పార్టీ సంస్థాగత ఎన్నికలు ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో చర్చగా మారాయి.. రచ్చ రచ్చ అవుతోంది. స్వపక్షంలోని వ్యతిరేకులకు ఛాన్స్ ఇవ్వకుండా సొంతవారితో కమిటీలు నింపేస్తున్నారట ఎమ్మెల్యేలు. అవకాశం దక్కని నేతలు.. వారి అనుచరులు గుర్రుగా ఉన్నారట. ఈ అసంతృప్తి ఎన్నికల నాటికి ఏ విధంగా భగ్గుమంటుందో అనే టెన్షన్ కేడర్‌లో ఉందట.
కమిటీల ఏర్పాటులో అగ్గి రాజేస్తోన్న వర్గపోరు..!
ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్ ప్రస్తుతం వలస నేతలు, కార్యకర్తలతో పూర్తిగా నిండిపోయింది. అప్పట్లో టీడీపీ నుంచి వచ్చినవారితో పటిష్ఠంగా కనిపిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారితో ఫుల్ అయింది. ఇక టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి ఉన్నవారు సరేసరి. వివిధ పార్టీల నుంచి వచ్చి గులాబీ కండువా కప్పుకొన్నా.. జిల్లాలో ఎవరివర్గం వారిదే. పైకి కలిసే ఉంటారు కానీ.. ఎవరి శిబిరం వాళ్లదే. ప్రస్తుతం ఈ వర్గాల మధ్య అగ్గి రాజేస్తోంది టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల కూర్పు.
ఎమ్మెల్యేలకు, ఓడిన టీఆర్‌ఎస్ నేతలకు పడటం లేదట..!
2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో ఐదుగురు, టీడీపీ నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. నాడు ఎన్నికల్లో ఓడిన వారికి.. వీళ్లకు అస్సలు పొసగడం లేదు. నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే సుప్రీం అని పార్టీ తేల్చేయడంతో.. స్వపక్షంలోని వైరివర్గాలను దగ్గరకు చేరనివ్వడం లేదు. ఇది ఆయా సందర్భాలలో గొడవలకు దారితీస్తోంది. ఇప్పుడు పార్టీ సంస్థగత కమిటీల ఎన్నిక వీరి మధ్య గొడవలు ఇంకా పెంచాయి.
అనుచరులకే పార్టీ కమిటీలో పెద్దపీట..!
పాలేరులో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావులు తమ అనుచరులకు తప్ప ఇంకెవరికీ పార్టీ కమిటీలలో ప్రాధాన్యం ఇవ్వడం లేదట. వైరాలో మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ వర్గాన్ని దూరంగా పెట్టారట ఎమ్మెల్యే రాములు నాయక్. ఇదే పరిస్థితి, సత్తుపల్లి, అశ్వారావుపేటలోనూ ఉంది. అశ్వారావుపేటలో టీడీపీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు ఈ మధ్య టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు వర్గానికి ఆయన అనుచరులకు పడటం లేదు. ఆ ప్రభావం కమిటీలపై పడింది. పినపాకలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు అనుచరులకు కమిటీలో చోటు కల్పించడం లేదట ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్యల మధ్య విభేదాలు తెలిసిందే. కమిటీలలో తమవారిని వేయడం లేదని మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఫిర్యాదు చేశారట కనకయ్య.
అసంతృప్తిపై పార్టీ నేతల్లో గుబులు..!
2014, 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పరిస్థితిని తెలిసిన కేడర్‌లో.. పార్టీలో మొదటి నుంచి ఉంటున్నవారిలో ఆందోళన మొదలైందట. ఉమ్మడిగా పనులు చేపట్టకపోతే.. వచ్చే ఎన్నికల నాటికి ఈ అసంతృప్తి పార్టీకి ఏ విధంగా డ్యామేజ్ చేస్తుందో అని టెన్షన్ పడుతున్నారట. మరి.. మూడు గ్రూపులు..ఆరు శిబిరాలుగా ఉన్న టీఆర్‌ఎస్ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు గులాబీ పెద్దలు ఎలాంటి చికిత్స చేస్తారో చూడాలి.
