OTR : టంగ్ స్లిప్పా? పబ్లిసిటీ స్టంటా? శంకర్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు చిక్కులు!

Shankar

Shankar

టంగ్‌ స్లిప్‌ అన్న పదానికి ఆ ఎమ్మెల్యే బ్రాండ్‌ అంబాసిడర్‌లా మారిపోయారా? వెనకా ముందూ చూసుకోకుండా… ఏది పడితే అది, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడం, ఆనక నాలుక్కరుచుకోవడం ఆయనకు పరిపాటి అయిపోయిందా? కులం, గోత్రం… ఉచ్ఛం, నీచం అన్నవేవీ పట్టింపు లేకుండా… మైండ్‌లో అనిపిస్తే బ్లైండ్‌గా మాట్లాడేస్తున్న ఆ వంకరయ్య ఎవరు? ఆయన నోటి దురదతో కాంగ్రెస్‌ పార్టీ ఎలా ఇబ్బంది పడుతోంది? అసలది టంగ్‌ స్లిప్పా? లేక పబ్లిసిటీ స్టంటా? కే. శంకరయ్య అలియాస్ వీర్లపల్లి శంకర్. షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. తానొక ప్రజాప్రతినిధిని, గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానన్న సంగతే మర్చిపోయి నోటి దురద తీర్చుకుంటూ ఉంటారన్నది తెలంగాణ పాలిటిక్స్‌లో సార్‌కున్న బ్రాండ్‌ ఇమేజ్‌. గతంలో ఒక ఇంటర్వ్యూలో… వెలమ సామాజిక వర్గంపై నోరు పారేసుకున్నారాయన. వెలమల వీపులు విమానం మోతలు మోగుతాయ్. వాళ్ళను తెలంగాణలో లేకుండా చేస్తా, భౌతిక దాడులు చేస్తానని అనడంతో పాటు… ఖబడ్దార్ వెలమలు అంటూ హెచ్చరించడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై రాష్ట్రంలోని వెలమ సంఘాలు భగ్గుమన్నాయి. సంఘాల నేతలు వివిధ పోలీస్ట్‌ స్టేషన్స్‌లో ఫిర్యాదులు చేశారు కూడా. దాంతో… పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్… శంకర్‌కు షోకాజ్ నోటీస్‌ ఇచ్చారు. ఆ దెబ్బకు దిగివచ్చిన ఎమ్మెల్యే… “నా మాటల్ని వక్రీకరించారంటూ రొటీన్‌ పాట పాడారు. తాను కామెంట్ చేసింది వెలమ కులాన్ని కాదని…. ఒకవేళ తన మాటలు వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే వెనక్కి తీసుకుంటున్నానంటూ వివరణ ఇచ్చుకున్నారు . ఇక మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ టార్గెట్‌గా శ్రుతి మించి మాట్లాడి అభాసుపాలయ్యారు ఎమ్మెల్యే శంకర్. ఇప్పుడు వాటన్నిటికీ మించి మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారాయన.

కేసీఆర్ ఇంటి దగ్గర చావుడప్పు కొట్టడమే కాదు….. ఆయన చావు కోరుకుంటున్నానంటూ నోరు పారేసుకున్నారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే మాటలు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్నే రేపాయి. ఓ పక్క అసెంబ్లీ ఎపిసోడ్‌, ఎమ్మెల్సీల అరెస్ట్ ఎపిసోడ్‌పై హీట్ పాలిటిక్స్ కొనసాగుతుండగానే …. కేసీఆర్‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో సీన్ రివర్స్ అయిందంటున్నారు. ఆయన మాటలపై
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. షాద్ నగర్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే శంకర్ దిష్టిబొమ్మలు దహనం చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. ఇక ఈసారి కూడా తనదైన శైలిలో నాలుక మడతేశారు శంకర్‌. పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రతిపక్షనేతగా ఉన్నారు కాబట్టి… కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానని, ఆయన్ని గౌరవిస్తానని… కాకుంటే… ఫ్లో లో అలాంటి మాటలు వచ్చాయంటూ కవరింగ్‌ ఇచ్చుకున్నారాయన. దీంతో… ముందు నోటి దురుసు ప్రదర్శించడం, తేడా కొట్టగానే…నా ఉద్దేశం అదికాదంటూ వివరణ ఇచ్చుకోవడానికి కిందా మీదా పడటం ఆయనకు పరిపాటిగా మారిపోయిందంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. అసలు ఆయనది పబ్లిసిటీ స్టంట్‌ కూడా అయి ఉండవచ్చన్నది కొందరి డౌటనుమానం. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కాకముందు ఒక లెక్క…. అసెంబ్లీ మెట్లెక్కాక మరో లెక్క అన్నట్లు ఎమ్మెల్యే శంకర్ వ్యవహార శైలి ఉందంటూ స్థానిక కాంగ్రెస్‌ కేడర్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందు నుంచి ఉండి తన గెలుపుకోసం పనిచేసిన వారిని ఇప్పుడు పక్కన పెట్టేశారని, కొందరికే పెద్దపీట వేస్తూ, ఉద్దేశపూర్వకంగా కొన్ని సామాజిక వర్గాల వాళ్ళను పక్కకు నెట్టేశారని షాద్ నగర్ హస్తం శిబిరంలోనే చర్చ జరుగుతోంది. ఇక ఇదే సమయంలో షాద్‌నగర్‌లో తాను చదువుకున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకుంటూనే…. పారిశ్రామిక వేత్తలు , వ్యాపారుల నుంచి ఫండ్ కలెక్ట్ చేశారన్నది విపక్షం మాట. మొత్తం మీద ఎమ్మెల్యే శంకర్ నోటి దురుసు మాటలు అటు పార్టీని ఇరకాటంలో పెట్టడంతో పాటు , సొంత ఇమేజ్‌ను కూడా డ్యామేజ్ చేస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్ విశ్లేషిస్తున్నాయి.