Site icon NTV Telugu

Off The Record: తీర్మానం ఆ నేతల కొంపముంచుతుందా?

Maxresdefault (2)

Maxresdefault (2)

ఆ తీర్మానం వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తుందా.? l Off the Record l NTV

ఒక్క తీర్మానం…. ఒకే ఒక్క తీర్మానం. అక్కడ వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. భవిష్యత్‌ రాజకీయం మీద బెంగ పట్టుకుంది. ఈసారి జనం మధ్యకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? ఒకవేళ వెళితే… ఎలాంటి ప్రశ్నలు వస్తాయో… ఏమని సమాధానం చెప్పుకోవాలోనని తెగ టెన్షన్‌ పడి పోతున్నారట అక్కడి అధికార పార్టీ నాయకులు. పైగా ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ సీటున్న పరిధి అది. అధికార పార్టీ నాయకుల్ని అంతలా కంగారు పెట్టిస్తున్న తీర్మానం ఏంటి? ఆ ఏరియా ఎక్కడుంది? అక్కడ జరుగుతున్న పరిణామాలేంటి?

2019లో క్లీన్‌ స్వీప్‌
వై నాట్‌ 175 మూడ్‌లో ఉన్న వైసీపీ నేతల్ని ఇప్పుడు విశాఖ మన్యం షేక్‌ చేస్తోంది. ఇక్కడి ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో అధికార పార్టీది తిరుగులేని ఆధిపత్యం. పార్టీ ఆవిర్భావం నుంచి రెండు దఫాలుగా ఇక్కడ ఫ్యాన్ స్విఛాఫ్‌ చేసేందుకు రాజకీయ ప్రత్యర్థులు వేసిన ఎత్తుగడలు ఫలించ లేదు. అరకు పార్లమెంట్ సహా ఏడు అసెంబ్లీ స్ధానాల్లో గిరిజనుల ఓటు బ్యాంక్ కొల్లగొట్టడంలో సక్సెస్‌ అయింది వైసీపీ.
రంపచోడవరం, అరకు, పాడేరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ స్ధానాలు ఏజెన్సీ పరిధిలో ఉన్నా యి. 2014లో ఒక్క పార్వతీపురం తప్ప అన్నిస్ధానాల్లో గెలిచిన వైసీపీ 2019నాటికి మొత్తం స్వీప్‌ చేసింది. కీలకమైన అరకు పార్లమెంట్ సీటును రెండు సార్లు భారీ మెజారిటీతో గెలుచుకుంది.

అడవి బిడ్డలకు అనుకూల నిర్ణయాలు
పాడేరు, చింతపల్లి, అరకు వ్యాలీ ప్రాంతంలో అడవిబిడ్డలు జీవన్మరణ సమస్యగా భావించే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసింది జగన్‌ సర్కార్‌. పాడేరులో మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం…కొత్త జిల్లాకు విప్లవ వీరుడు అల్లూరి నామకరణం వంటి నిర్ణయాలు ఇక్కడ అధికార పార్టీకి సానుకూలం అయ్యాయి. ఈ ప్రాంతానికి రెండు సార్లు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన ఎస్టీ కమిషన్ చైర్మన్ పోస్టు కట్టబెట్టింది. సీనియర్ నాయకులకు ఎమ్మెల్సీ అవకాశాలు వచ్చాయి. ఇంక అంతా బాగానే ఉంది…. ఏజెన్సీలో హ్యాట్రిక్‌ కొట్టబోతున్నామని వైసీపీ నేతలంతా కూల్‌ కూల్‌గా కూనిరాగాలు తీస్తున్న టైంలో ఉరుము లేని పిడుగులా వచ్చి పడింది అసెంబ్లీ తీర్మానం. అదే ఇప్పుడు ఇక్కడ అగ్గి రాజేస్తోంది. ప్రభుత్వం మీద గిరిజనుల్లో వ్యతిరేకత పెంచుతోంది.
.
బోయలను ఎస్టీల్లో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజున రెండు తీర్మానాలను ఆమోదించింది కేంద్రానికి పంపింది జగన్‌ సర్కార్‌. వీటిలో ఒకటి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కాగా… రెండోది ఏపీలో ఉన్న బోయ కులస్తులను ఎస్టీల్లో చేర్చాలన్న తీర్మానం. ఈ రెండో పాయింట్‌ మీదే మండిపడుతున్నారు మన్యం గిరిజనులు. బోయలను మాతో కలిపి మా అవకాశాలను దెబ్బకొడతారా అంటూ… సీరియస్‌ అవుతున్నారు. ఇంకా మాట్లాడితే వైసీపీ ప్రజా ప్రతినిధులను మా ఏరియాల్లో తిరగనివ్వబోమని వార్నింగ్‌లు ఇస్తున్నారు గిరిజన నాయకులు. ఎమ్మెల్యేలు, ఎంపీ రాజీనామా చేయమని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశం మీదే ఏడు నియోజకవర్గాల పరిధిలో ఆందోళనలు జరుగుతున్నాయి. పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఫ్లెక్సీలకు నిప్పంటించారు. డివిజన్లు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, ర్యాలీలు, సంప్రదాయ ఆయుధాలతో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రజావ్యతిరేకతను ప్రదర్శించేందుకు ఇది తొలి ప్రయత్నంగా చెబుతున్నాయి గిరిజన సంఘాలు. ఈ ఆందోళనలకు మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

