కొత్తొక వింత.. పాతొక రోత.. అన్నట్టుగా ఆ నియోజకవర్గంలో YCP పరిస్థితి తయారైందా? పార్టీ ఆవిర్భావం నుంచి పోరాడుతున్నా… ఒక్కటంటే ఒక్కసారి కూడా జెండా ఎందుకు ఎగరలేదు? పైగా… చెల్లి పెళ్ళి జరగాలి మళ్లీ మళ్లీ… అన్నట్టు పదే పదే ఇన్ఛార్జ్‌లను ఎందుకు మారుస్తోంది? ఏకంగా ఐదోసారి ఇన్ఛార్జ్‌ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? టిడిపి కంచుకోట…. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని వైసీపీ అధిష్టానం ఉవ్విళ్ళూరుతున్నా… ఎప్పటికప్పడు ఆశించిన ఫలితం మాత్రం దక్కడం లేదు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలంగా కనిపిస్తున్నా… నడిపించే నాయకత్వ లోపమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రతిసారి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇన్చార్జ్‌లను మారుస్తూ వస్తున్నారే తప్ప వాస్తవాలను తెలుసుకోవడంలో పార్టీ పెద్దలు ఫెయిలవుతున్నారని వైసీపీ కేడరే అంటోంది. ఇప్పటికే నాలుగు సార్లు ఇన్చార్జ్‌లను మార్చిన అధిష్టానం… అచ్చంగా ఐదోసారి కొత్త నేతను తెరపైకి తీసుకువచ్చింది. నిన్న మొన్నటి వరకు ఈ పదవిలో ఉన్న పీవీఎల్ నరసింహారాజు స్థానంలో యోగేంద్ర కుమార్ అలియాస్ బాబును నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 2019, 24 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన పివిఎల్ నరసింహారాజు స్థానంలో ఉన్నఫళంగా కొత్త నేత రావడంతో…. ఉండిలో వైసీపీకి కనీస మార్కులు వస్తాయా లేదా అనే చర్చ మొదలైంది. దాదాపు 10 ఏళ్లపాటు ఇన్చార్జిగా ఉన్న నరసింహరాజు క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంలో 100కి 200 శాతం ఫెయిల్ అయ్యారనేది వైసీపీ నేతల మాట. వర్గ విభేదాలు తారాస్థాయిలో ఉన్నా.. క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించినా.. నాకేం సంబంధం లేదన్నట్టు ఆయన వ్యవహరించిన తీరుతో పార్టీ పరిస్థితి అయోమయం గందరగోళం అన్నట్టుగా తయారైందని చెబుతున్నారు. తాజాగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో అయినా ఉండి నియోజకవర్గంలో వైసిపి పుంజుకుంటుందా అంటూ లోకల్ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. టిడిపి ఆవిర్భావం తర్వాత 2004లో మినహా ఇప్పటి వరకు ఉండిలో ఓడిపోయింది లేదు. అలాంటి నియోజకవర్గంలో జెండా ఎగరేయాలంటే క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకుడికి అవకాశం ఇవ్వాలనేది కార్యకర్తల డిమాండ్.
కానీ… ప్రస్తుత పరిస్థితి చూస్తే…. ఒకరిద్దరు నాయకులు తమ ఆధిపత్యం కోసం వారికి నచ్చిన వారికి అవకాశాలు ఇస్తున్నారు తప్ప…. బలమైన నాయకుడి కోసం ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి. గతంలో పివిఎల్ నరసింహరాజుకు వ్యతిరేకంగా పనిచేసిన యోగేంద్ర కుమార్ కు బాధ్యతలు అప్పగించినంత మాత్రాన అధిష్టానం ఆశిస్తున్న ఫలితం దక్కుతుందా అన్నది కేడర్ క్వశ్చన్. తరచూ ఇన్ఛార్జ్‌లు మారడం వల్ల పార్టీ కోసం కష్టపడే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారట. కొత్తగా వచ్చే ఇంచార్జి పాత కేడర్‌ను కలుపుకోకపోవడం, తన సొంత వర్గాన్ని ప్రోత్సహించడం వల్ల అసమ్మతి పెరుగుతోందని అంటున్నారు వైసీపీ నేతలు. ఉండిలో వైసీపీ బోణీ కొట్టాలంటే కేవలం ఇన్ఛార్జ్‌ని మారిస్తే సరిపోదని.. ఎన్నికల కోణంలో కాకుండా కనీసం 4-5 ఏళ్ల పాటు ఒకే నాయకుడికి బాధ్యతలు ఇచ్చి, నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ కూడా ఉండాలని సూచిస్తున్నారు కార్యకర్తలు. లోకల్ పాత, కొత్త నాయకులను ఒకే వేదికపైకి తెచ్చి వర్గ పోరును నివారిస్తే తప్ప అధిష్టానం ఆశిస్తున్న ఫలితం దక్కదనే అభిప్రాయం సైతం ఉంది. వాస్తవానికి ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి బలంగానే ఉన్నప్పటికీ ఇన్ఛార్జ్‌ల వరుస మార్పుల వల్ల స్థిరత్వం లేకపోవడం ఓటమికి ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే నాయకులు లేక పార్టీ వెనుకబడిందని అంటున్నారు. ఆ రకంగా ఉండి నియోజకవర్గం వైసీపీ కొత్త ఇన్ఛార్జ్‌కి సవాలేనని చెబుబుతున్నారు.కనీసం ఇప్పటినుంచైనా కొత్త ఇంచార్జి నేతృత్వంలో విభేదాలు పక్కనబెట్టి తీవ్రంగా శ్రమిస్తే తప్ప ఉండిలో వైసీపీలో జెండా ఎగరదన్నది స్థానిక కార్యకర్తల మాట.

