ఏదైనా గొడవ జరిగితే పోలీసులకు చెబుతా.. కేసు పెడతా అంటారు కొందరు. దీంతో ఎదుటి పక్షం భయపడుతుందనేది వాళ్ల అభిప్రాయం. ఆ నియోజకవర్గంలోనూ అంతే..! కాకపోతే ఖాకీల పేరు చెప్పి కాసులు వెనకేసుకుంటున్నారట అధికారపార్టీ నేతలు. వర్గపోరు శ్రుతి మించి రోడ్డెక్కుతున్నారు.
పోలీసుల పేరుతో పార్టీ నేతల వసూళ్లు?
కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. ఇదే నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి. ఎవరి వర్గం వారిదే. మొదటి నుంచి అస్సలు పడటం లేదు. ఈ వర్గపోరు కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పుంజుకుందని ఇప్పటికీ చెప్పుకొంటారు. ఆధిపత్యపోరును వీడి.. కలిసి పనిచేసే పరిస్థితి లేదన్నది స్థానికంగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు
అక్రమ మద్యం, అక్రమ ఇసుక తవ్వకాలు, పోలీసుల పేరుతో మామూళ్ల వసూళ్లు వీరి మధ్య మరింత చిచ్చు పెట్టాయి. పోలీసులపై దాడులు చేసే వరకు వెళ్లాయి కూడా.
ఎమ్మెల్యే పాదయాత్రలో రెండు వర్గాల ఘర్షణ
కోడుమూరు వైసీపీ విభేదాలు గతంలో పార్టీ పెద్దల దృష్టికి వెళ్లాయి. వారు సర్దిచెప్పినా.. సుధాకర్, కోట్ల హర్ష వర్గాలు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా కోడుమూరు మండలం గోరంట్లలో SI వేణుగోపాల్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం కలకలం రేపింది. జగన్ పాదయాత్ర పూర్తయ్యి నాలుగేళ్లు అయిన సందర్భంగా గూడూరులో ఎమ్మెల్యే నిర్వహించిన యాత్రలో వైసీపీలో రెండువర్గాలు ఘర్షణ పడ్డాయి. పోలీస్ ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారంతో గోరంట్లలో అక్రమ మద్యం విక్రేతలను PSకు తీసుకొస్తే ఎమ్మెల్యే సుధాకర్ రాత్రి 11 గంటలకు SIకి ఫోన్ చేసి వారిని విడిపించుకుని వెళ్లారట.
పోలీసుల పేరు చెప్పి మద్యం వ్యాపారుల నుంచి రూ.2వేల చొప్పున వసూళ్లు..!
గోరంట్ల గొడవలోనే SIని వీఆర్‌కు పంపారని టాక్. పోలీసులకు మామూళ్లు ఇవ్వాలని గోరంట్లలో ఎమ్మెల్యే అనుచరుడు మద్యం వ్యాపారుల నుంచి 2 వేల చొప్పున డబ్బులు వసూళ్లు చేస్తున్నారట. ఆ విషయం తెలిసిన ఉన్నతాధికారులు వారిని పట్టుకుని రావాలని SIని పంపితే.. ఆ ఎస్‌ఐపైనే ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారట. దాడి చేయాలని ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్న ప్రజాప్రతినిధి.. స్థానికులను రెచ్చగొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడటంపై ఖాకీ బాస్‌లు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.
విభేదాలు శ్రుతి మించి రోడ్డెక్కుతున్నా పార్టీ పెద్దలు మౌనం..!
వైసీపీలో విభేదాలు.. అక్రమ దందాలతో కోడుమూరులో పార్టీ వీక్ అవుతోందన్నది కేడర్ ఆందోళన. ఈ సమయంలో ఎమ్మెల్యే, ఇంఛార్జ్ ఇద్దరూ మౌనంగా ఉండటం.. వర్గపోరుకే ప్రాధాన్యం ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందని కేడర్ చెవులు కొరుక్కుంటోంది. శ్రుతిమించి రోడ్డెక్కుతున్న శ్రేణులను గాడిలో పెట్టడానికి పార్టీ పెద్దలు చొరవ తీసుకోవాలని కోరుతున్నారట. మరి.. ఎప్పటిలా చెప్పి ఊరుకుంటారో.. కేడర్ ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి.
