మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది కేబినెట్ బెర్త్ ఆశించారు. చివరకు జిల్లాలు.. సామాజికవర్గాల వారీగా ఎమ్మెల్యేలను ఎంపిక చేసి ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. ఈ క్రమంలో మంత్రివర్గంలో చోటు కోసం జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చాలా పోటీపడ్డారు. సామాజిక సమీకరణాలను లెక్క చేయకుండా లాబీయింగ్ చేసిపడేశారు కూడా. చివరకు పోటీ పడినవ వారికి కాకుండా.. సైలెంట్‌గా ఉన్నవారికి అవకాశం దక్కింది. చాలా జిల్లాల్లో జరిగింది ఇదే. ఈ జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా ఉంది. దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరి స్థాయిలో వారు అధిష్ఠానంపై ప్రెజర్ తీసుకొచ్చారు. కానీ.. అవేమీ వర్కవుట్ కాలేదు.
అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అయితే చాలా బలంగానే లాబీయింగ్ చేశారట. ఈ ముగ్గురులో ఒకరు పార్టీలో సీనియర్. మరొకరు పబ్లిక్ అట్రాక్షన్‌లో ఉంటే.. ఇంకొకరు రికార్ట్ విక్టరీ కొట్టారు. కానీ.. ఇవేమీ అధిష్ఠానం ఆలోచనల ముందు అక్కరకు రాలేదు. వీరేకాదు.. చోటు పదిల పర్చుకోవడానికి మాజీ మంత్రి శంకర నారాయణ.. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామిలు సైతం తమ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. తమ ట్రాక్ రికార్డు అధిష్ఠానం దృష్టిలో పడేలా పడరాని పాట్లు పడ్డారు ఎమ్మెల్యేలు.
అందరికీ షాక్ ఇస్తూ.. చివరిలో కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు మంత్రిగా ఛాన్స్ ఇచ్చారు సీఎం జగన్. అప్పటి వరకు మంత్రి అయ్యేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిన ఎమ్మెల్యేలు డీలా పడ్డారు. ఈ పరిణామం వారికి జ్ఞానోదయం కలిగిందనే చర్చ జరుగుతోంది. మంత్రి పదవి కోసం ఎవరికి వారుగా ప్రయత్నాలు చేయడం పెద్ద పొరపాటుగా అభిప్రాయపడుతున్నారట. అదేదో అంతా కలిసి.. ఒకే మాటపై ఉండి.. మనలో ఎవరో ఒకరికి మినిస్టర్ ఛాన్స్ కోరితే బాగుండేదని ఇప్పుడు మథన పడుతున్నారట.
ఇటీవల అనంతపురం ఎమ్మెల్యే కుటుంబంలో నిశ్చితార్థ వేడుక జరిగింది. ఆ ఫంక్షన్‌కు మంత్రులు, మాజీ మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలంతా వచ్చారు. అక్కడే కాసేపు అంతా పిచ్చాపాటిగా మాట్లాడుకున్నట్టు తెలిసింది. కేబినెట్ కూర్పుపై చర్చ జరిగిందట. ఒక్కొక్కరూ తమ మనసులోని మాటను బయటపెట్టినట్టు సమాచారం. మనలో మనమే పోటీపడ్డాం.. చివరకు ఎవరికీ పదవి రాకుండా పోయింది. అంతా కలిసి సీఎం దగ్గరకు వెళ్లి.. మనలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వమని కోరుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారట. మంత్రి ఉషశ్రీచరణ్‌తో కలిసి పనిచేయడం సాధ్యమా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారట.
ఒక్క అనంతపురమే కాదు.. పుట్టపర్తిలో జరిగిన మరో కార్యక్రమంలోనూ మంత్రివర్గంపై పార్టీ నేతల మధ్య చర్చ జరిగిందట. అక్కడ కూడా మంత్రి ఉషశ్రీచరణ్‌తో కలిసి పనిచేయడంపై సందేహాలు వ్యక్తం చేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. నష్టం జరిగిపోయాక.. ప్రస్తుతం ఎంత మాట్లాడుకున్నా ఏం లాభమని కొందరు ఎమ్మెల్యేలు నిట్టూర్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఒక్క ఛాన్స్ మిస్ కావడంతో ఎమ్మెల్యేలు నేల మీదకు వచ్చారని వైసీపీ వర్గాల్లో గట్టి చర్చే జరుగుతోంది.
Watch Here : https://youtu.be/EXfbUEh3eNI