తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు తమకు గుర్తింపు లేదని తరచూ నిరసన గళం ఎత్తుతారు. ఒకవేళ గుర్తించి పదవులు ఇస్తే మరోలా స్పందిస్తారు. పార్టీలో కీలక పదవులన్నీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకే ఇచ్చారని.. ఇతర జిల్లాల వారిని పక్కన పెట్టారని గాంధీభవన్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్.. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ.. కోశాధికారి సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. వీళ్లంతా నిజామాబాద్ జిల్లా నాయకులే. మహేష్‌గౌడ్ పూర్తిస్థాయిలో పార్టీ పనిలో ఉంటే.. మధుయాష్కీ తనదైన రీతిలో వెళ్తున్నారు. కోశాధికారిగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి వైఖరే కాంగ్రెస్ నేతలకు మింగుడు పడటం లేదట.
మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికి ఏరికోరి పీసీసీ కోశాధికారిగా పదవి కట్టబెట్టింది AICC. ఆయన మాత్రం ఇంత వరకు గాంధీభవన్ మెట్లు ఎక్కలేదు. కోశాధికారిగా బాధ్యతలు తీసుకోలేదు. ఆ మధ్య గాంధీభవన్ ఇంఛార్జ్ కుమార్‌రావు దగ్గర లెక్కలు చూసుకుని వెళ్లారు తప్పితే.. మళ్లీ పత్తా లేరట. ఒకటి రెండుసార్లు పార్టీ సమావేశాలకు వచ్చినా.. సుదర్శన్‌రెడ్డి వచ్చారా… అవునా అని పార్టీ నేతలు ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉందట. హైదరాబాద్ కేంద్రంగా జరిగే కాంగ్రెస్ కార్యక్రమాలనూ మాజీ మంత్రి పెద్దగా పట్టించుకోవడం లేదట. కేవలం బోధన్ నియోకజవర్గానికే పరిమితం అయ్యారు. రాహుల్ గాంధీని ED ప్రశ్నిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలియజేశాయి. హైదరాబాద్‌లోనూ లీడర్లు కదం తొక్కారు. పార్టీ పదవుల్లో ఉన్నవాళ్లూ.. సీనియర్లు రోడ్డెక్కి నిరసన తెలిపారు. AICC నుంచి ఆదేశాలు వచ్చినా సుదర్శన్‌రెడ్డి ఆ నిరసనల్లో కనిపించలేదని చెబుతున్నారు.
గతంలో పీసీసీ కోశాధికారిగా పనిచేసిన వాళ్లంతా వెంటనే బాధ్యతలు చేపట్టడం.. గాంధీభవన్‌కు తరచూ రావడం కనిపించేది పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. సుదర్శన్‌రెడ్డి వాళ్లందరికీ భిన్నాంగా కనిపిస్తున్నారనేది గాంధీభవన్ వర్గాల అభిప్రాయం. మొన్నటి వరకు పదవులు రాలేదని కినుక వహించి.. తీరా ఆ పదవులు వచ్చాక అలకబూని ఏం చేస్తున్నారో కేడర్‌కే అర్థంకాని పరిస్థితి ఉందట. కాంగ్రెస్ దగ్గర నిధులు ఏమున్నాయి? ఆ మాత్రం దానికి కోశాధికారితో పనేం ఉంటుందని అనుకున్నారో ఏమో.. సుదర్శన్‌రెడ్డి పదవిని లైట్ తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట.