NTV Telugu Site icon

Revanth : రెడ్లకు పగ్గాలు ఇవ్వాలన్న రేవంత్‌ వ్యాఖ్యలపై పార్టీలో దుమారం

Revanthy

Revanthy

కర్నాటకలో జరిగిన రెడ్డి సామాజికవర్గం సమావేశంలో తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ చుట్టూ కాంగ్రెస్‌లో చర్చతోపాటు రచ్చ రచ్చ అవుతోంది. రెడ్లకు పగ్గాలు అప్పగించాలన్న ఆయన కామెంట్స్‌పై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై సీరియస్‌గా స్పందించిన వీ హన్మంతరావు PACలో చర్చిస్తామని ప్రకటించారు. VH లోలోన రగిలిపోతున్నా… పార్టీ నేతలు ఎవరూ మీడియా ముందుకు వెళ్లొద్దన్న రాహుల్‌గాంధీ సూచనలతో వేచి చూస్తున్నట్టు చెబుతున్నారు. అయితే AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి మాత్రం కామ్‌గా ఉండలేదు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌పై ఘాటైన విమర్శలు చేశారు.

పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కాంగ్రెస్ చరిత్ర తెలియదు.. చరిత్ర తెలుసుకుంటే మంచిది అని రేవంత్‌పై గట్టిగానే ఫైర్‌ అయ్యారు మహేశ్వర్‌రెడ్డి. అయితే రేవంత్‌ వ్యాఖ్యలతోపాటు.. మహేశ్వర్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పైనా AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారట. గాంధీభవన్‌లో కూర్చుని .. పీసీసీ చీఫ్‌కు వ్యతిరేకంగా పార్టీ అంతర్గత అంశంపై మహేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడటంపై ఠాగూర్‌ సీరియస్‌ అయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకుడికి ఫోన్‌ చేసి.. అసలేం జరుగుతోంది.. ? అంతా మీ ఇష్టమేనా? అని చిందులు తొక్కారట ఠాగూర్‌. రేవంత్‌ వ్యాఖ్యలపై అభ్యంతరాలు ఉంటే.. వాటిని నేరుగా కాంగ్రెస్‌ అధిష్ఠానానికి చెప్పాలి కానీ.. పార్టీ నాయకులే దానిపై మీడియాకు ఎలా ఎక్కుతారు? పార్టీని ఎలా పలుచన చేస్తారు అని ప్రశ్నలు సంధించారట. ఇంతలోనే ఈ ఎపిసోడ్‌పై బయటకొచ్చిన లేఖ కలకలం రేపింది.

పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. కర్నాటకలో చేసిన కామెంట్స్‌ను తప్పుపడుతూనే.. వైఎస్‌ ఒక్కరి వల్లే 41 సీట్లు వచ్చాయని చెబితే.. అది రాహుల్, సోనియాగాంధీలను అవమానించడమేనని యాష్కీ ఫైర్‌ అయ్యారు. YS సీఎం అయినప్పుడు DS పాత్ర లేదా అని ప్రశ్నలు సంధించారాయన. ఈ లేఖ గురించి తెలియగానే పార్టీ ఇంఛార్జ్‌ ఠాగూర్‌ ట్విట్‌ చేశారు. కాంగ్రెస్‌ అంతర్గత అంశాలపై మీడియా ముందుకు వెళ్లొద్దని ట్వీట్‌ చేశారు. రాహుల్‌ గాంధీ మాట్లాడిన అంశాలను ఆ ట్వీట్‌కు జత చేసి.. అందరినీ హద్దుల్లో ఉండాలని చెప్పకనే చెప్పారు ఠాగూర్‌.

మొత్తానికి రెడ్ల పంచాయితీ కాంగ్రెస్‌లో కొత్త రగడకు బీజం వేసింది. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో రోడ్డెక్కేందుకు నాయకులు రెడీ అయ్యారు. దీనిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సైతం గుర్రుగా ఉంది. రేవంత్ కామెంట్స్‌పైనా హైకమాండ్‌ ఆరా తీస్తున్నట్టు సమాచారం. మరి.. కొత్త పంచాయితీ కాంగ్రెస్‌లో ఎలాంటి సెగలు రేపుతుందో చూడాలి.