NTV Telugu Site icon

Off The Record: శైలజానాథ్ పార్టీ మారతారా?

Singana

Singana

శైలజానాథ్ టీడీపీ కండువా కప్పేసుకుంటారా ? శింగనమల టీడీపీలో టికెట్ రేస్..!! | OTR | Ntv

ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇంఛార్జి ఉన్నారో లేదో తెలియదు. టీడీపీ నుంచి టికెట్‌ ఆశించే వారి సంఖ్య మాత్రం పెరిగిపోతోంది. అధినేత సైతం ఎవరైతే బాగుంటారనే సర్వేలు నిర్వహిస్తోంది. ఆ సర్వేల్లో కాంగ్రెస్‌ నుంచి చేరబోయే ఓ నేత టాప్‌లో ఉన్నారట. ఆ విషయం తెలిసి ఆ నాయకుడు ఇంకా దూకుడు పెంచారట.

టూమెన్‌ కమిటీతో పొసగని శ్రావణి
దేనికైనా టైం రావాలంటారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో టీడీపీకి ఆ టైమ్‌ వచ్చిందన్నది తెలుగు తమ్ముళ్ల మాట. కేడర్‌ బలంగా ఉన్నా వాళ్లను నడిపించే బలమైన నాయకుడే లేడు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బండారు శ్రావణికే కొన్నాళ్లు ఇంఛార్జ్‌ పగ్గాలు అప్పగించారు. ఆమె సారథ్యాన్ని వ్యతిరేకిస్తూ గొడవలు జరగడంతో టూమెన్‌ కమిటీ వచ్చింది. నర్సానాయుడు, కేశరెడ్డితో ఆ కమిటీ వేసినా.. ప్రస్తుతం కమిటీలో వీరిద్దరికీ పడటం లేదని తెలుస్తోంది. ఇంతకీ శ్రావణిని ఇంచార్జ్‌గా ఉంచారా లేదా అన్నది కేడర్‌కు క్లారిటీ లేదు. శింగనమల ఎస్సీ రిజర్వ్డ్‌ నియోజకవర్గమైనా.. ఇక్కడ టీడీపీని నడిపేది ఓసీ నేతలే అనే ముద్ర పడింది.

చర్చల్లోకి శైలజానాథ్‌తోపాటు మాజీ జడ్జి పేరు..?
గడిచిన మూడున్నరేళ్లుగా శింగనమల టీడీపీలో గొడవలే గొడవలు. నియోజకవర్గాల్లో పరిస్థితులు తెలుసుకొనేందుకు వన్‌ టు వన్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు టీడీపీ అధినేత. శింగనమల విషయంలో అదే చేశారు. టూమెన్‌ కమిటీని, బండారు శ్రావణిని వేర్వేరుగా పిలిచి మాట్లాడారు. అదే సమయంలో టీడీపీ టికెట్‌ ఎవరికి ఇస్తే బాగుంటుంది అని టూమెన్‌ కమిటీని ప్రశ్నించారట పార్టీ అధినేత. ఆ సందర్భంగా ఏపీసీసీ మాజీ చీఫ్‌, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌తోపాటు ఓ రిటైర్డ్‌ న్యాయమూర్తి పేర్లు చర్చల్లోకి వచ్చాయట.

చాలారోజులుగా టీడీపీలో శైలజానాథ్‌ రాకపై చర్చ
ఇప్పటివరకు శింగనమలలో ఉన్న టీడీపీ నేతలు ఓ ఎత్తు.. శైలజానాథ్‌ రాకతో మరో ఎత్తు అన్నట్టు ప్రచారం సాగుతోంది. శైలజానాథ్‌ టీడీపీలోకి వస్తున్నారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. గతంలో ఇదే శింగనమల నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా పనిచేశారు కూడా. నియోజకవర్గంపై గ్రిప్‌ ఉండటంతో.. కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారట. అయితే పీసీసీ చీఫ్‌ అయిన తర్వాత శింగనమలను శైలజానాథ్‌ పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం ఉంది. పీసీసీ చీఫ్‌ పదవి కోల్పోయాక.. ఆయన దృష్టంతా నియోజకవర్గంపైనే ఉంది. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అందరినీ పలకరిస్తున్నారట. టీడీపీ అధినేత కూడా శింగనమలపై మూడునాలుగు సర్వేలు చేశారట. ఎవరిని అభ్యర్థిగా నియమించాలో లెక్కలు వేసుకున్నారట.

టీడీపీ టికెట్‌ రేస్‌లో శైలజానాథ్‌ ముందున్నారా?
అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చిలో శింగనమల టీడీపీకి కొత్త ఇంఛార్జ్‌ వస్తారని.. అలా వచ్చిన ఇంఛార్జే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెబుతున్నారు. టీడీపీ టికెట్‌ రేస్‌లో శైలజానాథ్‌ ముందు వరసలో ఉన్నారట. ఆయన కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరకపోయినా.. అది లాంఛనమే అనేది స్థానిక తెలుగు తమ్ముళ్ల మాట. మరి.. శింగనమల టికెట్‌ మాజీ మంత్రికి ఇస్తారో లేక గత ఎన్నికల్లో ఓడిన శ్రావణినే ఎంపిక చేస్తారో.. వీళ్లెవరూ కాదని మాజీ న్యాయమూర్తిని పిలిచి పట్టం కడతారో చూడాలి.