సోమారపు సత్యనారాయణ. రామగుండం మాజీ ఎమ్మెల్యే. కండువా మార్చినా ఆయనకు పట్టు చిక్కడం లేదట. ఇన్నాళ్లూ ఏ పార్టీలో ఉన్నా.. నిత్య పోరాటమే చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా.. కొత్తగా వచ్చిన నేతలతో ఆయనకు తలనొప్పులు తప్పడం లేదట. దీంతో సొంత గూటిని వదిలి తప్పు చేశామా అని ఆలోచన చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం అక్కడా ఖాళీ లేకపోవడంతో మరోసారి స్వతంత్రంగా పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే యోచనలో ఉన్నారట సోమారపు.
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి సోమారపు పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే ఆయన ఇండిపెండెంట్‌గా బరిలో దిగటానికి మొగ్గు చూపటం వెనక బలమైన కారణం ఉందని చర్చ నడుస్తోంది. రామగుండం ఎన్నికల చరిత్రలో స్వతంత్ర అభ్యర్థులకు ఓటర్లు బాగానే పట్టం కట్టారు. 2009లో సోమారపు ఇండిపెండెంట్‌గానే గెలిచారు. తర్వాత కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. ఆపై టీఆర్ఎస్‌లో చేరి 2014లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా లక్ కలిసి రాలేదు. దీంతో బీజేపీలో చేరిపోయారు.
బీజేపీలో ఒక నేత తనను ఎదగనివ్వడం లేదనే ఆందోళనలో సోమారపు ఉన్నారట. అందుకే బీజేపీకి గుడ్‌బై చెప్పేస్తారని బలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ మాట చెల్లుబాటు కావడం లేదట. ప్రస్తుతం రామగుండం బీజేపీలో సోమారపు అనుకూల.. వ్యతిరేక వర్గాలు చురుకుగా ఉన్నాయి. దీంతో కమలంతో అంటీముట్టనట్టు ఉంటున్నారట మాజీ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కోరుకంటి చందర్.. టీఆర్ఎస్‌లో ఉండటంతో.. అక్కడ సీటు ఖాళీ లేదు. మళ్లీ గులాబీ గూటికి వెళ్లి ఇబ్బంది పడటం ఎందుకని అనుకుంటున్నారో ఏమో.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికే ఇష్ట పడుతున్నట్టు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించి బీజేపీలో కొనసాగుతుంటే..అక్కడి విభేదాలతో ఓటమి తప్పదని సోమారపును హెచ్చరిస్తున్నారట సన్నిహితులు. మరోవైపు బీజేపీ తరపున బరిలో దిగితే రామగుండంలో ఉన్న మైనారిటీల ఓట్లు పడబోవని లెక్కలేస్తున్నారట. వచ్చే ఎన్నికల కోసం సర్వేలు చేయించిన ఆయనకు బీజేపీ అభ్యర్థిగాకంటే ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తే బెటర్ అని తేలిందట. గత ఎన్నికల్లో సింహం గుర్తుపై పోటీ చేసిన కోరుకంటి చందర్ గెలిచారు. వచ్చే ఎన్నికల్లో అదే సింహం గుర్తుపై పోటీ చేయాలని సోమారపు ఆలోచిస్తున్నారట. మరి.. మాజీ ఎమ్మెల్యే ఏం చేస్తారో చూడాలి.
