Site icon NTV Telugu

Off The Record: నరసరావుపేటలో కాసు వర్సెస్ గోపి రెడ్డి !.. తాజాగా పొగలు పుట్టిస్తున్న వాట్సాప్ వార్

Kasu

Kasu

Off The Record: అక్కడ వైసీపీ కేడర్‌ పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారిందా? ఆవులు ఆవులు పొడుచుకుంటే మధ్యలో దూడలు నలిగిపోయినట్టు మా పరిస్థితి తయారైందని ద్వితీయ శ్రేణి నేతలు సైతం తెగ ఫీలై పోతున్నారా? ఇద్దరు పెద్ద నేతలు చేస్తున్న వాట్సాప్‌ వార్‌లో కింది వాళ్ళు బలవుతోంది ఎక్కడ? అసలు అక్కడున్న సమస్య ఏంటి?

Read Also: Telangana Govt: మహిళలకు శుభవార్త.. డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ!

వైసీపీలో పల్నాటి యుద్ధం జరుగుతోంది. కాకుంటే… కత్తులు కటార్లకు బదులు కాస్త మోడ్రన్‌గా సోషల్‌ మీడియా వార్‌ చేస్తున్నారు పార్టీ లీడర్స్‌. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇందుకు వేదిక అవుతోంది. ఇక్కడి నుంచి వైసీపీ తరపున మూడుసార్లు పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2014, 2019లో గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారాయన. ప్రస్తుతం పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే. ఇక కాసు కుటుంబానికి ఐదు దశాబ్దాలుగా కార్యక్షేత్రం ఈ సెగ్మెంట్‌. ఆ ఫ్యామిలీకి తరాల రాజకీయ వారసత్వం ఉంది ఇక్కడి నుంచి. కానీ.. 2019లో ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో గురజాల నుంచి వైసీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు కాసు మహేష్‌రెడ్డి.

Read Also: Off The Record: బండి సంజయ్ మాటలకు కౌంటర్‎గానే ఈటల ఆలా అన్నారా ?

ఇక, 2024లో తిరిగి అక్కడే పోటీ చేసి ఓడిపోయారాయన. దీంతో తిరిగి తన పాత కేరాఫ్‌ నరసరావుపేట వైపు చూస్తున్నారట కాసు. ప్రస్తుతం ఇద్దరూ పల్నాడు జిల్లా వైసీపీలో కీలకంగా ఉండటంతో.. పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. 2014 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరారు కాసు మహేష్ రెడ్డి. దీంతో ఆయన 2019 ఎన్నికల్లో నర్సరావుపేటనుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ వైసీపీ అధిష్టానం ఆయన్ని గురజాలకు పంపింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన మనసంతా.. నరసరావుపేట మీదే ఉందట. ఇక వైసీపీలో చేరినప్పటి నుంచి కాసు, గోపిరెడ్డి మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు లేవన్నది లోకల్‌ వాయిస్‌. మహేష్‌రెడ్డి నర్సరావుపేటలో ఎంటరవకుండా… గోపిరెడ్డి ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకుంటూ వస్తున్నారట. అయినాసరే… 2024 ఎన్నికలకు ముందు కూడా కాసు నర్సరావుపేట నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో జరిగింది.

Read Also: Off The Record: అనర్హత పిటిషన్స్ పై త్వరలోనే నిర్ణయం..ఆ ఇద్దరి మీద చర్యలు ఉంటాయా ?

మహేష్ రెడ్డి తండ్రి కాసు కృష్ణారెడ్డి ఆత్మీయ సమావేశం పేరుతో హడావుడి చేయడం అప్పుడు వైసీపీలో కలకలం రేపింది.తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది, ఇక 2024 ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. కానీ… ఇటీవల మొదలైన వాట్సాప్‌ వార్‌ పొగలు పుట్టిస్తోంది. కాసు ఎన్నార్టీ అనే వాట్సప్ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు మహేష్ రెడ్డి అనుచరుడొకరు. ఆ గ్రూప్‌లో నర్సరావుపేట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలను కూడా చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి… తన సీటుకు ఎసరు పెట్టే కార్యక్రమం జరుగుతోందని అనుమానించి వెంటనే అలర్ట్‌ అయిపోయారు. ఇదే సమయంలో ఆ గ్రూపులో ఉన్న సభ్యులు కొందరు పెట్టిన పోస్టులు చర్చకు దారితీశాయి. మహేష్‌ అనుచరుడు అడ్మిన్‌గా ఉన్న గ్రూప్‌లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫొటోలు, ఆయన కార్యక్రమాల వివరాలు పోస్ట్‌ చేయడం మొదలైపోయింది. దాంతో మండిపోయిన కాసు గ్రూప్‌.. తమ ప్రత్యర్థి ఫోటోలు పెడుతున్న వాళ్ళకు డైరెక్ట్‌గా ఫోన్‌ చేసి ఆ పోస్ట్‌లు వద్దని చెప్పేశారట. వాళ్ళని గ్రూప్‌ నుంచి తొలగించి.. తర్వాత తిరిగి యాడ్‌ చేయడంతో.. కొత్త రకాల అనుమానాలు మొదలయ్యాయి.

Read Also: Tej Pratap Yadav: లాలూ, రబ్రీలను వేధిస్తున్నారు.. దర్యాప్తుకు కుమారుడి డిమాండ్..

నా నియోజకవర్గానికి చెందిన నేతల్ని గ్రూపులో యాడ్ చేయడానికి కాసు ఎవరంటూ గోపిరెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఆయనకు బలం ఉంటే అధిష్టానం దగ్గరికి వెళ్ళి నర్సరావుపేట సీటు తెచ్చుకోవాలేగానీ… ఇలా నియోజకవర్గంలో… అంతర్గత విబేధాలు సృష్టించేలా ప్రయత్నించడం ఏంటని మండిపడుతున్నారట. ఇక్కడే గ్రూప్‌లో ఉన్న నాయకులకు ఓ పెద్ద చిక్కొచ్చి పడింది. వాళ్ళు వాళ్ళు తిట్టుకోవడాలు, మండిపడ్డాల వరకు బాగానే ఉందిగానీ…వాట్సాప్‌ గ్రూప్‌లో ఒకసారి తీసేశారు, మళ్ళీ యాడ్ చేశారు. ఇప్పుడు మేం ఉండాలా వద్దా అంటూ డైలమాలో పడిపోయారట. గ్రూప్‌లో ఉంటే గోపిరెడ్డికి కోపం, ఎగ్జిట్‌ అయితే… కాసుకు కష్టం. ఇద్దరూ కొట్టుకుని మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? మా పాటికి మేమేదో రాజకీయం చేసుకుంటుంటే… ఈ ఎగ్టిట్లు, యాడింగ్‌లు ఎందుకనుకుంటూ ఫైర్‌ అవుతోంది నరసరావుపేట వైసీపీ ద్వితీయ శ్రేణి.

Exit mobile version