NTV Telugu Site icon

ఢిల్లీలో ఈటెలకు అవమానం జరిగిందా…?

టీఆర్‌ఎస్‌ను వీడి.. బీజేపీ గూటికి చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు.. అవమానం జరిగిందా? దానిపై పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చ జోరందుకుందా? ఇంతకీ ఢిల్లీలో ఈటలకు ఎదురైన అనుభవాలేంటి? సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతున్న దృశ్యాలు ఏం చెబుతున్నాయి? లెట్స్‌ వాచ్‌..

బీజేపీలో ఈటల చేరికపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్‌

కొద్దిరోజలుగా తెలంగాణ రాజకీయాలు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చుట్టూ తిరుగుతున్నాయి. మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చకచకా జరిగిపోయాయి. వివిధ పార్టీల నాయకులతో ఆంతరంగిక మంతనాలు నిర్వహించిన మాజీ మంత్రి.. చివరకు ప్రత్యేక విమానంలో అనుచరులను తీసుకుని ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకొన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈటల ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్‌ ల్యాండ్‌ కాకమునుపే ఆయన గురించి సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ ఓ రేంజ్‌లో స్టార్ట్‌ అయింది. అదే ఇప్పుడు రాజకీయాలను వేడెక్కిస్తోంది.. ఆసక్తిక చర్చ జరుగుతోంది.

చేరిన రోజే బీజేపీలో ఈటలను పక్కన పెట్టారని ప్రచారం

ఈటల బీజేపీలో చేరే క్రమంలో ఢిల్లీలో జరిగిన పరిణామాలు చూసినవాళ్లు.. ఆయనకు అవమానం జరిగిందని చర్చ మొదలుపెట్టారు. సోషల్‌ మీడియాలో అయితే ఈ కోణంలో జరుగుతున్న చర్చ చాలా విస్తృతంగా ఉంది. బీజేపీలో చేరిన మొదటి రోజే ఈటలను పక్కన పెట్టారని ట్రోల్‌ చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

బీజేపీ ఈటలకు ప్రాధాన్యం ఇవ్వలేదని సెటైర్లు

ఈటల రాజేందర్‌.. మాజీ మంత్రి. ఉద్యమ నాయకుడు. పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. అదీ ప్రత్యేక విమానంలో. దాంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ.. ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో ఈటల అండ్‌ కో బీజేపీ కండువా కప్పుకొంది. నడ్డా సమక్షంలో ఈ చేరికలు జరగలేదు. ఈ అంశాన్నే ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. బీజేపీ ఈటలకు ప్రాధాన్యం ఇవ్వలేదని.. ఆయన్ని లైట్‌గా తీసుకుందని.. తొలిరోజే ఢిల్లీ బీజేపీ ఆఫీస్‌ వేదికగా జరిగిన అవమానంగా కొందరు విశ్లేషిస్తున్నారు.

నడ్డా సమక్షంలో చేరిక లేనప్పుడు ఢిల్లీకి ఎందుకని ప్రశ్న

జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ చేరాల్సిన ఈటల.. ఎవరి సమక్షంలోనో కాషాయ కండువా కప్పుకోవడం ఏంటని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం దానికి ప్రత్యేక విమానం.. ఢిల్లీ వరకు వెళ్లాల్సిన అవసరం ఏంటన్నది వారి అభిప్రాయం. ఈటల జాయినింగ్‌ సందర్భంగా హాజరైన వారంతా తెలంగాణ బీజేపీ నేతలే ఉన్నారు. అంత మాత్రం దానికి ఆ చేరికలు ఏవో హైదరాబాద్‌లోనే చేస్తే పోలా అని సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి.

నడ్డాతో నేతలు దిగిన ఫొటోలలో కనిపించని ఈటల

జేపీ నడ్డాకు ఆరోగ్యం బాగోలేదన్నది కొందరు బీజేపీ నేతల వాదన. అందుకే రాలేదని కాషాయ నేతలు చెబుతున్నారు. అదే నిజమైతే.. జేపీ నడ్డా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే.. పార్టీలో కొత్తగా చేరిన ఈటల రాజేందర్‌ అండ్‌ బ్యాచ్‌ను ఎందుకు కలిశారు అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఆ సందర్భంగా నడ్డాతో వివిధ నాయకులు దిగిన ఫొటోలలో ఈటల రాజేందర్‌ ఎక్కడా కనిపించడం లేదు. ఆయన ఎక్కడో వెనకాల ఉన్నారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టి.. అప్పుడే ఈటలను పక్కన పెట్టేశారని ప్రచారం మొదలుపెట్టేశారు. ఆ సమయంలో ఈటల ఆత్మాభిమానం ఎక్కడికి పోయిందని ఆయన మాటలను ఆయనకే అప్పజెబుతున్నారు.

బీజేపీలో అంతేనని కమలనాథులు వివరణ
బీజేపీలో చేరిన వివిధ పార్టీల నేతల పాత ఫొటోలు వెలికితీత

సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీ నేతలు అలర్ట్‌ అయ్యారు. తమదైన శైలిలో ఢిల్లీ ఎపిసోడ్‌కు.. విమర్శలకు ట్యూన్‌ కడుతున్నారు. బీజేపీ ఆనవాయితీ ప్రకారం.. ఎవరైనా ముందు బీజేపీ ఆఫీసులో చేరి.. తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలుస్తారని వివరణ ఇస్తున్నారు. విజయశాంతి విషయంలో అలాగే జరిగిందని ఒక ఉదహరణ వదిలారు. యూపీ కాంగ్రెస్‌ నేత జితిన్‌ ప్రసాద్‌ చేరిక సైతం అలాగే జరిందని ఇంకా బలంగా వాదిస్తున్నారు. అయితే ఈ వివరణలకు కూడా సోషల్‌ మీడియాలో కౌంటర్లు స్టార్ట్‌ అయ్యాయి. అబ్బా.. చా..! ఈ చేరికలు ఏంటని గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుల సమక్షంలో పార్టీలో చేరిన కొందరి ఫొటోలను పెట్టి.. దీనికేం చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈటల బీజేపీలో చేరిక కంటే.. ఆ సమయంలో జరిగిన పరిణామాలపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.