Site icon NTV Telugu

Off The Record: సీఎం రేవంత్ ఇన్ని రోజులు ఢిల్లీలో ఎందుకున్నారు.. ఏదో జరిగిపోతోందన్న గుసగుసలు!

Cm Revanth Reddy Delhi Tour

Cm Revanth Reddy Delhi Tour

తెలంగాణ సీఎం రేవంత్‌ హస్తినలో ఏం చేస్తున్నారు?.. మూడు రోజుల నుంచి ఢిల్లీ టూర్‌లో ఉన్న ముచ్చట్లేంటి?.. అంతా పైకి కనిపిస్తున్నది, వినిపిస్తున్నదేనా? లేక అంతకు మించి ఇంకేదో జరుగుతోందా?.. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడం కొత్తకాదు, పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రుల్ని కలవడమూ కొత్త కాదు.. మరి ఇప్పుడే ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు? లెట్స్‌ వాచ్‌.

ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీ హైదరాబాద్‌ టూర్‌ ముగిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిపోయారు. మ్యాచ్‌ చూడ్డానికి వచ్చిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో కలిసి ఉప్పల్ స్టేడియం నుంచే… డైరెక్ట్‌గా ఢిల్లీ వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి. ఓట్‌చోరీ అంటూ 14న అక్కడ రామ్ లీలా మైదానంలో పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు రేవంత్‌. పార్టీ ముఖ్యులతో కూడా భేటీ అయ్యారు. ఇక మంగళవారంనాడు సోనియాగాంధీ, ఇద్దరు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమయ్యారాయన. అంతవరకు బాగానే ఉన్నా… సీఎం ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండటం మీదనే రకరకాల అనుమానాలు, చర్చలు పెరుగుతున్నాయి. వాస్తవానికి సోమవారం ఉదయమే ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారని అంతా భావించారు. కానీ… రాకుండా హస్తినలోనే ఉండిపోయారు. ఆ రకంగా మూడు రోజులు ఢిల్లీలో మకాం వేశారంటే…ఏదో జరిగిపోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం ఢిల్లీ టూర్‌కు ముందే మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌… క్యాబినెట్ పునర్‌ వ్యవస్థీకరణకు కసరత్తు జరుగుతోందని ప్రకటించారు. దీంతో…ఆ విషయమై సీరియస్‌గా వర్కౌట్‌ చేయడం కోసమే ముఖ్యమంత్రి ఇన్నాళ్ళు ఢిల్లీలో ఉన్నారా అన్నది ఒక క్వశ్చన్‌.

అదే సమయంలో అనుబంధ అనుమానాలు కూడా ఉన్నాయి చాలామందికి. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సోమవారం నాడు దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నట్టు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల దాకా ఇదే మాట వినిపించింది. ఎస్పీ బాలు విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారని అనుకున్నా… జరగలేదు. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సీఎం రాకపోవడానికి.. ఢిల్లీ మీటింగ్స్‌కు మించిన ప్రత్యేక కారణాలు వేరే ఉన్నాయా అన్న డౌట్స్‌ వస్తున్నాయి ఎక్కువ మందికి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్రభారతిలో పెట్టడాన్ని వ్యతిరేకించారు కొందరు తెలంగాణ కవులు. రాష్ట్ర గీతంగా ఉన్న జయ జయ జయహే తెలంగాణ పాటను అప్పట్లో పాడటానికి ఎస్పీబీ నిరాకరించారని, అలాంటి గాయకుడి విగ్రహం ఇక్కడ ఎందుకంటూ.. పృధ్వీ లాంటి తెలంగాణా ఉద్యమకారులు అభ్యంతరం చెప్పారు. ఇది మెల్లిగా పెరిగి వివాదాస్పద స్థాయికి చేరుకుంది. అందుకే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్… విగ్రహావిష్కరణకు డుమ్మా కొట్టారన్నది కొందరి విశ్లేషణ. సీఎం రావాలనుకుంటే.. అది పెద్ద విషయం కాదని, వివాదాస్పదమైన టైంలో ప్రోగామ్‌కు అటెండ్‌ అయి అనవసరంగా తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకనుకున్నారో ఏమో… ఢిల్లీలోనే వివిధ కార్యక్రమాల్లో బిజీ అయ్యారన్న చర్చ నడిచింది.

Also Read: TTD News: ధ్వజస్తంభాలు, రథాల కోసం 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టు!

రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి శ్రీధర్ బాబును పంపించి తాను మాత్రం కావాలనే ఢిల్లీలో పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రులతో షెడ్యూల్ పెట్టుకున్నారని అనుమానించే వాళ్ళు సైతం ఉన్నారు. కారణం ఏదైనా… మంగళవారంనాడు ఢిల్లీలో బిజీ షెడ్యూల్‌లోనే ఉన్నారు సీఎం. పార్టీ పెద్ద సోనియాగాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని కలిసి రాష్ట్రంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు సహకరించమని విజ్ఞప్తి చేశారు. మొత్తం 105 స్కూల్స్‌ పెట్టాలనుకుంటున్నందున వీటి కోసం తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్బీఎం నుంచి మినహాయించాలని నిర్మలను కోరారు సీఎం. తర్వాత కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటుకు కావాల్సిన 200 ఎకరాల భూమిని గుర్తించామని చెప్పారు. అనుమతులు మంజూరు చేస్తే అవసరమైన వసతులు కల్పిస్తామని కూడా వివరించారు. ఇలా… కారణం ఏదైనా… ఎవరి అనుమానాలు ఎలా ఉన్నా.. ఈ టూర్‌లో రాష్ట్రానికి కావాల్సిన పలు అంశాల మీద సీఎం రేవంత్‌ దృష్టి పెట్టగలిగారన్నది ఆయన సన్నిహత వర్గాల మాట.

Exit mobile version