Site icon NTV Telugu

Balineni Srinivasa Reddy : బాలినేనిని లైట్ తీసుకున్న అధికారులు..!

Ballineni

Ballineni

Balineni Srinivasa Reddy : పదవితోపాటు మాజీ మంత్రి పరపతి కూడా పోయిందా? తన మెడకు చుట్టుకున్న సిండికేట్‌ ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదా? జిల్లాకు పెద్ద దిక్కు అనుకున్న మాజీ మంత్రి మాటకు విలువ లేకుండా పోయిందట. ఆయన చేసిన సూచనలను అధికారులు లైట్‌ తీసుకున్నారట.

ప్రకాశంజిల్లా వ్యాప్తంగా 25 బార్లకు లైసెన్సులు మంజూరుకు టెండర్లు పిలిచారు ఎక్సైజ్‌ అధికారులు. ఒంగోలు నగరంలోని 15 బార్లతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మరో పదిచోట్ల లైసెన్సులు పొందేందుకు వ్యాపారులు టెండర్లు వేశారు. ఇక్కడే తిరకాసు జరిగింది. జిల్లాలోని పదిచోట్ల బార్ల లైసెన్సుల కోసం పోటీ నెలకొని.. ఎక్సైజ్‌ శాఖకు గతంలో కన్నా రెట్టింపు ఆదాయం వచ్చింది. ఒంగోలు నగరంలో మాత్రం పరిస్థితి తారుమారైంది. 15 బార్లు ఉన్న ఒంగోలు టౌన్‌లో మినిమం ప్రైస్‌కు అటూ ఇటూగా సింగిల్‌ టెండర్‌ పడ్డాయి. ఆన్‌లైన్‌లో అంతా పారదర్శకంగా జరుగుతోందని అధికారులు చెప్పినా ఒంగోలులో ఏం జరిగిందన్నది మిస్టరీగా ఉండిపోయింది.

టెండర్లు మొత్తం ఆన్‌లైన్‌లో నడిచినా ఎక్సైజ్‌ అధికారులకు ఎవరెవరు ఎంతకి టెండర్‌ వేశారో ముందే తెలుస్తుందట. ఆ సమాచారాన్ని లీక్‌ చేసి అందరూ సిండికేట్‌ అయ్యేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆశావహులు పోటీకి రాకుండా సిండికేట్‌లో ఓ వైసీపీ కీలక నేత చక్రం తిప్పారట. మిగతావాళ్లు టెండర్‌ వేయకుండా ఆపేశారనే ఆరోపణలు వినిపించాయి. పైగా గతంలో బార్లు నిర్వహించిన వారిలో 90 శాతం మంది తిరిగి లైసెన్సులు పొందడం చర్చగా మారింది. ఇలా దక్కించుకున్న 15 బార్లలో రెండు భాగాలు వైసీపీ.. ఒక భాగం విపక్ష నేతకు దక్కేలా ముందే ఒప్పందాలు చేసుకుని లైసెన్సులు పొందారని జనసేన నేతలు ఆరోపించారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి మాజీ మంత్రి బాలినేని మెడకు చుట్టుకుంది.

నగరంలో బార్లను బేసిక్‌ ప్రైస్‌కే పొందిన వ్యాపారులు కొంత మొత్తం వసూలు చేసి బాలినేని తనయుడు ప్రణీత్‌రెడ్డికి ఇచ్చారనేది జనసేన ఆరోపణ. ఈ ఆరోపణలపై బాలినేని తీవ్రంగా స్పందించారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేకనే తన కుమారుడు ప్రణీత్‌రెడ్డిని లాగుతున్నారని ఫైర్‌ అయ్యారు. సిండికేట్‌పై గతంలోనే ఫిర్యాదు చేసి తిరిగి టెండర్లు పిలవాలని కలెక్టర్‌ను కోరానన్నారు బాలినేని. ఒంగోలులో కొత్తగా మంజూరైన బార్ల లైసెన్సులను రద్దు చేయించే వరకు తగ్గేదే లేదని తెగేసి చెప్పారు. ప్రతీదానికీ ప్రణీత్‌రెడ్డిని లాగడం సరికాదన్న బాలినేని.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగి విచారణ చేసుకోవచ్చని సవాల్‌ చేశారు.

తన మీద.. తన కొడుకు మీద కూడా ఆరోపణలు రావడం.. బాలినేని సీరియస్‌గా తీసుకోవడం.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో టెండర్లు రద్దు అవుతాయని అంతా అనుకున్నారు. కానీ.. బాలినేని మాట చెల్లలేదు. టెండర్లలో ఎవరైతే లైసెన్సులు దక్కించుకున్నారో వాళ్లే సెప్టెంబరు ఒకటినే బార్లు తెరిచారు. బాలినేని చాలా సీరియస్‌గా ఈ వ్యవహారంపై స్పందించినా కలెక్టర్‌ నుంచి రియాక్షన్‌ లేకపోవడం చర్చగా మారింది. బాలినేని స్థానిక ఒంగోలు ఎమ్మెల్యే. జిల్లా వైసీపీలో కీలక నేత. మాజీ మంత్రి. సిండికేట్‌ విషయంలో ఆయన సీరియస్‌గా ఉన్నా అధికారులు ఎందుకు లైట్‌ తీసుకున్నారు? మీడియాతో మాట్లాడేందుకు ఎక్సైజ్‌ అధికారులు ఎందుకు జంకుతున్నారు? గతంలో సైలెంట్‌గా పనిచేసుకుని వెళ్లిపోయిన అధికారులు ఇప్పుడు రుసరుసలాడుతున్నారు. దీంతో దాల్‌మే కుచ్‌ కలా హై అనే చర్చ సాగుతోంది. అలాగే జిల్లాలో బాలినేని మాటకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై వైసీపీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. మరి.. ఈ అంశంపై మాజీ మంత్రి బాలినేని ఏం చేస్తారో.. స్పందిస్తారో లేదో చూడాలి.

Exit mobile version