ఏపీ టీడీపీలో మరో వికెట్ పడింది. అంటే పార్టీ నుంచి వెళ్లడం కాదండోయ్.. జైలుకు వెళ్లడం. టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సెంట్రల్ జైళ్లకు వెళ్లడం కామనై పోయింది.
అచ్చెన్న, కొల్లు అరెస్ట్ అయినా వెనక్కి తగ్గని ఉమా!
ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు అయ్యారు. దమ్ముంటే తనను అరెస్టు చెయ్యాలంటూ రెండేళ్లుగా సవాళ్లు చేస్తున్న ఈ మాజీ మంత్రిని వైసీపీ ప్రభుత్వం జైల్లో పెట్టింది. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీలో అందరికంటే ముందుగా ఈ మాజీ మంత్రే జైలుకు వెళ్తారని విస్తృత ప్రచారం జరిగింది. ఇరిగేషన్ కాంట్రాక్ట్‌ల విషయంలో శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అనేది ఆ ప్రచారం సారాంశం. అయితే వాటికి వెరవకుండా రోజూ ప్రభుత్వంపై చెలరేగిపోయారు ఉమా. తనతోపాటు నాడు కేబినెట్‌లో పనిచేసిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు అరెస్టు తర్వాత కూడా ఉమా తగ్గలేదు. రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో అధికార పార్టీకి ఆయన మరింత టార్గెట్ అయ్యారు.
ఈసారి పక్కా ప్రణాళికతో సక్సెస్ చేసిన పోలీసులు!
అప్పటి మంత్రిగా ఆయన శాఖల్లో జరిగిన అవకతవకలపై ఉమా బుక్ అవుతారని అంతా భావించారు. అయితే సొంత నియోజకవర్గంలో సొంత మనుషుల మధ్య జరిగిన చిన్న వివాదంలో ఉమా అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. తిరుపతి గురించి జగన్ తప్పుగా మాట్లాడారంటూ ఏదో వీడియో చూపించిన వ్యవహారంపై ఉమాపై కర్నూలులో కేసు నమోదైంది. దానిపై కోర్టుకు వెళ్లి అరెస్ట్ కాకుండా తప్పించుకున్నా.. ఈసారి మాత్రం పోలీస్ పక్కా ప్రణాళికతో ఎప్పుడో అనుకున్న కార్యక్రమాన్ని ఇప్పుడు సక్సెస్ చేసేశారు.
మూడుకు చేరిన మాజీ మంత్రుల అరెస్ట్‌ల సంఖ్య!
గొల్లపూడిలో సవాల్ అంటూ గతంలో నానా యాగీ చేశారు ఉమా. పోలీసుల కళ్లుగప్పి నిరసన చేస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. ఆ ఎపిసోడ్ ద్వారా మంత్రులతో వచ్చిన మాటకు మాట వివాదాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు యత్నించారాయన. ఇలా రెండేళ్ల కాలంలో వరస పరిణామాలతో విసుగెత్తిన ప్రభుత్వం ఉమాపై బాగానే ఫోకస్ పెట్టింది. తాజా గొడవలో జైల్లోకి నెట్టింది. దీంతో నాడు బాబు కేబినెట్‌లో ఉండి అరెస్ట్ ఐన మాజీ మంత్రుల సంఖ్య మూడుకు చేరింది. వీరు కాకుండా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర జైలుకు వెళ్లి వచ్చారు. మాజీ విప్ కూన రవికీ అరెస్ట్ తప్పలేదు. కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు జైలుకు వెళ్లి వచ్చారు. ఒక పెళ్లికి వెళ్లి అనూహ్యంగా కేసులో బుక్కైయ్యారు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి పరిస్థితీ అంతే.
అరెస్ట్‌లకు మానసికంగా సిద్ధమైన టీడీపీ నేతలు!
టీడీపీ నేతలు ఇప్పుడు ఏదైనా వివాదంలో ఇరుక్కుంటే చాలు పాత కేసులు తవ్వి జైలుకు పంపుతున్నారనేచర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు చంద్రబాబు కేబినెట్‌లోని సగం మంది ఏదో ఒక కేసులో ఇరుక్కున్నారు. నాడు చంద్రబాబు పర్యవేక్షణలో ఉన్న ఫైబర్‌గ్రిడ్, కార్మిక శాఖ పరిధిలోని స్కిల్ డెవలప్‌మెంట్ నిధుల గోల్‌మాల్ కేసుల్లో మరికొన్ని అరెస్ట్ ఉంటాయని అనుకుంటున్నారు. మొదట్లో కేసులకు భయపడిన పార్టీ నాయకత్వం కూడా ఇప్పుడు మానసికంగా సిద్ధమైనట్టు తెలుస్తోంది. కేసులు తప్పవు.. ఓ వారం పదిరోజులు జైలూ తప్పదనేది టీడీపీలో ప్రధాన చర్చ. అందుకే ఏ కొత్త అరెస్టూ వారిని నివ్వెర పర్చడం లేదట. మొత్తంగా మరో మాజీ మంత్రి రాజమండ్రి సెంట్రల్ జైల్‌కు వెళ్లారు. రానున్న రోజుల్లో ఇంకెందరు వెళతారో తెలీని పరిస్థితి.