OTR: మంత్రులకు చెక్ పెట్టేందుకు రెండు జిల్లాల ఎమ్మెల్యేలు ఏకమయ్యారా? తమ ఏరియాల్లో వాళ్ళ పెత్తనాలు చెల్లకుండా పర్‌ఫెక్ట్ స్కెచ్ వేశారా? మంత్రుల పర్యటనలో కనిపించకుండా, తమ అనుచరులు రాకుండా పకడ్బందీ ప్రణాళిక ప్రకారం వాళ్ళని అవమానిస్తున్నారా? ఏపీ మంత్రులు ఎవరికి, ఎక్కడ అలాంటి అవమానాలు జరుగుతున్నాయి? ఏ జిల్లా ఎమ్మెల్యేలు సహాయ నిరాకరణ చేస్తున్నారు?. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అయిన మరో మినిస్టర్ బీసీ జనార్థన్ రెడ్డికి షాక్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారట రెండు జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఈ క్రమంలో శాసనసభ్యుల నుంచి ఊహించని స్థాయిలో వేడి తగులుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు మంత్రుల విషయంలో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు మొదట్నుంచి టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉంటూ వచ్చారు. టైం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు ఇటీవల తిరుపతి పార్టీ మీటింగ్‌లో జరిగిన రచ్చ బాగా కలిసి వచ్చింది. దాన్ని సాకుగా చూపిస్తూ… ఇప్పుడు ఏకంగా మంత్రులకే చెక్ పెట్టేలా సొంత ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నారన్న గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. తిరుపతి ఘటనపై పార్టీ అధిష్ఠానం బాగా సీరియస్ అయిపోయి, మంత్రులతో సహా కింది స్థాయి నేతల దాకా అందరికీ గట్టిగానే అక్షింతలు వేసింది. సరిగ్గా ఇదే పాయింట్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్న స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు ఇన్నాళ్ల అసంతృప్తిని ఒక్కసారిగా బయటకు వెళ్ళగక్కుతున్నారట. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఇన్చార్జ్ మంత్రులే మరింత జటిలం చేశారంటూ…. ఆ రచ్చకు సంబంధించి అధిష్ఠానానికి ఫిర్యాదులు పంపడం వెనుక లెక్కలు వేరే ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఈసారి కూటమి ప్రభుత్వంలో అమరనాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్లకు మంత్రి పదవులు ఆశించారు. కానీ… ఊహించని విధంగా రాయచోటి ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డికి బెర్త్ దక్కింది. దానికితోడు ఆయననే చిత్తూరు జిల్లా ఇన్చార్జిగా నియమించడంతో సీనియర్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పోనీ… ఇన్ఛార్జ్ మంత్రి అయినా అందర్నీ కలుపుకుని పోతున్నారా అంటే… అదీ లేదంటున్నాయి పార్టీ వర్గాలు. గడిచిన రెండేళ్లలో ఎమ్మెల్యేలతో కలిసి ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదని చెబుతున్నారు. పుంగనూరు వైపే ఎక్కువగా పర్యటనలు చేస్తూ, కొన్ని నియోజకవర్గాల్లో అసలు అడుగు పెట్టలేదు ఇన్ఛార్జ్ మినిస్టర్. దాంతో… “మీకే అంత ఉంటే … మేం లోకల్ మాకెంత” అంటూ ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు.
పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య తర్వాత కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడం గ్రౌండ్ రియాలిటీని తెలియజేస్తోంది. ఇక అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ బీసీ జనార్థన్ రెడ్డికి తంబళ్లపల్లి, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో సొంత నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురైంది. ఇప్పుడు గ్యాప్‌ను మరింత పెంచడానికి తిరుపతి పంచాయితీనే సరైన టైమ్‌గా ఎంచుకున్నారనేది పార్టీ ఇంటర్నల్ టాక్. తంబళ్లపల్లి, పుంగునూరు ఇన్చార్జ్‌ల మార్పు అంశానికి సంబంధించి తిరుపతిలో మీటింగ్‌పెట్టి పంచాయితీ చేయడంతో అది కొట్లాటకు దారితీసి పార్టీ పెద్దలు సీరియస్ అయ్యేదాకా వెళ్ళింది. కేవలం మంత్రుల అనాలోచిత నిర్ణయాలవల్లే ఆ రోజు పరిస్థితి చేయి దాటి పోయిందంటూ… స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు పెద్దలకు ఫిర్యాదు చేయడం, పార్టీ సైతం స్పందించడంతో అనవసరమైన తలనొప్పి కొని తెచ్చుకున్నామని ఇద్దరు మంత్రులు ఫీలయ్యారట. ఇప్పుడు ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న అన్నమయ్య, చిత్తూరు జిల్లాల ఎమ్మెల్యేలు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటూ ఇద్దరు మంత్రుల్ని జిల్లాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
తంబళ్లపల్లి మల్లయ్య కొండ మైనింగ్ వివాదంలో ఇన్చార్జ్ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఎక్కడా కనిపించకపోగా, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి ఒక్క రోజులోనే సమస్యను సెటిల్ చేశారు. ఇందుకు పార్టీ పెద్దల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయట. జిల్లాలో నాదే పైచేయి అని చెప్పడమే దీని అసలు ఉద్దేశ్యం అని అంటున్నారు. అ షాక్ నుండి బయటపడేలోపు తాజాగా మదనపల్లె నియోజకవర్గ సమావేశానికి వచ్చిన జనార్థన్ రెడ్డికి మరో పెద్ద షాక్ తగిలిందట. పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కార్యాలయానికి వస్తే కనీసం స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే సహా ఏ ముఖ్య నేత రాలేదు. పట్టుమని పది మంది కూడా లేకపోవడంతో మంత్రి తీవ్ర అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారట. మంత్రులకు గౌరవం ఇవ్వకపోవడం, డోస్ పెంచడం లాంటి వాటితో ఎమ్మెల్యేలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారన్నది విశ్లేషకుల మాట. విలువ లేని చోటికి మేమెందుకు వెళ్లాలని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ… జిల్లాల్లో మంత్రుల మాట చెల్లకుండా చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతున్నారనే లోకల్ టాక్. అయితే… సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించాల్సిన నాయకులు ఇలా వర్గాలుగా విడిపోయి పంచాయితీలు పెట్టుకోవడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని అంటున్నారు కార్యకర్తలు. ఇన్చార్జ్ మంత్రులను పూర్తిగా పక్కన పెట్టి తమ ఆధిపత్యం చాటుకోవాలని చూస్తున్న ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఇక్కడితో ఆగుతాయా లేక ఈ గ్యాప్ మరింత పెరిగి పార్టీ పరువు రోడ్డున పడుతుందా అన్నది ప్రస్తుతం కార్యకర్తల్ని వేధిస్తున్న అనుమానం.

