OTR : ఉమ్మడి విశాఖ కూటమి పార్టీల్లో విచిత్ర ధోరణి

Tdp

Tdp

ఆ ఎమ్మెల్యేలంతా సూపర్ సీనియర్లు. బరిలోకి దిగితే ఒక్కొక్కళ్ళది బాహుబలి రేంజ్ ఇమేజ్. కానీ…, సెల్ఫ్ పబ్లిసిటీకి ఇచ్చిన ప్రాధాన్యం పార్టీకి, ప్రభుత్వానికి ఇవ్వడం లేదట. ప్రతిపక్షం రోడ్డెక్కి పొట్టు పొట్టున తిడుతున్నా… ఖండించడానికి వాళ్ళకు నోళ్ళు పెగలడం లేదట. తొడగొట్టి ఛాలెంజ్ చేయాల్సిన శాసనసభ్యుల్లో ఎందుకా నిర్లిప్తత….? కూటమి పార్టీల అధినేతలను దుమ్మెత్తి పోస్తున్నా చలించడం లేదన్న విమర్శలు ఎదుకు పెరుగుతున్నాయి? ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి పార్టీల్లో ఇప్పుడో విచిత్రమైన ధోరణి కనిపిస్తోంది. మొత్తం 15 స్థానాలకుగాను NDA 13 చోట్ల విజయం సాధిస్తే….పాడేరు, అరకు సీట్లలో వైసీపీ పట్టు నిలబెట్టుకుంది. జనసేన ఏకంగా నాలుగు సీట్లు గెలుచుకుని ఇక్కడ నుంచే పటిష్టమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రణాళికలు చేసుకుంటోంది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద ఫోకస్ చేయడంతో…. అనేక కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. డేటా సెంటర్స్‌, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఇతర పెట్టుబడులతో ఒక రకమైన అభివృద్ధి వాతావరణం క్రియేట్‌ అవుతోంది. అయితే… దీన్ని క్యాష్‌ చేసుకుంటూ…. రాజకీయంగా వాడుకోవడంలో విఫలమవుతున్నామన్న చర్చలు కూటమిలో జరుగుతున్నాయట. జరుగుతున్న అభివృద్ధి మీద టీడీపీ అధినాయకత్వం విస్తృతంగా ప్రమోషన్ చేస్తుంటే…. పార్టీ శాసన సభ్యులు మాత్రం ఆ విషయంలో వెనుకబడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. జిల్లా స్థాయి నేతలు ప్రకటనలు చేసినా… అవేవీ సోషల్ మీడియాను దాటి ప్రజలను ఆలోచింపజేసే స్థాయిలో ఉండటం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ విషయం టీడీపీ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లిందట. ఉమ్మడి జిల్లా కు వస్తున్న ప్రాజెక్టులపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను… వైసీపీ వెంటబడి మరీ క్రెడిట్ చోరీ ఆరోపణలు చేస్తోంది. రైల్వేజోన్ వంటి విషయంలోనూ టీడీపీ చేసుకుంటున్న క్లెయిమ్‌ను వాపక్షాలు ఎండగడుతున్నాయి. ఉమ్మడి కృషి ఫలితంగా జోన్ వస్తే మధ్యలో మీ పబ్లిసిటీ ఏంటి గురూ…అంటూ చురకలు అంటిస్తున్నారు కామ్రేడ్లు. KK లైన్ లేకపోతే… జోన్ వల్ల ప్రయోజనం ఏంటో చెప్పాలని, డేటా సెంటర్ల వల్ల వచ్చే ఉద్యోగ , ఉపాధి అవకాశాలపై నిజాలు బహిర్గతం చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఆ రకంగా విపక్షాలు ధ్వజమెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తుంటే తలుపు చెక్కలతో తగులుకోవాల్సిన కూటమి ఎమ్మెల్యేలు.. తమల పాకులు పట్టుకుని తిరుగుతున్నారనే అపప్రద ఉంది. ఇక, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఇటీవల విశాఖ వేదికగా ప్రభుత్వం ముందు కీలక అంశాలను చర్చకు పెట్టారు. అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే వాటిని పరిష్కారం కోసం వున్న మార్గాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన్ని ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకుందో తెలియదు గానీ…. ఒక సెక్షన్ ప్రజల్లో విస్తృతమైన చర్చ అయితే జరిగింది.

చేసిన అభివృద్ధి ప్రజలకు చెప్పండని హైకమాండ్ పోరు పెడుతున్నా… ఎమ్మెల్యేలు మాత్రం తూ.తూ. మంత్రం యవ్వరాలే చేస్తున్నారట. ఇక ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లలో ఎక్కువ సామాజిక పెన్షన్లు, వైద్య సంబంధిత అభ్యర్థనలు కావడంతో వాటిని పరిష్కరించడం జఠిలంగానే వుందని అంటున్నారు. ఈ కారణాలను చూపించి కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజలకు కూడా దూరంగానే ఉంటున్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు ఎక్కువయ్యాయి. పులిమీద పుట్రలా పెట్రోల్, డీజిల్ బాదుడు తోడైందని కేడర్ కలవరపడుతోంది. అటు వైసీపీ మాత్రం గట్టిగానే ఇరుకున పెడుతోంది. కానీ… కౌంటర్ చెయ్యాల్సింది ఎమ్మెల్యేలు మాత్రం కామ్‌గా ఉండటం టీడీపీ పెద్దలకు కూడా మింగుడు పడ్డం లేదట. ఎవరికి వాళ్ళు నియోజకవర్గం, అక్కడ పరిణామాలు చూసుకుంటున్నారు తప్ప విపక్షాన్ని ఇరుకునపెట్టే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. చివరికి పవన్, చంద్రబాబు, లోకేష్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నా… ఖండించాలన్న స్పృహ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోందట ద్వితీయ శ్రేణి. పల్లా శ్రీనివాస్, అనిత, బండారు లాంటి నేతలు కొంతమేర ఎదురు దాడి చేస్తున్నా…. వాళ్ళ లక్ష్యం డైరెక్ట్‌గా ప్రతిపక్ష నేత కావడంతో పెద్దగా ప్రజల్లోకి చేరడం లేదు. అదే సమయంలో వైసీపీ, ఇతర విపక్షాలు లేవనెత్తుతున్న విమర్శలు మాత్రం ప్రజల్లోకి వెళుతున్నాయి. ఇటీవల పెన్షన్స్‌కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిరసన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంపై వ్యంగ్యాస్త్రాలు,సీఎంపై ఏకవాక్య ప్రయోగాలు చేశారు. కానీ… నిశితమైన, నిర్ధిష్టమైన ఆరోపణలు వస్తున్నప్పుడు వాటిని ఖండించడం…నిలబెట్టి కడిగేయడంలో అధికార కూటమి ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారన్న అసహనం మూడు పార్టీల ద్వితీయ శ్రేణిలో పెరుగుతోందట. వాళ్ళలో చలనం కోసం పార్టీల పెద్దలు ఏం చేస్తారు? చేసినా రియాక్షన్‌ ఎలా ఉంటుందన్న డౌట్స్‌ కేడర్‌లో పెరుగుతున్నాయి.