Off The Record : నిశ్శబ్ద విప్లవమా.. వ్యూహాత్మక విస్తరణా? తెలంగాణలో బీజేపీ దూకుడు

  • పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌
  • గిరిజన ప్రాంతాల నుంచి గేటెడ్‌ కమ్యూనిటీల దాకా..
  • వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లబ్ది జరుగుతుందన్న లెక్కలు
Bjp

Bjp

తెలంగాణలో చాపకింద నీరులా కాషాయ అజెండా అమలవుతోందా? హిందూ ఐక్యత దిశగా ఒక పథకం ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయా? అన్నీ కలగలిపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ది చేకూరే దిశగా అడుగులు పడుతున్నాయా? రాష్ట్రంలో అసలేం జరుగుతోంది? సంఘ్‌ పరివారం ఏం చేస్తోంది? తెలంగాణ లో పెద్ద ఎత్తున హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. హిందుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ సమ్మేళనాలను RSS నిర్వహిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ప్రస్థానం, పంచ పరివర్తనలపై ఈ సమావేశాల్లో వక్తలు మాట్లాడుతున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి మొదలు పెడితే…. హైదరాబాద్‌లోని గేటెడ్ కమ్యూనిటీల వరకు ప్రతిచోట మీ మీటింగ్స్‌ నడుస్తున్నాయి. ఇలా చేయడం గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యులు పైకి ఎన్ని చెబుతున్నా… అంతిమంగా వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా బీజేపీకి లాభం చేకూర్చడమేనన్న అభిప్రాయాలు పొలిటికల్‌ సర్కిల్స్‌లో బలంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ గల్లీల్లో, గ్రామాల్లో, గిరిజన తండాల్లో , ఆదివాసీ గూడేల్లో కాషాయ జండాలు రెపరెప లాడుతున్నాయి. హిందువుల ఐక్యత కోసం అంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. RSS ఆధ్వర్యంలో ర్యాలీలు తీస్తూ… భజనలు చేస్తున్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమై వందేళ్ళు పూర్తి అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ ఈ హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. హిందూ సమాజంలోని కుల వివక్షను తొలగించి, అందరినీ ఏకం చేయడమే ఈ సమ్మేళనాల ప్రధాన లక్ష్యం అని చెబుతున్నారు. సమాజంలోని అంతర్గత విభజనలను అధిగమించి, అందరూ ఒకటే… హిందూ సమాజంగా కలిసి ఉండాలనే సందేశాన్ని ఈ సమావేశాలు ఇస్తాయని అంటున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ సమ్మేళనాల ద్వారా ఐదు ముఖ్యమైన జీవన సూత్రాలను బోధిస్తోంది.. సామాజిక సామరస్యత, కుటుంబ ప్రభోధన్, పౌర విధులు, స్వదేశీ, పర్యావరణ పరిరక్షణను సమాజంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం జరుగుతోంది. గడప లోపలే కులం- గడప దాటితే మనమంతా హిందువులం… అన్న స్లోగన్‌ను ఈ సమావేశాల ద్వారా గట్టిగా వినిపిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు ఇలాంటి సమ్మేళనాలు వెయ్యికి పైగా జరిగాయట.

 

ఒక్కో మీటింగ్‌లో 500 నుండి వెయ్యి మంది పాల్గొంటున్నట్టు చెబుతున్నారు. ఈ సమ్మేళనాలలో RSS నుండి ఒకరు, ఒక స్వామీజీ, ప్రవచన కర్తలు, మహిళా సామాజిక కార్యకర్తలు పాల్గొని ప్రసంగిస్తున్నారు. వీటికి భారీ స్పందన వస్తోందని rss ప్రతినిధులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నట్టు చెబుతున్నారు. అయితే… ఇవి కేవలం హిందూ ధార్మిక కార్యక్రమాలు మాత్రమే కాదని, రాష్ట్ర రాజకీయం మీద కూడా వీటి ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. హిందూ సమాజం పేరుతో జరిగే మార్పులు, వచ్చే ఐక్యత అంతిమంగా బీజేపీకి లాభిస్తుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అది పార్టీకి అడ్వాంటేజ్‌ అవుతుందన్న లెక్కలున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో.