Site icon NTV Telugu

ఏపీలో పేకాట రాజాలకు బ్యాండ్ బాజాయేనా…?

ఏపీలో పేకాట రాజకీయం హీటెక్కిందా? పేకాట క్లబ్‌ల వెనక ఎవరున్నారో.. ఆ చిట్టా మొత్తం చేరాల్సిన వారి దగ్గరకు చేరిందా? ఆ జాబితాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు? అధినేత ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకోని వారికి బ్యాండ్‌ బాజాయేనా? ఆ కథేంటో స్టోరీలో చూద్దాం.

పేకాటపై వచ్చే ఆదాయం వదులుకోవడం ఇష్టం లేని కొందరు నేతలు

గతంలో ఏపీలో పేకాట యధేచ్చగా సాగేది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి కార్డ్స్‌ ఆడేవారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో పేకాటకు చెక్‌ పెట్టారు. దీంతో రాష్ట్రంలో మోస్ట్‌ పాపులర్‌ అయిన క్లబ్‌లలో సైతం చతుర్ముఖ పారాయణం బంద్‌ అయింది. కార్డ్స్‌ ఆడించడం ద్వారా కోట్లకు పడగలెత్తిన వారికి ఈ నిర్ణయం రుచించలేదు. కొందరు కోర్టు తలుపులు తట్టారు. అయినా ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో వారి ఆటలు సాగలేదు. పేకాటపై వచ్చే ఆదాయాన్ని వదులుకోవడం ఇష్టం లేని మరికొందరు ప్రైవేట్‌గా వాటిని షురు చేశారు. ప్రజాప్రతినిధుల్లో కొందరు వీటికి అండగా నిలబడ్డారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. కల్లు మూసుకుని పాలు తాగుతున్న పిల్లి తనను ఎవరూ చూడటం లేదన్నట్టుగా మూడు షోలు.. ఆరు రౌండ్లు అన్నట్టుగా దందా సాగిపోతోంది.

అప్పట్లో ఓ మంత్రి ఇలాకాలో పేకాట క్లబ్‌లపై పోలీసులు దాడులు

ఎక్కడికక్కడ కొందరు అధికారులు కూడా పేకాటకు సహకరించడంతో ఇదో లాభసాటి బిజినెస్‌గా మారిపోయింది. ఒకరిని చూసి మరొకరు క్లబ్‌లు తెరిచేశారు. ఇదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పేకాట క్లబ్‌లపై పోలీసులు దాడులు చేయడంతో పెద్ద తలకాయలే బయటపడ్డాయి. అప్పట్లో ఒక మంత్రి ఇలాకలో పేకాట పెను దుమారమే రేపింది. మంత్రి ఇలాకలో పోలీసులు దాడులు చేయడం.. వారిపై పేకాట క్లబ్‌ నిర్వాహకులు ఎదురు తిరగడం.. సినిమా ఛేజింగ్‌ను తలపించింది. పెద్ద మొత్తంలో క్యాష్‌, కార్లు ఆ దాడిలో పట్టుబడ్డాయి. అలాగే మరో మంత్రి బంధువుల ఊరిలో క్లబ్‌ నిర్వహణ సైతం దుమారం రేపింది.

రాజధాని ప్రాంతంలో 70 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్‌
ఓ ఎంపీని పిలిచి.. క్లాస్‌ తీసుకున్న సీఎం పేషీ

లేటెస్ట్‌గా రాజధాని ప్రాంతంలోని పేకాట క్లబ్‌లపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. నాలుగైదు జిల్లా నుంచి వచ్చిన దాదాపు 70 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 33 లక్షల వరకు సీజ్‌చేశారు అధికారులు. ఈ పేకాట దందాలో ఓ ఎంపీ అనుచరుల మద్దతు ఉన్నట్టు టాక్‌. స్థానిక అధికారులను మేనేజ్‌ చేసి క్లబ్‌ నిర్వహిస్తున్నా.. పేకాట దందా విషయం బయటకు ఎలా లీక్‌ అయ్యిందా అని సదరు ఎంపీ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆ వెనువెంటనే సదరు నాయకుడికి ముఖ్యమంత్రి పేషీ నుంచి పిలుపువచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే పనులు చేయవద్దని సదరు నాయకుడికి గట్టిగానే క్లాస్‌ తీసుకున్నారట.

పేకాట క్లబ్‌లపై సీఎం జగన్‌ సీరియస్‌

తాజా ఘటన తర్వాత రాష్ట్రంలో పేకాట క్లబ్‌ల నిర్వహణపై సీఎం జగన్‌ చాలా సీరియస్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. ఇకపై ఇలాంటి వ్యవహారాల విషయంలో కఠినంగా ఉండబోతున్నట్టు సమాచారం. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా పేకాటకు అండగా ఉన్న కొంతమంది నేతల తీరుపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌ ఫోకస్‌ పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సీఎం చెంతకు పేకాట క్లబ్‌ల వెనక ఉన్న నేతల పేర్లు

సీఎం మూడ్‌ తెలుసుకున్న అధికారులు.. రాష్ట్రంలో అనధికారికంగా పేకాట క్లబ్‌లు ఎక్కడెక్కడ నడుపుతున్నారు? వాటి వెనక ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరు? అన్న సమాచారాన్ని ముఖ్యమంత్రికి అందజేసినట్టు తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవారు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆదేశించినట్టు సమాచారం. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఏపీలో పేకాట శిబిరాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయట.

పేకాట క్లబ్‌లతో సంబంధం ఉన్న నేతల్లో వణుకు

ఆలస్యంగానైనా … అసలు విషయం తెలుసుకున్న పేకాట క్లబ్‌లతో సంబంధం ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల్లో వణుకు మొదలైందని చెబుతున్నారు. ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తుందోనని టెన్షన్‌లో ఉన్నారట. మొత్తానికి గీత దాటిన వారికి బ్యాండ్‌ బాజా మొదలైందనే టాక్‌ జోరందుకుంది.

Exit mobile version