OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్

Yc

Yc

ఆ ఎమ్మెల్యేకి కలిసి వచ్చేలా ఇంచార్జ్ కమిషనర్ చక్కగా చక్క పెడుతున్నారా? అందుకే అసలు పోస్టింగ్ వదిలి..కొసరు పోస్టింగ్‌నే కాపాడుతున్నారా? గత ప్రభుత్వంలో అదే ప్లేస్‌లో ఆర్డీవోగా ఉండి…అప్పట్లో తప్పని చెప్పినవి ఇప్పుడు రైట్ చేస్తున్నారా..? పాత పరిచయాలతో వైసిపి నేతలకు….ఎమ్మెల్యేకి మధ్య కమీషనర్ అనుసంధాన కర్తగా పనిచేస్తున్నారా? సీఎం చంద్రబాబు చివాట్లు పెట్టినా…అదే కమిషనర్‌ను కొనసాగించడంలో సదరు ఎమ్మెల్యే కథేంటి? కాకినాడ సిటీ టిడిపి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు నియోజకవర్గం మొత్తం కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. కాకినాడ జిల్లాకి హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సత్యనారాయణ ఉన్నారు. ఆయనకు కాకినాడ కమిషనర్ గా అదనపు బాధ్యతలు కూడా ఉన్నాయి. గతంలో ఉన్న ఐఏఎస్ కమిషనర్ కు, ఎమ్మెల్యేకి వ్యవహారాలు తేడా రావడంతో ఆమెను పంపించేశారు. అప్పటి నుంచి ఇంఛార్జిగా సత్యనారాయణ ఉన్నారు. హౌసింగ్ పీడీ అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ కి జిల్లా ఇంఛార్జి. అసలు బాధ్యతలు అవే అయినప్పటికీ సత్యనారాయణకు హౌసింగ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండడం లేదట. అదనపు బాధ్యతలు ఉన్న కాకినాడ కమిషనర్ అంటే మాత్రం తెగ లైక్ చేసేస్తున్నారట. అసలు హౌసింగ్ ఆఫీస్ కి కూడా సరిగా వెళ్లడం లేదని ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. ఇదే సత్యనారాయణ గత ప్రభుత్వంలో కాకినాడ ఆర్డీవో గా, జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేశారు. కాకినాడ మూడో బ్రిడ్జి నిర్మాణం ప్లాన్ విషయంలో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కి కావాలని వ్యతిరేకంగా పనిచేశారని సత్యనారాయణపై అప్పట్లో టిడిపి నేతలు తెగ టార్గెట్ చేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయట. ఎమ్మెల్యే కి కావాల్సిన పనులు చేయడంలో కమిషనర్ సీనియార్టీ పెరిగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇక్కడే పని చేయడంతో ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. దాంతో ఎమ్మెల్యేకి ఉపయోగపడేలా వ్యవహరిస్తున్నారట కమిషనర్. ఏ పనులు కావాలన్నా ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తే..కరెక్ట్ గా పర్సంటేజ్ ఉంటుందని ఎమ్మెల్యే కి దగ్గరయిపోయారట కమిషనర్.

కమిషనర్ అన్ని వ్యవహారాలను చాలా స్మూత్ గా చెక్కపడుతున్నారని ఎమ్మెల్యే కూడా తెగ ఎంకరేజ్ చేస్తున్నారట. మనవాళ్ళు అయితే మిగిలేదేమి ఉండదని బయట వాళ్లయితే టెన్షన్ లేకుండా ఠంచన్ గా అన్నీ సెట్ అయిపోతాయని అంటున్నారట. అలా అయితే ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా అని స్వామి భక్తి చాటుకుంటున్నారట. మీరు అలా చూస్తూ ఉండండి…పని చేసిన వాళ్ళకి చేయించుకున్న వాళ్ళకి మధ్యలో ఉన్న వాళ్ళకి అందరికీ కలిసి వచ్చేలా ఉంటాయి కదా అని చెప్తున్నారట. అసలు టెండర్లు లేకుండానే తమకు నచ్చిన వాళ్లకు పనులు అప్పగిస్తున్నారట. వాటికి కూడా ఒక రేటు ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో తెలుగు తమ్ముళ్లు తెగ ఫీల్ అయిపోతున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలను విరోధులుగా భావించి… ఇప్పుడు మాత్రం వాళ్లే సూపర్ అంటన్నారని తమ్ముళ్లు ఫీలవుతున్నారట. డబ్బు రాజకీయాలు అలాగే ఉన్నాయని చర్చించుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారట. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లోనూ కమిషనర్ వేలు పెట్టేస్తున్నారట. బిల్డింగ్‌ నిర్మాణాల అనుమతి విషయంలో ఎమ్మెల్యే మనుషులు జోక్యం ఉంటుందని ముందే చెప్పేస్తున్నారట. దానికి అనుగుణంగా ప్రైస్ కూడా డిసైడ్ చేసేసారట. కాంట్రవర్సీ భూములను ఎమ్మెల్యేకి అనుకూలంగా సెట్ చేయడంలో కమిషనర్ నాలుగు ఆకులు ఎక్కువే చదివారని అంటున్నారు.. అందుకే ఎమ్మెల్యే కూడా ఇంఛార్జి గా ఆయనే ఉండాలి గాని ఫుల్ చార్జ్ కమిషనర్ అవసరం లేదని చెప్పేస్తున్నారట. అన్ని పనులు సౌఖ్యంగా సౌలభ్యంగా అయిపోతుంటే కొత్త ఇబ్బందులు ఎందుకని గుర్తు చేస్తున్నారట ట్రెండింగ్ ఎమ్మెల్యే. దాంతో ఈ వ్యవహారంపై కార్పొరేషన్ లో పెద్ద రగడే జరుగుతోంది.

కమిషనర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే ఫ్రెండ్‌షిప్‌పై తుని పర్యటనలో సీఎం చంద్రబాబు చెవిలో కొందరు వేశారని తెలుస్తోంది. అందుకే అందరి ముందే చంద్రబాబు కమిషనర్‌పై ఇంతెత్తున ఫైరయ్యారు. నీ పనితీరు ఏం బాగాలేదని క్లాస్ తీసుకున్నారు. సీఎం సార్ అంత మాటా అన్నా…ఆయన్నే ఇంఛార్జ్‌ కమిషనర్‌గా కొనసాగించేందుకే ఎమ్మెల్యే పట్టుబడుతున్నారట. మొత్తానికి ఇంఛార్జి కమిషనర్ తీరు ఎమ్మెల్యేకి తెగ నచ్చేసింది.. గతంలో ఆర్డీవో గా అలా ఫాలో అయ్యారు. ఇప్పుడు కూడా అందరికీ ఉపయోగపడేలా ఉంటున్నారు కదా అంటున్నారు వెంకటేశ్వరరావు. దాంతో తమ్ముళ్లు తెగ ఫీల్ అయిపోతున్నారు.. పనుల్లో వైసీపీ వాళ్లకు ఉన్న ప్రయారిటీ మనకు లేదని గుసగుసలు ఆడుకుంటున్నారు.