Site icon NTV Telugu

మంత్రి పదవిపై బండ, గుత్తా ఆశలు..!

మంత్రి పదవిపై వాళ్లిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనేక లెక్కలు.. కూడికలు వేసుకున్నారు కూడా. చట్టసభలకు వెళ్లినా.. కేబినెట్‌లో బెర్త్‌ వాళ్లకు అందని ద్రాక్షాయేనా? సమీకరణాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి?

కొత్త ఎమ్మెల్సీలు చాలా ఆశలే పెట్టుకున్నారా?

పాత కొత్త కలిపి.. తెలంగాణ శాసనమండలికి ఇటీవల 19 మంది ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో 12 మంది.. ఎమ్మెల్యేల కోటాలో ఆరుగురు.. గవర్నర్ కోటాలో ఒకరు ఈ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం మండలిలో ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌, చీఫ్ విప్, విప్‌ తదితర పదవుల భర్తీకి టీఆర్ఎస్‌లో కసరత్తు జరుగుతోంది. ఇందులో ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్ పోస్టులకు ఎవరిని ఎంపిక చేయాలో ఆల్‌రెడీ డిసైడ్‌ అయినట్టు సమాచారం. ఇదే టైమ్‌లో కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని ఆశ పెట్టుకున్నవాళ్లలో మండలికి ఎన్నికైన సభ్యులు కూడా ఉన్నారు. అయితే సమీకరణాలు.. జిల్లాల్లోని పరిస్థితులు.. అక్కడి రాజకీయ కారణాలు కొందరు నేతలకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ఇద్దరి గురించే ఇప్పుడు చర్చ మొదలైంది.

గుత్తాను మరోసారి మండలి ఛైర్మన్‌ను చేస్తారా..?
బండ ప్రకాశ్‌ను మండలి డిప్యూటీ ఛైర్మన్‌ను చేస్తారా..?

మంత్రి కావాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారిలో గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒకరు. గతంలోనే ఆయన కేబినెట్‌లో చోటు ఆశించారు. చివరకు శాసనమండలి ఛైర్మన్‌ పదవితో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్సీ కావడంతో తప్పకుండా మంత్రి అవుతామనే అంచనాల్లో ఉన్నారు గుత్తా. కానీ..గుత్తా సుఖేందర్‌రెడ్డిని మరోసారి శాసనమండలి ఛైర్మన్‌ను చేస్తారనే బలమైన టాక్‌ గులాబీ శిబిరంలో ఉంది. అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్‌ను.. ఎమ్మెల్సీని చేశారు. ముదిరాజ్‌ సామాజికవర్గం కోటాలో ప్రకాశ్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారని ఓ రేంజ్‌లో ప్రచారం జరిగింది. కానీ.. ప్రకాష్‌ను శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ను చేయొచ్చన్నది టీఆర్ఎస్‌లో తాజా చర్చ. దాంతో గుత్తా సుఖేందర్‌రెడ్డి, బండ ప్రకాష్‌లకు మంత్రి అయ్యే యోగం లేదని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ శ్రేణులు.

ఉమ్మడి ఓరుగల్లు జిల్లాకు చెందిన 8 మంది ఎమ్మెల్సీల్లో ఎవరి లెక్కలు వారివే..!

శాసనమండలికి ఎన్నికైన వారిలో కడియం శ్రీహరి.. మధుసూదనాచారిలను ఎమ్మెల్సీలుగానే ఉంచేస్తారా లేక ఇంకేదైనా పిలుపు ఉంటుందా అన్నది పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదు. వీరిద్దరిదీ వరంగల్‌ జిల్లానే. ఇక మండలిలో చీఫ్‌విప్‌ పదవి కోసం వరంగల్‌ జిల్లాకే చెందిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉన్నా.. ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ శాసనసభలో చీఫ్‌విప్‌గా ఉన్నారు. దాంతో ఉభయ సభల్లోని చీఫ్‌విప్‌ పదవులు ఒకే జిల్లాకు ఇస్తారా అనేది ప్రశ్న. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి 8 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీళ్లంతా ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. చీఫ్‌విప్‌ కాకపోయినా.. విప్‌ పదవి అయినా దక్కకపోతుందా అన్నది వీరిలో కొందరి ఆశ. మరి.. పదవుల పందేరంలో ఎవరి ఆశలు ఫలిస్తాయో.. ఇంకెవరి లెక్కలు నిజం అవుతాయో చూడాలి.

Exit mobile version