NTV Telugu Site icon

పార్టీ పదవుల కోసం ఎమ్మెల్యేల మధ్య లొల్లి…!

పార్టీ కమిటీల ఎంపికకు ముందే అధికారపార్టీ ఎమ్మెల్యేల మధ్య లొల్లి మొదలైందా? జిల్లాస్థాయి పదవులను తమ నియోజకవర్గానికే కేటాయించేలా ఎత్తుగడలు వేస్తున్నారా? ఈ విషయంలో ఎవరికి వారు చక్రం తిప్పుతున్నారా? ఇంతకీ ఏంటా పదవి? ఏమా గొడవ?

అనుచరులకు పదవులు కట్టబెట్టే యత్నం?

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నాలుగు ముక్కలైన తర్వాత.. ఏర్పాటవుతున్న టీఆర్‌ఎస్‌ కమిటీలకు నలుగురు జిల్లా అధ్యక్షులు రాబోతున్నారు. ఈ విషయంలో జిల్లాల్లో కీలకంగా ఉన్న నాయకులు తెరవెనక పెద్ద మంత్రాంగమే నడుపుతున్నారట. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, సుమన్‌, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తోపాటు నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారు.. తమకు అనుకూలంగా ఉన్నవారిని జిల్లా టీఆర్ఎస్‌ అధ్యక్షులను చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అధికార పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు యాక్టివ్‌ అయ్యారట. ఆ పదవేదో తమ వారికే వచ్చేలా లాబీయింగ్‌ చేస్తున్నారట.

నేతల అర్హతలపై ఎవరికి చెప్పాలో వారికి చెబుతున్నారా?

ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు నియోజకవర్గాలు.. నిర్మల్‌లో మూడు, మంచిర్యాలలో మూడు, కొమురం భీమ్‌ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అన్నిచోట్లా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరంతా తమ అనుయాయులను బయోడేటా సిద్ధం చేసుకోవాలని చెప్పారట. సామాజిక సమీకరణాల ప్రకారం జాబితాను సిద్ధం చేసినట్ట టాక్‌. అధ్యక్ష పదవి చేపట్టడానికి ఉన్న అర్హతలను ఎవరికి చెప్పాలో వారి చెవిన వేస్తున్నారట.

పదవులు ఎవరికి ఇవ్వాలో ఇప్పటికే డిసైడ్‌ అయిందా?

నిర్మల్ జిల్లా కేంద్రానికి అన్ని పదవులున్నాయని.. అందుకే జిల్లా అధ్యక్ష పదవిని తమ నియోజకవర్గానికి ఇవ్వాలని ఖానాపూర్‌ నేతల డిమాండ్‌. ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న గట్టి పట్టే పట్టారట. కానీ.. మరో ఇద్దరు నాయకులు మాత్రం వేరే వర్గానికి ఇప్పించేందుకు ఏకంగా హైదరాబాద్‌ వెళ్లినట్టు టాక్‌. మంచిర్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యే జిల్లా కమిటీ లిస్టే ప్రిపేర్‌ చేసేశారట. ఇక్కడ బీసీ, ఎస్సీ సామాజికవర్గాల వారికి పదవి ఇవ్వాలనే డిమాండ్స్‌ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా.. పార్టీ నేతల అభిప్రాయాన్ని గులాబీ పెద్దలు తీసుకుంటారా? ఇప్పటికే ఎవరికి పదవి కట్టబెట్టాలో డిసైడ్‌ అయ్యారేమో అన్న సందేహాలు కేడర్‌లో ఉన్నాయట. పైకి చెప్పకపోయినా.. ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం.. పార్టీలో అంతర్గతంగా కీచులాటకు దారితీస్తున్నట్టు సమాచారం. మరి… టీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షుల విషయంలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.