కొత్త కమిటీల కోసం కళ్లల్లో వత్తులు వేసుకొనిమరీ ఎదురు చూస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అదిగో ఇదిగో అని తేదీలు వాయిదా పడుతున్నాయి తప్ప.. ఢిల్లీ నుంచి కబురే లేదు. ఇంతలో బయటకు వస్తున్న లీకులు.. జరుగుతున్న చర్చలు.. అసంతృప్తిని రాజేస్తున్నాయి. దానిపైనే గాంధీభవన్‌లో చర్చ జరుగుతోందట.
పదవుల్లో మార్పులు చేర్పులపై కాంగ్రెస్‌లో కలకలం
పీసీసీ కార్యవర్గంతోపాటు కొత్త డీసీసీల నియామకాలపై తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న మెజారిటీ నాయకులు.. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించడానికి మద్దతు తెలియజేశారు. అలా సపోర్ట్ చేసినవాళ్లంతా ప్రస్తుతం తమ చేతిలో ఉన్న పదవులు పట్ల టెన్షన్‌లో ఉన్నారట. మార్పులు చేర్పుల్లో తమను ఎక్కడ పక్కన పెడతారో అని ఆందోళన చెందుతున్నారట నాయకులు. ఇక పీసీసీ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులు.. కార్యదర్శుల పదవులకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. వీటి కోసం AICC మెట్లు ఎక్కిన నాయకులు కూడా ఉన్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా.. కమిటీల కూర్పు ఇంకా కొలిక్కి రాలేదు. దాంతో కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. పదవులు ఉన్నవారిదో గుబులు.. పదవులు ఆశిస్తున్నవారిదో సమస్య అన్నట్టుగా మారిపోయింది నాయకుల పరిస్థితి.
పీసీసీ కమిటీ ప్రకటించకుండా అడ్డుపుల్ల వేశారా?
ఈ నెల 4నే పీసీసీ కార్యవర్గం ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. కానీ.. AICC నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. కొందరు కాంగ్రెస్ నేతలే కమిటీ కొలిక్కి రాకుండా ఢిల్లీలో అడ్డుపుల్ల వేశారని ప్రచారం జరుగుతోంది. AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడంతో కమిటీ ప్రకటన ఆలస్యమైంది తప్ప.. త్వరలోనే ఆ కబురు వస్తుందని రేవంత్ వర్గం వాదిస్తోంది. ఇదే సమయంలో కొందరు నాయకులతో ఆ కమిటీ సమాచారాన్ని రేవంత్‌రెడ్డి పంచుకుంటున్నారట. సిద్ధిపేట డీసీసీ ప్రెసిడెంట్ పదవికి.. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆరు నెలల క్రితమే రాజీనామా చేశారు. కొత్తగా హరికృష్ణ మరో నేతకు DCCగా పదవి ఇస్తున్నట్టు రేవంత్ వెల్లడించారట. అది నర్సారెడ్డికి నచ్చలేదట. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో బలంగా పనిచేస్తున్నానని.. అలాంటి చోట తనకు వ్యతిరేకంగా ఉన్న హరికృష్ణకు డీసీసీ పదవి వద్దని నర్సారెడ్డి చెప్పారట. అలాగే తనకు పీసీసీలో పదవి వద్దని మాజీ ఎమ్మెల్యే అలక వహించినట్టు సమాచారం.
జాబితా బయటకు రాకముందే అసంతృప్తి సెగలు
ప్రస్తుతం ఈ అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. పలు జిల్లాల కాంగ్రెస్ ముఖ్య నాయకుల వద్ద నర్సారెడ్డి తన అసంతృప్తిని.. ఆవేదనను వ్యక్తం చేశారట. దీంతో కమిటీ జాబితా బయటకు రాకముందే అసంతృప్తి మొదలైతే.. ప్రకటన వచ్చాక ఇంకేం జరుగుతుందో అనే చర్చ మొదలైంది. పీసీసీ కార్యవర్గంతోపాటు ప్రచార కమిటీని సైతం పూర్తిస్థాయిలో నియమిస్తారని ప్రచారం సాగుతోంది. పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మధుయాష్కీ ఒక్కరే ఉన్నారు. ఆ కమిటీలో మరికొందరు సీనియర్లకు చోటు కల్పిస్తారని..ఆ మేరకు పీసీసీ స్థాయిలో కసరత్తు జరిగిందని టాక్. దానిపై AICC నుంచి క్లారిటీ రాలేదట. ఇప్పటికే సవాలక్ష సమస్యలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీ.. కమిటీల కూర్పుతో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమిస్తుందో చూడాలి.