OTR: ఆ టీడీపీ ఎమ్మెల్యేకి నిద్ర పట్టడం లేదా? ఏం చేయాలో అర్ధంగాక అల్లాడిపోతున్నారా? పార్టీ పవర్‌లో ఉంది, నేను సిట్టింగ్‌ని, అయినా… అధికారాన్ని పూర్తి స్థాయిలో అనుభవించలేకపోతున్నానంటూ… లోలోపల రగిలిపోతున్నారా? ఎవరా శాసనసభ్యుడు? ఎందుకంత కష్టం వచ్చింది? ఎన్టీఆర్ జిల్లా సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరైన జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య అండ్ టీం ఇప్పుడు లోలోపల ఉడికిపోతోందట. ఏం చేయాలో అర్ధంకాని ఫ్రస్ట్రేషన్ ఎమ్మెల్యే అంజ్ టీమ్‌లో పెరిగిపోతోందంటున్నారు దగ్గరగా గమనిస్తున్న వాళ్లు. జగ్గయ్యపేట నుంచి టిడిపి తరఫున ఇప్పటివరకు నాలుగు సార్లు పోటీ చేసి మూడు విడతలు గెలిచారు తాతయ్య. 2024 విజయం తర్వాత మంత్రి పదవి కూడా వస్తుందని ఆశించినా… నిరాశే మిగిలింది. దీంతో పార్టీ పొలిట్ బ్యూరో పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించింది టీడీపీ అధిష్టానం.
అయితే…ఈసారి గెలిచినప్పటి నుంచి సొంత పార్టీలో అంటుకున్న కుంపట్లు ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నాయని అంటున్నారు. నియోజకవర్గంలో ప్రతిపక్షంగా వైసీపీతో పనిలేకుండా…కూటమిలోని వాళ్ళే ఆ పాత్ర పోషిస్తున్నారట. టిడిపి లేదా జనసేన నుంచి ఎవరో ఒకరు ఈ సారి తన సీటుకి ఎర్త్ పెడతారని గట్టిగా నమ్ముతున్నారట ఎమ్మెల్యే. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా… టీడీపీతో సహా….నియోజకవర్గంలోని రాజకీయ ప్రత్యర్థులు అంతా కలిసి తమకు ఎర్త్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ శ్రీరామ్ తాతయ్య సోదరులు ఒక అవగాహనకు వచ్చేసినట్టు చెబుతున్నాయి వారి సన్నిహిత వర్గాలు. దీంతో… సిట్టింగ్ ఎమ్మెల్యే కిందికి నీళ్ళు తేవడమంటే అదేం చిన్న విషయం కాదని, బ్యాక్‌గ్రౌండ్ గట్టిగానే ఉండి ఉంటుందన్న చర్చలు నడుస్తున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువ. దీంతో… పోటీ చేసే ఛాన్స్ తమకే ఇవ్వాలని జగ్గయ్యపేట కమ్మ నాయకులంతా కొంత కాలంగా టీడీపీ అధిష్టానం మీద వత్తిడి తెస్తున్నారు. గతంలో అదే సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి నెట్టెం రఘురాం వరసగా ఐదుసార్లు పోటీ చేసి మూడు విడతలు గెలిచారు. రెండు సార్లు వరుసగా ఓడిపోవడంతో… ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీరామ్ తాతయ్యకు 2009 నుంచి అవకాశం ఇస్తోంది టిడిపి అధిష్టానం.
అప్పట్నుంచి నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే….. మూడుసార్లు ప్రత్యర్థిగా ఉన్న సామినేని ఉదయభానుపై గెలిచారు శ్రీరామ్ తాతయ్య. అయితే… గత ఎన్నికల సమయంలోనే కమ్మ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చినా అధిష్టానం మాత్రం తాతయ్యకే మరోసారి ఛాన్స్ ఇచ్చింది. దీంతో… వచ్చే ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా కమ్మ సామాజిక వర్గం నుంచి అభ్యర్థి ఉండాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలో మారుతున్న పరిణామాలు ఎమ్మేల్యే టీమ్‌కు మింగుడు పడ్డంలేందటున్నారు. పైగా… ఈసారి టీడీపీ తరపున జగ్గయ్యపేటలో పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ కుటుంబం సిద్ధమవుతోందట. ఆ ఫ్యామలీ మెంబర్స్‌లో ఒకరు పోటీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. టీడీ జనార్ధన్‌కు చెందిన జయప్రద ఫౌండేషన్ ఇప్పటికే నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఇదే ముందస్తు సంకేతం అని ఎమ్మెల్యే శిబిరం భావిస్తోందట. నియోజకవర్గ టీడీపీలోని ఒక వర్గం ఇప్పటికే టీడీ వెంట ఉందని చెప్పుకుంటున్నారు. దీంతోపాటు మాజీ మత్రి నెట్టెం రఘురాం వర్గం కూడా వారికే సపోర్ట్ చేస్తోందన్నది శ్రీరామ్ తాతయ్య వర్గం మాట. ఇక మొన్నటి వరకు వైసీపీలో ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరటంతో పాటు నియోజకవర్గంలో నెట్టెం రఘురాంతో టచ్‌లో ఉంటున్నారట. ఆ రకంగా సొంత పార్టీలోనే తనను ఒంటరి చేశారని ఎమ్మెల్యే వర్గం అల్లాడిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు టీడీపీలోని తాతయ్య ప్రత్యర్థి వర్గం కూడా ఎమ్మెల్యే, ఆయన సోదరులు వ్యవహారాలపై కూపీ లాగి అధిష్టానానికి సమాచారం చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే సోదరులు అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారనేది పార్టీ వర్గాల మాట. దీంతోపాటు వైసీపీ వారికి అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా పార్టీ పెద్దల చెవిన వేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద ఇలా రకరకాలుగా ఇప్పుడు జగ్గయ్యపేట కూటమిలోనే ప్రతిపక్షం తయారై ఎమ్మెల్యేకి నిద్ర పట్టకుండా చేస్తోందన్నది పొలిటికల్ టాక్.

