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నారట. ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలలో కొందరే యాక్టివ్‌గా ఉన్నారు. విపక్ష పార్టీల నేతల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది కొందరే. ఆ లెక్కలు బయటకు తీసిన అధికారపార్టీ.. ఇద్దరికి అవకాశం కల్పించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఇద్దరు ఎవరన్నదే ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గాదరి కిశోర్, సండ్ర వెంకట వీరయ్య పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
సమీకరణాలు, సీనియారిటీలలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది?
బాల్క సుమన్, గువ్వల బాలరాజులు ప్రభుత్వ విప్‌లు. బాల్క సుమన్ గతంలో ఒకసారి ఎంపీగా గెలిచారు కూడా. ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే. గువ్వల బాలరాజు రెండోసారి ఎమ్మెల్యే. టీడీపీ నుంచి వచ్చిన సండ్ర వీరయ్యకు ఛాన్స్ ఉంటుందన్నది పార్టీ వర్గాలు చెప్పేమాట. ఇప్పుడు ఇద్దరికి అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుండటంతో అదే సామాజికవర్గానికి చెందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా యాక్టివ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే జిల్లాల్లో సమీకరణాలు.. సీనియారిటీలను పరిగణనలోకి తీసుకుంటే ఎవరికి ఛాన్స్ ఇస్తారన్నది అంచనా వేయలేని పరిస్థితి.
హుజురాబాద్ ఉపఎన్నికపై టీఆర్ఎస్ ఫోకస్!
ప్రస్తుతం టీఆర్ఎస్ ఫోకస్ హుజురాబాద్ ఉపఎన్నికపై ఉంది. దళితబంధు పథకం అమలు అక్కడి నుంచే మొదలుపెట్టారు. ఆ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌లోని ఎస్సీ సామాజికవర్గ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ దశలో అధికారపక్షం నుంచి కీలక ప్రకటన ఉంటుందా? కేవలం ప్రచారంగానే ఈ అంశం మిగిలిపోతుందో చూడాలి.