Site icon NTV Telugu

ఆ జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు…

ఆ జిల్లాలో అధికారపార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది? ‘గ్రేటర్’ ఎన్నికల తర్వాత మనస్పర్థలతో గ్యాప్‌ బాగా పెరిగింది. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవిని ఏకగ్రీవం చేయడం ఇష్టంలేక కొత్త ఎత్తులు వేస్తున్నారట. తాజా అరుపుల వెనక అసలు కథ ఏంటి?

మేడ్చల్‌ జిల్లా టీఆర్ఎస్‌లో తారాస్థాయికి వర్గపోరు!

హైదరాబాద్ ASరావునగర్ డివిజన్ టీఆర్ఎస్ సమావేశం రసాభాసగా మారడంతో పార్టీలో వర్గపోరు మరోసారి చర్చగా మారింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్‌ మర్రి రాజశేఖర్‌రెడ్డి సమావేశంలో ఉండగానే టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా డబ్బుల పంపిణీలో అవకతవకలు జరిగాయని విరుచుకుపడ్డారు కార్యకర్తలు. పోలీసులు వస్తే కానీ.. కేడర్‌ ఆవేశాలు చల్లారలేదు. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని టీఆర్ఎస్‌లో ఘర్షణలు కొత్త కాకపోయినా.. కొత్త గొడవ వెనక మాత్రం చాలా కథ ఉందని గులాబీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

టీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవి మర్రికి దక్కకుండా పావులు!

ప్రస్తుతం టీఆర్ఎస్‌లో జిల్లా అధ్యక్ష పదవులకు డిమాండ్‌ ఏర్పడింది. మేడ్చల్‌ జిల్లా టీఆర్ఎస్‌ అధ్యక్ష పదవిపై మర్రి రాజశేఖర్‌రెడ్డి కన్నేశారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి మంత్రి మల్లారెడ్డికి అల్లుడు. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన వ్యతిరేకవర్గం చురుకుగా పావులు కదుపుతోందట. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి మర్రికి దక్క కూడదన్నది వైరివర్గాల ఆలోచనట.

అనుచరులకు పదవి ఇప్పించేందుకు ఎమ్మెల్యే ఫోకస్‌!

మేడ్చల్‌ జిల్లా టీఆర్ఎస్‌ అధ్యక్ష పదవిని అనుచరులకు ఇప్పించుకోవాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి చూస్తున్నారట. ఈ కారణంగానే వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నట్టు చెబుతున్నారు. అవకాశం చిక్కితే గల్లా పట్టుకుని ఘర్షణ పడటానికి వెనకాడటం లేదట. GHMC ఎన్నికల్లో మేడ్చల్‌ జిల్లా పరిధిలో ఉన్న 10 డివిజన్లలో టీఆర్ఎస్‌ నాలుగే గెల్చుకుంది. ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి భార్య స్వప్న సైతం ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే భార్య ఓటమే.. సుభాష్‌రెడ్డి పనితనానికి నిదర్శనమన్నది వైరివర్గం విమర్శ. అందుకే జిల్లా అధ్యక్ష పదవి నియామకంలో బేతి మాటను పరిగణనలోకి తీసుకోకుండా ఎత్తులు వేస్తున్నారట.

గందరగోళంలో కేడర్‌!

జిల్లాలోని టీఆర్ఎస్‌ నేతల మధ్య సఖ్యత లేదు. ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో కేడర్‌కు తెలియని పరిస్థితి. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు వస్తే.. ఆయనకు చెప్పుకోవడానికి కేడర్‌ ఒక అవకాశం చిక్కుతుంది. అయితే ఎమ్మెల్యేలకు ఈ పదవులు ఇవ్వబోమని గులాబీ పెద్దలు చెప్పడంతో.. అనుచరులు లేదా కుటుంబ సభ్యులను ఆ కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి వర్గాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. మరి.. ఈ ఆధిపత్యపోరులో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.

Exit mobile version