తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీగా ముద్ర ఉంది. కాంగ్రెస్‌లో రెడ్ల ఆధిపత్యం ఎక్కువే..! కానీ.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా సామాజిక ఈక్వేషన్ దెబ్బతింటుందనే చర్చ జరుగుతోంది. ఈ విషయం గమనించకుండా.. కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలు ఉంటున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సామాజిక తెలంగాణ అని చెబుతున్న కాంగ్రెస్‌లోనే ఆ సమీకరణాల లెక్క తప్పడంతో కొత్త చర్చ మొదలైంది. పార్టీ నేతల నుంచే పెదవి విరుపు వస్తోందట. నెల రోజుల వ్యవధిలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో మూడు కీలక పదవులను AICC భర్తీ చేసింది. ఆ మూడు పదవులను రెడ్డి సామాజికవర్గానికే ఇవ్వడంపై సొంత పార్టీలోని బీసీ.. ఇతర వర్గాలకు చెందిన నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరికల కమిటీ ఛైర్మన్‌గా జానారెడ్డి పీసీసీ కోశాధికారిగా సుదర్శన్‌రెడ్డి.రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నాక కాంగ్రెస్‌లో పదవుల భర్తీ ఈ మధ్యనే మొదలైంది. ఈ నియామకాలన్నీ AICC నుంచి వస్తున్నా.. కనీసం సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే టాక్ నడుస్తోంది. స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అపాయింట్ చేసిన వారంలోనే మరో రెండు పదవుల భర్తీ జరిగింది. కాంగ్రెస్‌లో ఎవరిని చేర్చుకోవాలి.. ఎవరిని చేర్చుకోవద్దు అనే నిర్ణయించే చేరికల కమిటీకి మాజీ మంత్రి జానారెడ్డిని ఛైర్మన్‌ను చేశారు. అలాగే పీసీసీ కోశాధికారి పదవిని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి అప్పగించారు. ఈ పదవులన్నీ ఒకే సామాజికవర్గానికి కట్టబెట్టడం.. అందులోనూ జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందినవారు కావడం గాంధీభవన్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోందట.
పదవుల పందేరంలో సామాజిక సమీకరణాలు ఎలానూ పాటించలేదు. కనీసం జిల్లాల ఈక్వేషన్లు కూడా చూడకపోతే ఎలా అన్నది కొందరు పార్టీ నేతల ప్రశ్న. ఈ దిశగా ఆలోచన చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోందట. ఆ విషయం పార్టీ పెద్దలకు చెప్పేవాళ్లే లేరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి చేరికల కమిటీ ఛైర్మన్ పదవిని ఒక బీసీకి ఇవ్వాలనే చర్చ జరిగినట్టు సమాచారం. తర్వాత ఏమైందో ఏమో.. చివర్లో జానారెడ్డి పేరు బయటకు వచ్చింది. వడపోతల్లో ఏం జరిగిందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. ఈ కూర్పు.. ప్రకటనలు చూశాక కాంగ్రెస్‌లో బీసీ నాయకులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అంతర్గత సమావేశాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. పీసీసీలో ముఖ్య నాయకుడికి ఒక బీసీ నేత ఫోన్ చేసి.. కాంగ్రెస్‌లో పదవులన్నీ రెడ్లకే ఇచ్చుకోండి.. మేము పల్లకీ మోస్తాం అని ఘాటుగానే చెప్పారట.
మొత్తానికి మూడు పదవుల భర్తీ రేపుతున్న అలజడి కాంగ్రెస్‌లో అంతా ఇంతా కాదు. ఈ మధ్యే ఢిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పార్టీలో ఆధిపత్య, అసంతృప్త సెగలు చల్లారాయి. హమ్మయ్య అని అనుకుంటున్న తరుణంలోనే కొత్త రగడ రచ్చ రచ్చ చేసేలా ఉందని గాంధీభవన్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మరి.. ఈ సమస్యకు పార్టీ పెద్దలు చెప్పే సమాధానం ఏంటో ?