ఎమ్మెల్యే రోజాకు సొంతపార్టీలో అసమ్మతి సెగ ఇప్పట్లో తగ్గేలా లేదా? నిండ్ర ఎంపీపీ ఎంపిక నిద్ర లేకుండా చేస్తోందా? రోజాతోపాటు ఆమె వ్యతిరేకవర్గం ఈ పంచాయితీని తాడేపల్లికి తీసుకెళ్లాయా? ఆధిపత్యపోరులో పైచెయ్యి సాధించేది ఎవరు?
నగరిలో రోజాకు వైసీపీ అసమ్మతి నేతల నుంచి సెగలు..!
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాను వైసీపీలో వరస కష్టాలు వెంటాడుతున్నాయి. సొంతపార్టీ నుంచే ఎదురవుతున్న అసమ్మతితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. వర్గపోరు ఆమెను ఉపిరి సలపకుండా చేస్తోంది. పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత సొంత పార్టీ నేతలతోనే రోజా పోరాడాల్సిన పరిస్థితి. నగరి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నిండ్ర MPP ఎన్నిక ఎమ్మెల్యేకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ ఎపిసోడ్‌లో దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని వైసీపీ నేత, శ్రీశైలం ఆలయ బోర్డు ఛైర్మన్‌గా నియమితులైన రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఎమ్మెల్యేకు సవాల్ చేయడం హాట్ టాపిక్.
నిండ్ర ఎంపీపీ ఎంపికపై రోజా వర్సెస్ చక్రపాణిరెడ్డి..!
నిండ్ర మండలంలో 8 MPTCలకు గాను.. ఏడు చోట్ల వైసీపీ, ఒక చోట టీడీపీ గెలిచాయి. వైసీపీ ఎంపీటీసీలలో రోజా బలపర్చిన ఎంపీటీసీ ఒక్కరే ఉన్నారట. మిగిలిన ఆరుగురికి రెడ్డివారి చక్రపాణిరెడ్డి మద్దతిచ్చారట. దాంతో ఎంపీపీగా తన సోదరుడు రెడ్డివారి భాస్కర్‌రెడ్డిని ఎంపిక చేయాలని చక్రపాణిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే రోజా తిరస్కరించడంతో సమస్య ముదురుపాకాన పడింది. తన వర్గానికి చెందిన దీపను MPPని చేయాలన్నది రోజా డిమాండ్.
తాడేపల్లికి చేరిన నిండ్ర ఎంపీపీ ఎంపిక రగడ..!
ప్రస్తుతం ఎంపీటీసీలలోనూ చీలక వచ్చేసింది. చక్రపాణిరెడ్డి దగ్గర ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలతోపాటు టీడీపీ ఎంపీటీసీ కూడా మద్దతిచ్చారట. మిగిలిన ముగ్గురు వైసీపీ ఎంపీటీసీలు రోజా శిబిరంలో ఉన్నారట. దీంతో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. రోజా.. చక్రపాణిరెడ్డిలు ఉడుం పట్టు పట్టడంతో సమస్య తేలలేదు. ఈ రగడ కాస్తా తాడేపల్లికి చేరింది. రెండు వర్గాలు పోటాపోటీగా ఫిర్యాదు చేసుకున్నాయట. మంత్రి పెద్దిరెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు రోజా. చక్రపాణిరెడ్డి కూడా పెద్దిరెడ్డితోపాటు తాడేపల్లిలోని పార్టీ పెద్దల దగ్గరకు వెళ్లారట.
8న నిండ్ర సమస్య కొలిక్కి వస్తుందా?
మొన్న ఆగిపోయిన ఎంపీపీ ఎన్నికలను తాజాగా చేపట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. 8వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉంది. ఆ రోజున నిండ్ర పంచాయితీ కొలిక్కి వస్తుందా? మళ్లీ వాయిదా పడుతుందో చూడాలి.