NTV Telugu Site icon

హుజురాబాద్‌లో జరిగేది చిన్న ఉపఎన్నికా…?

హుజురాబాద్‌లో ఉపఎన్నిక ప్రచారం హోరెత్తుతున్న సమయంలో.. అదో చిన్న ఉపఎన్నిక అని కేటీఆర్ ఎందుకన్నారు? లోకల్‌ లీడర్లే అంతా చూసుకుంటారన్న ఆయన మాటల వెనక మతలబు ఏంటి? పొలిటికల్‌ సర్కిళ్లలో జరుగుతున్న విశ్లేషణేంటి? లెట్స్‌ వాచ్‌!

హజురాబాద్‌ ఉపఎన్నిక మీద కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌పై ఆసక్తి!

హుజురాబాద్‌లో గెలుపే లక్ష్యంగా రెండు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది అధికార పార్టీ టీఆర్ఎస్‌. మంత్రి హరీష్‌రావు బాధ్యతలు తీసుకుని పార్టీని గేరప్‌ చేస్తున్నారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలు.. పార్టీ సీనియర్‌ నాయకులు ఇంఛార్జ్‌లుగా ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు కూడా. ప్రస్తుతం ఈ ఉపఎన్నికపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనేక విశ్లేషణలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌..మంత్రి కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌పై ఆసక్తి నెలకొంది.

బైఎలక్షన్‌పై హైరానా అక్కర్లేదన్న కేటీఆర్‌!

గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్‌ ఉపఎన్నికపై అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. హజురాబాద్‌ అనేది చిన్న ఉపఎన్నిక అని.. దానితో ప్రభుత్వం కూలిపోయేది లేదు.. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదు అని కామెంట్‌ చేశారు కేటీఆర్‌. పైగా బైఎలక్షన్‌పై హైరానా అవసరం లేదనని తేల్చేశారు. హుజురాబాద్‌ టీఆర్ఎస్‌కు కంచుకోటగా విశ్లేషించారాయన.

ఉపఎన్నికను చిన్నఎన్నికగా పేర్కొన్న కేటీఆర్‌!

గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలోనూ మరోసారి హుజురాబాద్‌ ఉపఎన్నికను ప్రస్తావించారు కేటీఆర్‌. ఉపఎన్నిక చిన్న ఎన్నికగా మరోసారి అభివర్ణించారు. లోకల్ లీడర్లు చూసుకుంటారని పునరుద్ఘాటించారు కూడా. దీంతో హుజురాబాద్ ఉపఎన్నికపై కేటీఆర్ కామెంట్స్ వెనక అంతర్యం ఏంటన్న చర్చ మొదలైంది. మంత్రి హరీష్‌రావు, మరో సీనియర్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్‌లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు కోసం ఫోకస్‌ పెట్టారు. ఇలా గులాబీ పార్టీ సీరియస్‌గా బైఎలక్షన్‌పై దృష్టి పెట్టిన తరుణంలో కేటీఆర్‌ ఎందుకలా అన్నారు అని ఆరా తీస్తున్నారట.

కేటీఆర్‌ కామెంట్స్‌పై పొలిటికల్ సర్కిళ్లలో చర్చ!

ఇప్పట్లో అక్కడ ఉపఎన్నిక షెడ్యూల్‌ వచ్చేలా లేదు. దీపావళి తర్వాతే పోలింగ్‌ ఉండొచ్చని అనుకుంటున్నారు. అప్పటి వరకు రాజకీయ వేడిని కాపాడుకుంటూ రావడం టీఆర్ఎస్‌, బీజేపీలకు సవాలే. అందుకే కేటీఆర్‌ కామెంట్స్‌పై పొలిటికల్‌ సర్కిల్స్‌లో రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. మరి.. అంతిమంగా ఈ వ్యాఖ్యల పరిణామాలు ఎలా తేలతాయో చూడాలి.