NTV Telugu Site icon

కోదాడ టీఆర్‌ఎస్‌లో కొత్త కాక..!

లెక్కలో తేడా వచ్చింది.. అనుచరులపై ఎమ్మెల్యేకు కోపం వచ్చింది..! కుర్చీలో నుంచి దించేసేందుకు రంగం సిద్ధం చేశారట. ఈ విషయం బయటకు గుప్పుమనడంతో కోదాడ టీఆర్‌ఎస్‌లో చెవులు కొరుకుడు ఎక్కువైంది. అదేంటోఈ స్టోరీలో చూద్దాం.

వైరి వర్గాలుగా ఎమ్మెల్యే.. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌..!

సూర్యాపేట జిల్లా కోదాడలో నిన్న మొన్నటి వరకు కామ్‌గా ఉన్న టీఆర్ఎస్‌ రాజకీయాలు ఒక్కసారిగా కాక రేపుతున్నాయి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు కోదాడ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వనపర్తి శిరీష.. ఆమె భర్త లక్ష్మీనారయణలకు అస్సలు పడటం లేదు. శిరీష దంపతులు ఎమ్మెల్యేకు అనుచరులే. అందుకే జనరల్‌ సీటులో బీసీ వర్గానికి చెందిన శిరీషను ఛైర్‌పర్సన్‌ అయ్యేలా చక్రం తిప్పారు మల్లయ్య యాదవ్‌. అలాంటిది ఎమ్మెల్యే, ఛైర్‌పర్సన్‌ మధ్య చాలా గ్యాప్ వచ్చిందట. ఒకరినొకరు రాజకీయంగా అనుమానంగా చూసుకుంటూ.. వైరిపక్షాల మాదిరి మాటల కత్తులు దూసుకుంటున్నారు.

ఆరు నెలలుగా రెండు వర్గాల మధ్య వార్‌..!

కోదాడ కౌన్సిల్ ఏర్పడి తర్వాత కరోనా వల్ల పాలకవర్గాల మీటింగ్‌లు జరగలేదు. దీంతో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ మున్సిపల్‌ అధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చేవారు. పట్టణ పరిధిలో ఏదైనా పనులు చేపట్టాలన్నా శిరీష.. ఆమె భర్త ఎమ్మెల్యే పర్మిషన్‌ తీసుకొనేవారట. ఎక్కడ తేడా కొట్టిందో ఏమో.. ఆరు నెలలుగా వీళ్లకు అస్సలు పడటం లేదట. రెండు వర్గాలుగా విడిపోయారని టాక్‌.

అవుట్ సోర్సింగ్‌ పద్ధతిలో 120 మంది నియామకం..!
రూ. 3 లక్షల చొప్పున వసూలు చేసినట్టు ఆరోపణలు
మరోసారి రూ.70 వేల చోప్పున వసూలు చేశారట..!

శిరీష ఛైర్‌పర్సనే అయినా కోదాడ మున్సిపాలిటీలో పెత్తనం ఆమె భర్త లక్ష్మీనారాయణదే అనే విమర్శ ఉంది. దీనిపై టీఆర్ఎస్‌ కౌన్సిలర్లే ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. పైగా అవినీతిపై అధికారపార్టీలోనే కథలు కథలుగా చెప్పుకొంటున్నారట. శానిటేషన్‌ విభాగంలో 120 మందిని అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమించుకోవడానికి కౌన్సిల్‌లో తీర్మానం చేయగా.. ఒక్కో వ్యక్తి నుంచి 3 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో అందరికీ వాటలు అందాయట. అయితే సాంకేతిక కారణాలతో నియామక ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడా ప్రతిపాదనలను తెరపైకి తెచ్చి డబ్బులు ఇచ్చినవాళ్లను నియమించుకునే పని ప్రారంభించారట. అయితే ఎంపికైన అభ్యర్థుల నుంచి మరో 70 వేల చోప్పున వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. లెక్క తేడా కొట్టడంతో ఛైర్‌పర్సన్‌ శిరీషపై అవిశ్వాసం పెట్టి దింపేయడానికి ఎమ్మెల్యే ప్లాన్‌ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

కౌన్సిలర్లతో టీఆర్ఎస్‌ టౌన్‌ ప్రెసిడెంట్‌ మీటింగ్‌..!

ఇదే సమయంలో టీఆర్ఎస్‌ కోదాడ టౌన్‌ అధ్యక్షుడు కొందరు కౌన్సిలర్లతో మీటింగ్‌ పెట్టడంతో ఛైర్‌పర్సన్‌ను దించేస్తారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. మరి.. ఛైర్‌పర్సన్‌ భర్త.. ఎమ్మెల్యేతో రాజీకి వస్తారో.. వైరిపక్షంగా మారి యుద్ధానికి సై అంటారో అని పార్టీ వర్గాల్లో ఒక్కటే చర్చ. మరి.. కోదాడ టీఆర్ఎస్‌లో రేగిన ఈ రగడకు ఎక్కడ ఫుల్‌ స్టాప్‌ పడుతుందో చూడాలి.