Site icon NTV Telugu

టెక్కలి వైపీపీలో ఆధిపత్య పోరు..!

అప్పట్లో ఇంఛార్జ్‌గా ఉన్న నాయకుడు.. తిలకం దిద్ది మీకే పోస్ట్‌ అని హామీ ఇచ్చారు. ఇంతలో ఆ ఇంఛార్జే మారిపోయి కొత్త నేత వచ్చారు. అసలే పాత, కొత్త ఇంఛార్జుల మధ్య ఆధిపత్య పోరు ఉండటంతో గత హామీలపై ఆ ఎఫెక్ట్‌ పడింది. పరిషత్‌ ఫలితాల తర్వాత రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ నియోజకవర్గం ఏంటో.. వారెవరో ఇప్పుడు చూద్దాం.

దువ్వాడ, పేరాడ మధ్య నందిగాం పంచాయితీ!

శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీలో నాయకులెక్కువ. వారి మధ్య గ్రూపు తగాదాలు ఎక్కువే. నియోజకవర్గంలో ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడికి చెక్‌ పెడతారని భావించి.. అధికారపార్టీ పిలిచి పదవులిచ్చినా నేతల తీరు మారడం లేదన్నది కేడర్‌ మాట. అప్పట్లో అచ్చెన్నపై పోటీ చేసి ఓడిన పేరాడ తిలక్‌ ప్రస్తుతం రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన మరో నాయకుడు దువ్వాడ శ్రీనివాస్‌ ఎమ్మెల్సీ. ప్రస్తుతం టెక్కలి వైసీపీ ఇంఛార్జ్‌ దువ్వాడే. పరిషత్‌ ఎన్నికల ఫలితాల తర్వాత దువ్వాడ, పేరాడల మధ్య ఉన్న వర్గపోరు నియోజకవర్గంలోని నందిగాం మండలం విషయంలో బయటపడింది. అది రకరకాల మలుపులు తిరుగుతోంది.

దువ్వాడకు టచ్‌లో లేని నందిగాం ఎంపీటీసీలు?

టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం మండలాలు ఉన్నాయి. పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో నాలుగు జడ్పీటీసీలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. మొత్తం 74 ఎంపీటీసీలలో 70చోట్ల అధికారపార్టీ గెలిచింది. టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో గెలిచిన YCP ఎంపీటీసీలు.. ఎవరిని ఎంపీపీని చేయాలో.. ఎవరికి వైస్‌ పదవి కట్టబెట్టాలో క్లారిటీకి వచ్చారు. ఇంఛార్జ్ దువ్వాడకు ఆ విషయం చెప్పారట. నందిగాం మండల వైసీపీ నేతలు మాత్రం టచ్‌లోకి రాలేదట. దీంతో ఏంటా అని ఆరా తీసిన వారికి ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. వాటిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఇంఛార్జ్‌ హోదాలో అప్పట్లో అభ్యర్థులకు పేరాడ హామీ!
పేరాడ హామీని కాదని వేరొకరికి పదవి ఆఫర్‌ చేసిన దువ్వాడ!

పరిషత్‌ ఎన్నికల సమయంలో టెక్కలి వైసీపీ ఇంఛార్జ్‌ పేరాడ తిలక్‌. నాడు వైసీపీ నుంచి బరిలో దిగిన అభ్యర్థులకు తిలకే బీఫారాలు ఇచ్చారు. ఆ సమయంలో నందిగాం మండలంలో కాళింగ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలలో ఒకరికి MPPగా అవకాశం ఇస్తానని ఇంఛార్జ్‌ హోదాలో తిలక్‌ హామీ ఇచ్చారట. ఇప్పుడు ఫలితాలు వచ్చాక అదే జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ప్రస్తుతం టెక్కలి వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌.. నందిగాం MPP పదవిని కాపు సామాజికవర్గానికి ఇవ్వాలని భావించారట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నందిగాం మండలంలో గెలిచిన వైసీపీ ఎంపీటీసీలలో ఎక్కువ మంది దువ్వాడపై గుర్రుగా ఉన్నారట. ఫోన్‌లు స్విచాఫ్‌ చేసి అందుబాటులో లేకుండా పోయారట. మండలంలో గెలిచిన 16 మంది వైసీపీ ఎంపీటీసీలలో పది మంది పేరాడ తిలక్‌, మరో ఆరుగురు దువ్వాడ శిబిరంలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఒకటే పార్టీ రెండు క్యాంపులు!

టెక్కలిలో దువ్వాడ, పేరాడల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు ప్రస్తుతం నందిగాం MPP సీటుపై పడింది. పంతం నెగ్గించుకోవడానికి ఏకంగా క్యాంపులకు వెళ్లారు. ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఇలా రెండువర్గాలు క్యాంపులకు తరలించడంతో టెక్కలి వైసీపీలో మరోసారి ఆధిపత్యపోరు వైసీపీలో చర్చగా మారింది. రానున్న రోజుల్లో ఈ రాజకీయం ఇంకెలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Exit mobile version