OTR : పోటీ చేయడం తప్పా? ఫలితాలు రాబట్టకపోవడం తప్పా?

Ysrcp

Ysrcp

ఎన్నికలకు మూడు నెలల ముందే అధినేత అలర్ట్ చేశారు.. కేడర్‌ను కదిలించారు.. ప్రతి స్థానంలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. కానీ తీరా ఫలితాలు వచ్చాక వైసీపీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. గెలుపు సంగతి తర్వాత కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేక పోయారు. అసలు తేడా ఎక్కడ కొట్టింది? ఫలితాలపై ఫ్యాన్ వర్గాల్లో జరుగుతున్న అంతర్మధనం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు.. వైసీపీకి రాజకీయ పరీక్ష మాత్రమే కాదు.. పార్టీ కేడర్‌లో ఎంతమేరకు పునరుత్తేజం వచ్చిందో నిరూపించుకునే అవకాశం కూడా. అందుకే మూడు, నాలుగు నెలల ముందుగానే పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల కసరత్తు మొదలుపెట్టారు. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు.. ప్రతి స్థానంలో అభ్యర్థులను నిలబెట్టాలి.. గెలుపోటములతో సంబంధం లేకుండా పోరాటం చేయాలని నిర్దేశించారు. కానీ… ఎన్నికల ఫలితాలు మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాలేదన్న చర్చ మొదలైంది. ఒక కార్పొరేషన్.. రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ మాత్రమే పార్టీ ఖాతాలోకి రావడం.. మిగిలిన ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడం పార్టీ వర్గాలను ఆలోచనలో పడేసిందట. గట్టి పోటీ ఇస్తామని.. కొన్ని చోట్ల అనూహ్య ఫలితాలు సాధిస్తామని భావించిన నేతలకు వాస్తవ పరిస్థితి నిరాశ కలిగించాయంటున్నారు. ఎక్కడ తేడా కొట్టిందన్న ప్రశ్న ఇప్పుడు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక్కడే కొందరు నేతల మధ్య మరో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట.ఎన్నికల ప్రక్రియలో ఇన్ని అవరోధాలు ఎదురవుతాయని ముందే అంచనా వేసి బహిష్కరణ నిర్ణయం తీసుకుని ఉంటే.. రాజకీయంగా ఈ స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యేది కాదేమోనన్నది ఆ వర్గం అభిప్రాయం. అయితే ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా కేడర్‌ను నిలబెట్టుకోవాలన్న జగన్ ఆలోచన ముఖ్యం అన్నది మరో వాదన. మొత్తానికి పోటీ చేయడమే తప్పా..?లేక పోటీ చేసి ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడమే అసలు సమస్యా.. అన్నది ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అంతర్మధనం. ఈ చర్చల్లో మరో కీలకమైన అంశం నాయకత్వ బాధ్యత. జగన్ నుంచి పిలుపునిచ్చారు. కేడర్ కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చింది.. కానీ వాళ్ళను చివరి వరకు నడిపించాల్సిన బాధ్యత తీసుకున్న స్థానిక నాయకులు ఎంతవరకు పనిచేశారన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లు ఆశించిన స్థాయిలో యాక్టివ్‌గా లేరని, అభ్యర్థులకు ఆర్థికంగా అండగా నిలబడలేదని చెబుతున్నారు.

కొన్ని సెంటర్స్ లో మేయర్ అభ్యర్ధులకైనా ఆర్ధికంగా వెన్నుదన్ను ఇస్తే ఇంకాస్త టైట్ చేసే అవకాశం ఉండేదని అంటున్నారు. పోరాడాల్సిన అభ్యర్థులు మధ్యలోనే వెనక్కి తగ్గడం.. మరికొన్ని చోట్ల పోటీలో ఉన్నా పూర్తిస్థాయి సహకారం లేకపోవడం పార్టీకి ప్రతికూలంగా మారాయన్న విశ్లేషణలున్నాయి.ఇక్కడ ఒక ఆసక్తికరమైన రాజకీయ వైరుధ్యం కనిపిస్తోంది. పార్టీ అధినేత స్థాయిలో ఎన్నికలపై నిరంతర సమీక్షలు జరిగినా.. క్షేత్రస్థాయిలో మాత్రం సమన్వయం కనిపించలేదంటున్నారు. స్థానిక నాయకత్వపు సమన్వయ లోపం మీదే ఇప్పుడు వైసీపీలో అసలు సమీక్ష జరగాల్సింది ఉందని అంటున్నారు. ప్రత్యర్థి వ్యూహాలను ఎదుర్కోవడంలో విఫలమవడం,సొంత నాయకత్వపు బలహీనతలన్నీ కలిసి దెబ్బ కొట్టాయన్న అనాలసిస్‌లు నడుస్తున్నాయి ఫ్యాన్‌ వర్గాల్లో. ఎన్నికల ఫలితాలను కేవలం అధికార కూటమి వ్యూహానికి ఆపాదిస్తే సరిపోదని.. సొంత పార్టీలో ఎక్కడ లోపాలు జరిగాయో కూడా గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో జరిగినవి ఎన్నిలు కాదు, ఎంపికలంటూ ట్వీట్‌ చేయడం ద్వారా….అక్రమాలు జరిగాయన్న అంశాన్ని చర్చకు పెట్టాలన్న వ్యూహం పార్టీ అధినేతకు ఉన్నట్టు కనిపిస్తోందంటున్నారు వైసీపీ లీడర్స్‌. ఎన్నికల ప్రక్రియపై పోరాటం ఒకవైపు.. పార్టీ సంస్థాగత బలాన్ని తిరిగి పెంచుకోవడం మరోవైపు.. ఈ రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వైసీపీ నాయకత్వానిది. కేడర్‌ను మళ్లీ రోడ్డు మీదకు తీసుకురావడం జగన్‌కు సాధ్యమైందా అన్నది ఒక ప్రశ్న అయితే.. ఆ కేడర్‌ను గెలిపించే స్థాయిలో జిల్లా, నియోజకవర్గ నాయకత్వాన్ని తయారు చేయగలరా అన్నది మరో ప్రశ్న.. కూటమిపై రాజకీయ పోరాటం చేస్తూనే.. సొంత పార్టీలో బాధ్యత తీసుకోని నాయకత్వం మీద చర్యలకు సిద్ధం కావాల్సిన టైం వచ్చిందని అంటున్నారు.