తమ అభిప్రాయం తీసుకోలేదని గిరిజన నేతల ఆవేదన
రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలకు కూడా మింగుడుపడటం లేదు. కనీసం అభిప్రాయ సేకరణ లేకుండా… అంత సీరియస్‌ నిర్ణయం తీసేసుకుని చివరిగా… పార్టీ విధేయతకు కట్టుబడమంటే ఎలాగని అడుగుతున్నారు. జరిగే పరిణామాలకు తమ రాజకీయ భవిష్యత్‌ బుగ్గి అవుతుందేమోనన్న బెంగ వారిలో కనిపిస్తోంది. ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే.. 5, 6 షెడ్యూల్స్‌లోని
గిరిజనుల విద్య, ఉద్యోగ,రాజకీయ ప్రాధాన్యతలు తీవ్రంగా ప్రభావితం అవుతాయనే ఆందోళన వుంది. బోయ వాల్మీకులను ఎస్టీలుగా అంగీకరిస్తే భవిష్యత్తులో మరికొన్ని వర్గాలు తమకు రిజర్వేషన్లు ఇవ్వాలనే రాజకీయ డిమాండ్ ను తెరపైకి తీ సుకుని రావొచ్చనే భయం ఆదివాసీ సంఘాల్లో కనిపిస్తోంది. దీంతో మన్యం ప్రాంత ఎమ్మెల్యేలు కక్కలేక మింగలేక సతమతం అవుతున్నారు. ఎంత ఒకవేళ పార్టీ ఇమేజ్ మీద గెలిచినా స్ధానిక పరిస్ధితులకు తామే బాధ్యత వహించాల్సి రావాలికదా..అన్న ఆందోళన కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కదిలించిన రిజర్వేషన్ల తేనెతుట్టె ఎలాంటి ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందోననే టెన్షన్ ఏజెన్సీ ఎమ్మెల్యేల్ని వెంటాడుతోంది. నేరుగా హైకమాండ్ ఎదుట తమ అభిప్రాయాలను చెప్పేందుకు ఆస్కారం లేక పార్టీ ముఖ్యనేతలను ఆశ్రయిస్తున్నారట ప్రజాప్రతి
నిధులు. ఉత్తరాంధ్రలో పార్టీకి పెద్ద దిక్కుగా భావిస్తున్న ఓ సీనియర్ మంత్రి దగ్గరికి వెళ్ళి కొందరు ఎమ్మెల్యేలు తమ ఆవేదనను వెళ్ళగక్కినట్టు సమాచారం.

2017లో ఇదే తీర్మానం చేసిన టీడీపీ సర్కార్‌
వాస్తవానికి బోయ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు కొత్తగా తెరమీదికి వచ్చింది కాదు. 2017లో టీడీపీ సర్కార్ ఇదే తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అప్పటి నుంచి అక్కడే పెండింగ్‌లో ఉండిపోగా..ఈ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించి రిపోర్ట్‌ తెప్పించుకుంది. వివిధ రాష్ట్రాల్లో బోయలు ఎస్టీలుగా చెలామణి అవుతున్నందున ఈ డిమాండ్ సహేతుకమైందనే ఆలోచన వుంది జగన్‌ సర్కార్‌. అయితే టీడీపీకంటే ఈ ఏరియాలో తమకే ఓటు బ్యాంక్‌ ఎక్కువగా ఉన్నందున ఇప్పుడు దాని జోలికి వెళ్ళడమంటే మన వేలితో మన కన్నే పొడుచుకోవడం అవుతుందన్న భయం స్థానిక ఎమ్మెల్యేల్లో ఉంది. ఇదంతా ఒక ఎత్తయితే… అధినాయకత్వం ముందు కనీసం తమ గోడు వెళ్ళబోసుకునే అవకాశం లేకుండా పోయిందన్న అసహనం ఎక్కువ మంది గిరిజన శాసనసభ్యుల్లో కనిపిస్తోంది.

Exit mobile version